🌹🌷🏹🪔🛕🪔🏹🌷🌹
*🌷గురువారం 19 జూన్ 2025🌷*
``
*రామాయణం*
ఒకసారి చదివినంత
మాత్రాన మన సమస్త
పాపాలని తీసేస్తుంది.``
*వాల్మీకి రామాయణం*
*73వ భాగం*
```
సీతమ్మ తన జుట్టుని ఆ శింశుపావృక్షం యొక్క కొమ్మకి గట్టిగా బిగించి చనిపోదామని సిద్ధపడుతున్న తరుణం లో ఆమెకి శుభశకునములు కనపడ్డాయి.
సరోవరంలో నీటి పైభాగమునందు అరవిసిరిన తెల్ల పద్మమునకు నీటి లోపలికి కాడ ఉంటుంది. ఆ నీటిలోకి ఉండిపోయిన కాడ పక్కకి ఒక చేప వచ్చి నిలబడింది. ఆ చేప అక్కడినుంచి వెళ్ళిపోయేముందు తన తోకని కదిపి వెళ్ళిపోయింది. అప్పుడా తోక వెళ్ళి ఆ పద్మము యొక్క కాడకి తగలడం వలన ఆ కాడ కదిలింది, కాడతోపాటు పైన ఉన్న పువ్వు కూడా కదిలింది. ఆ పువ్వు ఎలా కదిలిందో సీతమ్మ కన్ను కూడా ఆ సమయంలో అలా అందంగా అటూ ఇటూ కదిలింది.
అప్పటిదాకా పైన ఉండి సీతమ్మని చూస్తున్న హనుమంతుడు అనుకున్నాడు… 'ఈశ్వరానుగ్రహం చేత నాకు సీతమ్మ దర్శనం అయ్యింది. రావణుడిని చూశాను, రావణుడు సీతమ్మతో మాట్లాడిన మాటలు విన్నాను, త్రిజటా స్వప్నం విన్నాను. సీతమ్మని జగన్మాతగా తెలుసుకున్నాను. నేను సీతమ్మని చూశాను అన్న విషయాన్ని ఇప్పుడే వెళ్ళి రాముడికి చెప్పలేను, ఎందుకంటే అమ్మ ఇప్పుడు ఉరి పోసుకుంటోంది. నేను ఇప్పుడు సీతమ్మని ఓదార్చాలి. ఇప్పుడు నేను అమ్మని ఓదార్చి మాట్లాడకుండా వెళ్ళిపోతే, రేపుపొద్దున్న సీతమ్మ ఉరి పోసుకొని చనిపోయిందన్న విషయం రాముడికి తెలిస్తే ఆయన బాణముల చేత ఈ సమస్త బ్రహ్మాండములను క్షోభింప చేస్తాడు. నేను చాలా పండితుడని అనుకున్న వివేచనాశీలత లేని మంత్రి చేత, దూత చేత కార్యములు చెడిపోతాయి. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? నేను గట్టిగా మాట్లాడితే చుట్టూ ఉన్న ఈ రాక్షస స్త్రీలు నా మాటలని విని, నా మీదకి వస్తారు. అప్పుడు నాకు-వాళ్ళకి యుద్ధం జరుగుతుంది.
జయాపజయములను విధి నిర్ణయిస్తుంది. కాని రాముడు లంకా పట్టణాన్ని చేరేలోపల నేను చేసిన అల్లరి చేత సీతమ్మని రావణుడు వేరొకచోట దాచవచ్చు.
ఇప్పుడు నేను వానర భాషలో మాట్లాడితే సీతమ్మకి ఆ బాష అర్ధం కాదు. మనుష్య భాషలో మాట్లాడితే రాక్షసులు గుర్తు పడతారు. వానరరూపంలో ఉన్న నేను మనుష్య భాషలో మాట్లాడితే, ఇది కచ్చితంగా రావణ మాయే అని భయపడి సీతమ్మ ఇంకా గట్టిగా ఉరి బిగించుకుంటుంది. నా కారణంగా సీతమ్మ ప్రాణాలను విడిచిపెడితే ఆ పాపం నాకు అంటుకుంటుంది. ఇప్పుడు నేను ఏమి చెయ్యాలి? ఏమి మాట్లాడి సీతమ్మని ఓదార్చాలి?” అని అనుకుంటూ, "సీతమ్మ ఉరి పోసుకోవడం మానేసి నా వైపు చూడాలంటే రామనామం ఒక్కటే మార్గము. సీతమ్మకి చాలా ఇష్టమైన రామ కథని చెబుతాను" అని అనుకొని హనుమంతుడు రామ కథ చెప్పడం ప్రారంభించాడు…
“పూర్వకాలం కోసల దేశాన్ని ఇక్ష్వాకు వంశంలో పుట్టిన దశరథ మహారాజు పరిపాలించేవాడు. విపరీతమైన ఐశ్వర్యాన్ని సంపాదించివాడు, ఇంద్రుడితో సమానమైనవాడు, ఇతరుల ధర్మాన్ని రక్షించే స్వభావం ఉన్నవాడైన దశరథుడు పుత్రకామేష్టి యాగం చేస్తే పెద్ద కుమారుడిగా రాముడు జన్మించాడు. ఆ దశరథుడు చేసిన ప్రతిజ్ఞ నిలబడేటట్టు చెయ్యడం కోసమని,ఆయనని సత్యవాక్యమునందు నిలపడం కోసమని 14సంవత్సరములు అరణ్యవాసం చెయ్యడానికి రాముడు వెళ్ళాడు. రాముడిని విడిచిపెట్టి ఉండలేక ఆయనని నిరంతరము అనుగమించేటటువంటి స్వభావము కలిగిన లక్ష్మణుడు రాముడి వెనకాల వెళ్ళాడు. పతిసేవ తప్ప వేరొకటి నాకు అవసరంలేదు అనే స్వభావం ఉన్న సీతమ్మ రాముడి వెనకాల వెళ్ళింది. అలా రాముడు లక్ష్మణుడితో, సీతమ్మతో దండకారణ్యంలో ఉండగా ఒకనాడు జనస్థానంలో 14,000 మంది రాక్షసులని సంహరించాడు. దానిచేత కినుక చెందిన పదితలల రావణుడు మాయ జింకని ప్రవేశపెట్టి రామలక్ష్మణులు లేని సమయంలో సీతమ్మని అపహరించాడు. తదనంతరం సీతమ్మని అన్వేషిస్తూ వెళ్ళిన శ్రీరామచంద్రమూర్తి సుగ్రీవుడితో స్నేహం చేసి, వాలిని సంహరించి సుగ్రీవుడికి పట్టాభిషేకం చేశాడు. ఈనాడు సీతాన్వేషణ కోసం సుగ్రీవుడి చేత అన్ని దిక్కులకీ వానరములు పంపబడ్డాయి. దక్షిణ దిక్కుకి వచ్చిన వానరములలో ఒకడినైన హనుమ అనే పేరుగల నేను 100 యోజనముల సముద్రాన్ని దాటాను. సీతమ్మ ఎలాంటి కాంతితో, ఎలాంటి నగలతో, ఎలాంటి వస్త్రంతో ఉంటుందని రాముడు నాకు చెప్పాడో, అలాంటి సీతమ్మని ఈ శింశుపా వృక్షం మీదనుంచి ఇక్కడే కిందకి చూసి నేను ధన్యుడనయ్యాను" అని చెప్పి ఆగిపోయాడు.
ఇంతవరకూ వినపడని రామనామం వినపడేసరికి సీతమ్మ అప్రయత్నంగా తన మెడకి చుట్టుకున్న జుట్టుని విప్పేసింది.
ఆ కథని విన్న ఆనందంలో పరమ సంతోషంగా సీతమ్మ శింశుపా వృక్షం వైపు చూసింది. సీతమ్మ చెవిలోకి మాత్రమే వినపడేటట్టుగా, దగ్గర దగ్గరగా వచ్చి, కాళ్ళతో కొమ్మని పట్టుకొని, చేతులతో ఆకులని పక్కకి తొలగించి, తెల్లటి వస్త్రములను ధరించినవాడై, పింగళ వర్ణంతో, పచ్చటి నేత్రాలతో, పగడాల మూతిలాంటి మూతితో రామ కథ చెబుతున్న సుగ్రీవుడి సచివుడైన హనుమంతుడు సీతమ్మకి దగ్గరగా కనబడ్డాడు. అలా ఉన్న హనుమని చూడగానే సీతమ్మ స్పృహ కోల్పోయి నేలమీద పడిపోయింది.```
*రేపు…74వ భాగం*
*🚩జై శ్రీరామ్.! జై శ్రీ రామ్.!🚩*
*🙏జై జై శ్రీ రామ్.!🙏*
*సేకరించి*
*భాగస్వామ్యం చేయడమైనది*
*న్యాయపతి నరసింహారావు*
🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి