17, జూన్ 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -273*

 *తిరుమల సర్వస్వం -273*

 *సుప్రభాత గానం 3* 

*ఒకటవ శ్లోకం*


*"కౌసల్యా సుప్రజా రామ పూర్వాసంధ్యా ప్రవర్తతే,* 

*ఉత్తిష్ఠ నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికమ్."*


*శ్లోకార్థం* 


 కౌసల్యామాత పుత్రరత్నమైన రామచంద్రా! తూర్పున తెల్లవారుచున్నది. నరులలో శార్దూలము (అనగా సింహం) వంటి శ్రీరామా! దేవదేవునికి నిత్యకైంకర్యాలు సమర్పించే సమయ మాసన్నమైంది. మేలుకో!


*తాత్పర్యం - భావార్థం:*  


 దశావతారధారి, విశ్వవ్యాపి, ఘటనాఘటన సమర్థుడు యైన శ్రీవేంకటేశ్వరుణ్ణి ఎలా సంబోధించాలి? సుప్రభాతగానం దేనితో ప్రారంభించాలి? అన్న సంశయం ఎదురైనప్పుడు శ్రీమహావిష్ణువుకు ఏ అవతారంలో, ఏ మహాపురుషుడు, ఎలా, ఏ సందర్భంలో మేలుకొలుపు పాడారో మన్నన్ స్వామి మననం చేసుకున్నాడు. వెనువెంటనే వాల్మీకి రామాయణం వారి మదిలో మెదిలింది. యాగ సంరక్షణార్థం తనతో వచ్చి, రాత్రి అరణ్యంలో విశ్రమించిన శ్రీరామచంద్రుణ్ణి మరునాటి ఉదయం విశ్వామిత్రుడు ఏవిధంగా మేలుకొలిపాడో తలపుకు వచ్చింది. స్వామివారిని తన మనోఫలకంపై త్రేతాయుగ అవతారమైన శ్రీరామచంద్రునిగా చిత్రించుకున్నాడు. తక్షణం వారి నోటినుండి పై శ్లోకం వెలువడింది.


 వన్యమృగాలకు మృగరాజే (అనగా సింహం) మకుటం లేని మహారాజు. శ్రీరాముణ్ణి శార్దూలంతో పోల్చడం ద్వారా ఈ శ్లోకంలో వారిని నరులందరికి రారాజుగా వర్ణించడం జరిగింది.


 రాముడే దేవుడు. వారింకెవరిని అర్చించుకోవాలి? అనే సంశయం మన మదిలో ఉత్పన్నమయ్యే ఆస్కారముంది. శ్రీరాముడు తన అవతార పరిసమాప్తి వరకు మానవమాత్రుని గానే ప్రవర్తించి, మానవ సహజమైన కష్టనష్టాలను అనుభవించాడు. వాటన్నింటినీ స్థిరచిత్తంతో సహించి, విపత్కర పరిస్థితులను వీరోచితంగా ఎదుర్కొన్నాడు గానీ విష్ణువుగా తన మహత్తును ప్రదర్శించలేదు. సముద్రాన్ని లంఘించాల్సి వచ్చినప్పుడు వానరసేనతో వారధి నిర్మింపజేశాడు గానీ వైకుంఠం లోని క్రీడాపర్వతాన్ని తెచ్చి అవలీలగా పుడమిపై ప్రతిష్ఠించిన తన భృత్యుడైన గరుత్మంతుణ్ణి, తన సేనలను ఆవలివడ్డుకు చేర్చవలసిందిగా ఆదేశించలేదు. ఆ మహత్తర కార్యాన్ని గరుడుడు తృటిలో నిర్వహించగలడు. కానీ, రాముడు యుగధర్మాన్ని పాటించి, సామాన్య మానవునిలా మసలుకొన్నాడు. కావున శ్రీరామచంద్రుడు సైతం పురుషార్థసాధనలో భాగంగా దేవతారాధన చేయాల్సిందే.



 *రెండవ శ్లోకం*


*"ఉత్తష్టోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ,* 

*ఉత్తిష్ఠ కమలాకాన్త త్రైలోక్య మంగళం కురు."*


*శ్లోకార్థం*   


 గోవిందా! గరుడధ్వజాన్ని చిహ్నంగా గలిగిన రాజాధిరాజా! లక్ష్మీనాథా! సత్వరమే మేలుకో... మేలుకొని ముల్లోకాలకు శుభాలను కలుగజేయి.


*తాత్పర్యం - భావార్థం:*  


 శ్రీవేంకటేశ్వరుణ్ణి మొదటి శ్లోకంలో శ్రీరామచంద్రునిగా సంబోధించిన అణ్ణన్ స్వామివారు; రెండవ శ్లోకంలో *'గోవిందా'* అంటూ శ్రీమహావిష్ణువు యొక్క మరో ఉత్కృష్ట అవతారమైన శ్రీకృష్ణునిగా కీర్తించారు. గోకులంలో గోవర్ధనగిరి నెత్తి గోవులను రక్షించడం ద్వారా శ్రీకృష్ణుడు గోవిందుడు అయ్యాడు. గోవులతో, గోపకులతో శ్రీకృష్ణుని కానాడు ఉన్న అనుబంధం నేటికీ కొనసాగుతోంది. ఈనాటికీ, ప్రతినిత్యం శ్రీనివాసుని ప్రథమ దర్శనభాగ్యం ఒక గొల్లవానికే లభిస్తుందని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం.


 ఈ శ్లోకంలో శ్రీనివాసుణ్ణి 'గరుడధ్వజం' చిహ్నంగా కలిగిన వానిలా కూడా కవివరేణ్యులు వర్ణించారు. శ్రీనివాసునికి తన వాహనము, సేవకుడు అయిన గరుత్మంతునితో ఆత్మీయ సంబంధం ఉంది. శ్రీవారి ధ్వజంలో (జెండా) ఉండే చిహ్నం కూడా గరుత్మంతుడే.


 గరుడధ్వజారోహణతో ముల్లోకవాసులకు ఆహ్వానం పలుకుతూ ఆరంభమయ్యే బ్రహ్మోత్సవాలు అదే ధ్వజాన్ని అవనతం చేయడంతో ముగుస్తాయి. 


 ఆర్తత్రాణపరాయణుడైన ఆనందనిలయుడు గరుడుని పేరు విన్నంతనే పులకించిపోయి, తన కారుణ్యకాంతులను ప్రసరింప జేస్తాడని అణ్ణన్ స్వామివారు ఆకాంక్షించారు. 


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: