17, జూన్ 2025, మంగళవారం

మహాభారతము

 k*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ప్రథమాశ్వాసము*

*410 వ రోజు*


*శల్యుడి పరాక్రమము*


సుషేణుడి మరణంతో కౌరవసేనలు పారిపోయాయి. అది చూసి శల్యుడు సింహంలా ఘర్జిస్తూ కౌరవ సేనలు పారి పోకుండా నిలిపాడు. తిరిగి కౌరవ సేనలు పాండవసేనలతో తలపడ్డాయి. ధర్మరాజుకు రక్షణగా భీమసేనుడు, సాత్యకి, ధృష్టద్యుమ్నుడు, శిఖండి, ఉపపాండవులు, నకుల సహదేవులు నిలిచారు. శల్యుడు వారితో ముందుగా యుద్ధం చేస్తున్నాడు.ఇంతలో ప్రభద్రక సేనలు, పాంచాల సేనలు శల్యుడిని చుట్టుముట్టాయి. శల్యుడు వారిని శరవర్షంలో ముంచెత్తి వారందరిని యమసదనానికి పంపాడు. అది చూసిన సుయోధనుడు సంతోషించాడు. అది చూసి ధర్మరాజు శల్యుడిని ఎదుర్కొన్నాడు. శల్యుడు ఒక నారాచమును ధర్మరాజు శరీరం చీల్చుకు పోయేలా ప్రయోగించాడు. అదిఛూసిన భీముడు ఏడు బాణములు, నకులుడు అయిదు బాణములు, సహదేవుడు తొమ్మిది బాణములు ఉపపాండవులు అనేక బాణములు వేసి శల్యుడిని ఎదుర్కొన్నారు. అది చూసి కృతవర్మ, కృపాచార్యుడు, శకుని, ఉలూకుడు శల్యునికి సాయంగా వచ్చారు. శల్యుడు భీమసేనుడి హయములను చంపాడు. భీముడు తన గద తీసుకుని కౌరవ సేనలను తనుమాడసాగాడు. సహదేవుడు శల్యుని మీద ధారాపాతంగా బాణములు వేసాడు. శల్యుడు సహదేవుడి హయములను చంపాడు. శల్యుడి కుమారుడు రుక్మాంగదుడు సహదేవుడిని ఎదుర్కొన్నాడు. సహదేవుడు కత్తి తీసుకొని కత్తి తీసుకుని తన రథం మీద నుండి కిందికి దూకి రుక్మాందుడి వైపు వెళ్ళి అతడి రథము మీద లంఘించి అతడి తలను తన కత్తితో నరికాడు.


*భీమసేనుడు శల్యుడిని ఎదుర్కొనుట*


కుమారుడి మరణం కళ్ళారా చూసిన శల్యుడుకోపం తట్టుకొన లేక పాండవ సైన్యాలను దునుమాడసాగాడు. శల్యుడు ధర్మరాజు మీద అతిక్రూర మైన బాణమును వేసాడు. అది చూసి భీముడు తన గద తీసుకుని కిందము దిగి శల్యుడి రథానికి కట్టిన అశ్వములను చంపాడు. శల్యుడు భీముడి మీదకు తోమరం విసిరి భీముడి గుండెలను చీల్చాడు. భీమసేనుడు ఆ తోమరమును లాగి దానితో శల్యుడి సారథిని చంపాడు. శల్యుడు ముద్గర అనే ఆయుధము తీసుకుని రథము నుండి కిందికి దిగాడు. భీముడు తన గదాయుధంతో శల్యుడిని ఎదుర్కొన్నాడు. ఇరు పక్షముల సేనలు యుద్ధం ఆపి వారి గదాయుద్ధం చూడసాగారు. శల్యుడు, భీముడు సింహఘర్జనలు చేస్తూ గుండ్రముగా తిరుగుతూ రెండు ఏనుగులవలె ఢీకొన్నారు. గదా ఘాతములతో శరీరం రక్తసిక్తం అయింది. ఒకరిని ఒకరు కొట్టుకుని మూర్ఛ పోయారు. అది చూసి కృపాచార్యుడు శల్యుని తన రథం మీద ఎక్కించుకుని తీసుకు వెళ్ళాడు. భీముడు మూర్ఛ నుండి తేరుకొని శల్యుడి కొరకు వెదుకుతో పెద్దగా అరుస్తున్నాడు. ఇంతలో చేకితానుడి ఆధ్వర్యంలో పాండవసేన భీముని ముందుకు వచ్చి కౌరవసేనలను ఎదుర్కొంది. సుయోధనుడు చేకితానుడి మీద ఒక ఈటెను బలంగా విసిరి చేకితానుడిని చంపాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: