18-21-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అII రాజసజ్ఞానమును చెప్పుచున్నారు-
పృథక్త్వేన తు యజ్జ్ఞానం
నానా భావాన్పృథగ్విధాన్
వేత్తి సర్వేషు భూతేషు
తజ్జ్ఞానం విద్ధి రాజసమ్
తా:- ఏ జ్ఞానమువలన మనుజుడు సమస్తప్రాణులందును వేర్వేరువిధములుగ నున్న అనేక జీవులను వేర్వేరుగా నెరుంగుచున్నాడో, అట్టి జ్ఞానమును రాజసజ్ఞానమని తెలిసికొనుము.
వ్యాఖ్య:- ప్రపంచమునగల ప్రాణులలో "వీడువేఱు, వీడువేఱు - అని యీ ప్రకారముగ అనేకత్వమును జూచుట ఉత్తమజ్ఞానముకాదు. అది రాజసమేయగును. అట్టి జ్ఞానముకలవా రొకవ్యక్తిని చూచినపుడు ఆతని గుణమును పరికించుదురేకాని ఆత్మను కాదు. కనుకనే వారు వ్యక్తులలో భిన్నత్వమును జూచుదురు. ఇట్టి రాజసజ్ఞానమునే యిపుడు ప్రపంచమున పెక్కురు కలిగియుండుచున్నారు. ఏలయనగా వారు ప్రాణులలో భిన్నత్వమునే గాంచుచున్నారు. కావున అద్దానిని తొలగించుకొని అద్వైతభావమును, సమదృష్టిని అవలంబించవలెను (దిండ్లపై గలీబులపై దృష్టినుంచక లోనగలదూదిపైననే దృష్టిగలిగి యుండునట్లు).
ప్ర:- రాజసజ్ఞానముయొక్క లక్షణమేమి?
ఉ:- ప్రపంచములో అనేకత్వమునుజూచుట, సర్వజీవులందును " వీడు వేఱు, వీడు వేరు" అను భేదభావము గలిగియుండుట.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి