*🕉️సాక్షాత్కారం.....!*
*ఆత్మ సాక్షాత్కారం వేరు, దైవ సాక్షాత్కారం వేరు. మొదటిది జరగడమే కష్టం. అది జరిగితే రెండోది తనంత తానుగానే సంభవిస్తుంది. ఆత్మ సాక్షాత్కారానికి ఆధ్యాత్మికవేత్తలు కొన్ని మార్గాలు సూచించారు.*
*ఆత్మ సాక్షాత్కారం కలగడానికి పూర్వజన్మ వాసనా బలం కలిగి ఉండాలంటారు కొందరు. సాధకుడి మనసులో తొలుత కొన్ని ప్రశ్నలు ఉదయిస్తాయి. కంటికి కనిపిస్తూ, నిరంతరం పరిణామం చెందుతున్న ఈ సృష్టికి మూలం ఏమిటి, దాని వెనక దాగిన శక్తి ఏమిటి? ఇంత అద్భుతంగా గతి తప్పకుండా సాగుతున్న ఈ కదలికలకు, అనేక చర్యలకు చోదకశక్తి ఏది లాంటి ప్రశ్నలవి. వాటికి సమా ధానాలు తెలుసుకోగలిగితే ఆత్మజ్ఞానం కలగడం సులువేనని చెబుతారు ఆధ్యాత్మికవేత్తలు. అవి కచ్చితంగా భాగవతంలో మాత్రమే దొరకుతాయి.*
*భాగవతంలో ఏదో ఒక పద్యాన్నో, ఘట్టాన్నో చదవడం మొదలెడితే- ఆపై వారి ప్రమేయం లేకుండానే లోపలికి, ఇంకా లోతులకు తీసుకెళ్లిపోతాయవి. ఆ క్రమంలో పాఠకుల మనసుల్లో ఉత్కంఠ, జిజ్ఞాస బయలుదేరతాయి. మరికొన్ని ప్రశ్నలూ పుడతాయి. ఇలా... భాగవతంలోని విషయం చదువరులను అలౌకిక పరమార్థ స్థితికి చేరుస్తుంది. ఆత్మజ్ఞానం కలగడానికి భాగవతం ఎలా దోహదకారి కాగలదనే సందేహం కలగవచ్చు. దాని ఆవిర్భావానికి దారితీసిన ఘటనలే అందుకు కారణమనే సమాధానమూ ఆ వెంటనే వస్తుంది. అది సంస్కృత భాషలోదా, తెలుగు భాషలోదా అన్న సందేహం అక్కర్లేదు. రెండు భాషల్లోనూ భాగవత ఆవిర్భావ నేపథ్యం అదే.*
*వ్యాసుడు భారతాన్ని రచించాడు. ఏకరాశిగా ఉన్న వేదాలను వ్యాసం (నాలుగుగా) చేశాడు (అందుకే వేదవ్యాసుడనే పేరు పొందాడు.) పురాణాలు, ఉపపురాణాలు రచించాడు. అయినా ఏదో వెలితి మనసును ఆవరించుకుని ఉంది. స్తబ్ధుగా కూర్చుని ఆలోచనలో పడిపోయాడు. నారదుడు ప్రత్యక్షమై ఎందుకలా ఉన్నావని అడిగాడు. వ్యాసుడు చెప్పాడు. అప్పుడు నారదుడు వ్యాసుడితో- 'నువ్వు ఇంత వరకూ లౌకిక విషయాలకు సంబంధించిన రచనలే చేశావు. పారమార్ధిక చింతనను ప్రేరేపించే రచనలు చెయ్యలేదు. ఆ లోటు తీర్చే దిశగా ప్రయత్నాలు చెయ్యి' అని సలహా ఇచ్చాడు. ఆ మాటను సాక్షాత్తు విష్ణుమూర్తి చెప్పిందిగా భావించి (నారదుడు విష్ణు అంశ సంభూతుడని, ఆయన ధరించిన ఇరవై ఒక్క అవతారాల్లో ఇదీ ఒకటనే అభిప్రాయం ప్రచారంలో ఉంది) భాగవత రచనకు పూనుకొన్నాడు.*
*అనువాదానికి సిద్ధమైనప్పుడు పోతన పరిస్థితీ అదే. నారాయణ శతకం, భోగినీ దండకం మొదలైన గ్రంథాలను రచించాడు. అయినా ఏదో అసంతృప్తి తొలుస్తోంది. మనశ్శాంతి కోసం గోదావరి తీరంలో సైకత వేదిక మీద పద్మాసనం వేసుకుని ధ్యానంలో కూర్చున్నాడు. ఆ క్షణంలో ఆయన పక్కన తళుక్కున ఒక మెరుపు మెరిసింది. ఉత్తర క్షణంలో శ్రీరామచంద్రమూర్తి 'శ్రీమహాభాగవతాన్ని తెలిగించు, నీ భవబంధాలన్నీ తొలగిపోతాయి' అని పలికి అంతర్థానమైపోయాడు. కర్తవ్యం బోధపడింది. ఆనంద పరవశుడై- పలికేది భాగవతం, పలికించేవాడు రామభద్రుడు, (కాబట్టి) నేను పలికితే పాపాలను హరించే కావ్యం అవుతుంది. (ఇన్ని లాభాలు ఉన్నప్పుడు) భాగవతాన్ని కాకుండా వేరే విషయాన్ని ఎందుకు పలుకుతాను (పలకను) అని ఆంధ్రీకరణకు పూనుకొన్నాడు. ఈ భాగవతాన్ని భవిష్యత్తులో చదివేవారెవరైనా ఆధ్యాత్మిక మార్గానికి మరలాలని అభిలషించాడు. అందుకు తగ్గట్లు అందులో ఎన్నో సూక్తులు, బోధనలు, భక్తి భావనా విషయాలు, భగవంతుడి కథలు, లీలలు వంటి ముక్తిదాయక విషయాలు చెప్పారిద్దరూ.*
*ఇలా... ఆత్మ సాక్షాత్కారం పొందిన దరిమిలా దైవ సాక్షాత్కారమై వ్యాసుడు, పోతన రచించి, అనువదించిన పురాణమే భాగవతం. అందుకే భాగవతాన్ని చదువుతున్నప్పుడు ఎవరైనా ఏ భేదాలు లేకుండా కేవలం భక్తిభావం కలిగి ఉంటారు. అలా నిర్వికార, నిరామయ చిత్తంతో పారాయణ చేసేవారు ఆత్మసాక్షాత్కారం పొందినవారుగా మారిపోతారు. ఫలితంగా వారికి ఆముష్మిక భావనే తప్ప ఐహిక భావనలుండవు!*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి