*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*శల్య పర్వము ప్రథమాశ్వాసము*
*412 వ రోజు*
*కురుపాండవ సమరం*
సుయోధనుడు ధృష్టద్యుమ్నుని ఎదుర్కొని వాడి అయిన అయిదు బాణములు ధృష్టద్యుమ్నుడి మీద వేసాడు. ధృష్టద్యుమ్నుడు ప్రతిగా సుయోధనుడి మీద డెబ్బై బాణాలను ప్రయోగించాడు. అది చూసిన సుయోధనుడి తమ్ములు అన్నకు సాయంగా వచ్చి ధృష్టద్యుమ్నుని ఎదుర్కొన్నారు. ధృష్టద్యుమ్నుడు కోపించి వారి మీద వాడి అయిన బాణములు ప్రయోగించాడు. శిఖండి ప్రభద్రకులు కృపాచార్యుడు, కృతవర్మలను ఎదుర్కొన్నారు. శల్యుని నకులసహదేవ, భీమ, ధర్మరాజాదులు ఎదుర్కొని సమరం సాగిస్తున్నారు. పోరు ఘోరంగా సాగుతుంది. నకులుడు శల్యుని మీద పది బాణములు వేసాడు. శల్యుడు నకులుని మీద మూడు బాణములు ప్రయోగించి నకులుడి విల్లు విరిచాడు. అయిదుగురు యోధులూ శల్యుని ఎదుర్కొన్నారు. శల్యుడు జంకక వారందరిని తన బాణములతో నొప్పించాడు. సుయోధనుడు తన సైన్యముతో శల్యునికి సాయంగా వచ్చాడు. కృష్ణార్జునులు తమ సైన్యములను ఒక చోట సమీకరించారు. అర్జునుడు కృపాచార్యుని, సహదేవుడు శకునిని, ఉపపాండవులు కౌరవ పక్షాన పోరాడుతున్నమిత్రరాజుల్ను, శిఖండి అశ్వత్థామను, భీముడు సుయోధనుని, ధర్మరాజు నకులుడితో చేరి శల్యుని ఎదుర్కొన్నారు. ఇరు పక్షముల మధ్య ఘోరంగా పోరు సాగుతుంది. శల్యుడు అంతటా తానే అయి సమరం సాగిస్తున్నాడు. మధ్యాహ్న సూర్యుడికి ప్రతిబింబంలా వెలిగి పోతున్న శల్యుడి పరాక్రమానికి పాండవసేనలు ఆగ లేక వెనుకంజ వేస్తున్నాయి. అది చూసి ధర్మరాజు చేతులు ఊపుతూ సైన్యాలను ఉత్సాహపరచి తమ్ములను దగ్గరకు పిలిచి " మీరంతా మీమీ పరాక్రమానికి అనుగుణంగా భీష్మ, ద్రోణ, కర్ణాది యోధులను చంపారు. ఈ రోజు నేను మహా వీరుడైన శల్యుడిని చంపుతాను. ఎలాగంటే నారధముకు కుడి వైపున నకులుడు, సాత్యకి ఎడమ వైపున సహదేవుడు, ధృష్టద్యుమ్నుడు రక్షణగా ఉంటారు. వెనుక అర్జునుడు, ముందు భీముడు ఉంటారు. ఎందుకంటే శల్యుడికి రక్షణగా కృపాచార్యుడు, కృతవర్మ, అశ్వత్థామ, శకుని నిలుస్తారు " అన్నాడు. ధర్మరాజు చెప్పినట్లే ధృష్టద్యుమ్నుడు, పాండవులు నిలిచారు. అది చూసిన సుయోధనుడు శల్యునికి రక్షణగా కృపాచార్య, కృతవర్మ, అశ్వత్థామ, శకునులను నిలిపాడు. ధర్మరాజు శల్యుని ఎదుర్కొన్నాడు పోరు ఘోరంగా సాగుతుంది.
*శల్యవధ*
అర్జునుడు కృపాచార్యుని, కృతవర్మను ఎదుర్కొన్నాడు. శల్యుని సైన్యం ధర్మరాజును చుట్టుముట్టింది. ధర్మరాజు కోపంతో విజృంభించాడు. రథములు విరుగుతున్నాయి. గజములు, హయములు కుప్పలుగా చచ్చి పడుతున్నాయి. రణరంగం అంతా బీభత్సంగా ఉంది. ధర్మరాజు శల్యుడు తమ శంఖములు పూరించి యుద్ధముకు తలపడ్డారు. ఒకరి మీద ఒకరు అస్త్రప్రయోగం చేసుకుని శరీరాలను రక్తసిక్తం చేసుకున్నారు. శల్యుడు ధర్మరాజు విల్లు విరిచాడు. ధర్మరాజు మరొక విల్లు తీసుకుని శల్యుడి విల్లు విరిచి ఎడతెరిపి లేకుండా మూడు వందల బాణములు వేసి శల్యుని హయములను చంపి, కేతనము విరిచాడు. శల్యుడు రథము మీద కూలబడ్డాడు. ఆది చూసిన ఆశ్వత్థామ శల్యుడిని తన రథము మీదకు ఎక్కించి తీసుకు వెళ్ళాడు. శల్యుడు పడిపోగానే ధర్మరాజు పొలికేకలు పెడుతూ విజృంభించాడు. కౌరవ సేనలను ఎదుర్కొని తరుముతున్నాడు. ఇంతలో శల్యుడు మూర్ఛ నుండి తేరుకుని మరి ఒక రథము మీద ఎక్కి ధర్మజుని ఎదుర్కొన్నాడు. తనను ఎదుర్కొన్న ధృష్టద్యుమ్న, నకుల సహదేవ, సాత్యకులను వాడి అయిన బాణములతో కొట్టి తప్పించి తిరిగి ధర్మరాజును ఎదుర్కొన్నాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి