11, జూన్ 2025, బుధవారం

తిరుమల సర్వస్వం -267*

 *తిరుమల సర్వస్వం -267*

 *శ్రీవారి సంవత్సర సేవలు - 4* 

 *సంప్రోక్షణలలో రకాలు* 


 సంప్రోక్షణలలో ముఖ్యంగా మూడు రకాలున్నాయి.


 గ్రహణ సందర్భాలలో, ఏదైన అశౌచం జరిగినప్పుడు దేవతామూర్తులను పవిత్రజలాలతో శుద్ధి చేస్తారు. దీన్ని *జలసంప్రోక్షణం* అంటారు.


 దేవతామూర్తులకు ఏదైనా అనుకోని అపరాధం జరిగితే *లఘుసంప్రోక్షణ* ద్వారా తగిన పరిహారం చేస్తారు. దాదాపు సంప్రోక్షణ క్రతువునంతా జరిపిస్తారు. కానీ సంప్రోక్షణా కార్యక్రమమంతా, సరళంగా, కేవలం ఒక్క రోజులో ముగిసిపోతుంది.


 మూడవది *మహాసంప్రోక్షణ.* పన్నెండేళ్ళ కొక్కసారి విష్ణువు అంశను పునఃప్రతిష్ఠించడం కోసం ఐదు రోజుల పాటు విస్తారంగా జరిపే వైదిక కార్యక్రమమే *మహాసంప్రోక్షణ.*


 *అన్ని విధులు అర్చకులవే..* 


 కాలక్రమంలో గర్భాలయానికి అవసరమైన మరమ్మత్తుల నిమిత్తం, ఇతర వృత్తులకు చెందిన కొందరు నిపుణులు గర్భాలయం లోనికి ప్రవేశించే లేదా మూలమూర్తిని స్పృశించే అవకాశం ఉంది. కానీ, ఆగమశాస్త్రాన్ననుసరించి, వైఖానస అర్చకులు తప్ప వేరెవరూ గర్భాలయంలో ప్రవేశించరాదు. అటువంటి సందర్భాలలో మిగిలిన దేవాలయాలలో మూలవిరాట్టు అంశను ఒక కలశం లోకి ఆవాహన చేసి, ఆ కలశాన్ని వేరే ప్రదేశానికి తరలించి, అవసరమైన నిపుణులను గర్భాలయం లోకి అనుమతిస్తారు. కానీ తిరుమల ఆలయంలో మాత్రం గర్భాలయ మరమ్మత్తులన్నీ వైఖానస అర్చకులే నిర్వహిస్తారు. అందుచేత, తిరుమల లోని వైఖానస అర్చకులకు సాధారణంగా అవసరమయ్యే అన్ని రంగాలలోనూ ప్రవేశం ఉంటుంది.


 *కళాపకర్షణ కళాన్యాసం*


 స్వామివారి అంశ - శిరస్సు, ఫాలభాగం, నాసిక, నోరు, కంఠం, భుజస్కంధాలు, హృదయం, నాభి, కటి, మోకాళ్ళు, పాదాలు వంటి పన్నెండు జీవస్థానాలలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక్కో జీవశక్తికి నాలుగు కళలుంటాయి. ఆ విధంగా, మొత్తం 48 కళలను *'కుంభం'* లేదా *'కలశం'* అనే స్వర్ణపాత్ర లోనికి వేదమంత్రోచ్ఛారణల మధ్య ఆవాహన చేస్తారు. ఈ ప్రక్రియనే *కళాపకర్షణ* గా పిలుస్తారు. ఉత్సవం చివరి దశలో అప్పటివరకు కలశంలో నిక్షిప్తమైన 48 కళలను మూలమూర్తి లోనికి తిరిగి ప్రవేశింపజేసే కార్యాన్ని *'కళాన్యాసం'* గా వ్యవహరిస్తారు. సూక్ష్మంగా చెప్పాలంటే..... *'బింబం' (మూలవిరాట్టు) లోని అంశను 'కుంభం' (కలశం) లోకి చేర్చడమే 'కళాపకర్షణ'.*



 *అష్టదిగ్బంధనం* 


 కలియుగంలో శ్రీవేంకటేశ్వరుడు భూలోకంలో అవతరించియున్నాడు. ఈ యుగంలో స్వామివారి సంపూర్ణ కటాక్షం పొందాలంటే, స్వామివారి మూర్తి ఎల్లవేళలా తన దేవేరియైన భూదేవిని స్పర్శిస్తూ ఉండాలి. అందునిమిత్తం స్వామివారి పాదాలను మరియు శ్రీవారి పాదపీఠాన్ని ఒక ప్రత్యేకమైన లేపనంతో అనుసంధానిస్తారు. *మధూచిష్ట, లాక్ష, త్రిఫలం, కాసీనం, గుగ్గిలం, చూర్ణం, రక్తశిల, శంఖుచూర్ణం వంటి ప్రకృతిసిద్ధంగా లభ్యమయ్యే, జిగురుగుణం కలిగిన ఎనిమిది పదార్థాలకు, వెన్న, వేడినీటిని తగుపాళ్ళలో జోడించి రోలు, రోకలి, తిరగలి వంటి సాంప్రదాయ సాధనాల ద్వారా మిశ్రితం చేయబడగా వచ్చిన చిక్కటి పదార్థమే ఈ లేపనం.* ఏళ్ళ తరబడి జరిగిన అభిషేకాల వల్ల పాదపీఠం మరియు పాదాల మధ్యనున్న సన్నటి ఖాళీ ప్రదేశంలో పేరుకుపోయిన పూజావ్యర్థాలను తొలగించి, వాటి స్థానంలో ఈ లేపనాన్ని నింపుతారు. వీటిలోని ఒక్కో ద్రవ్యం ఒక్కో దిక్పాలకునికి ప్రీతికరమని ప్రతీతి. ఈ ద్రవ్యాలను వినియోగించడం ద్వారా ఆయా దిక్పాలకుల సహకారాన్ని పొందవచ్చని భావిస్తారు. ఈ మిశ్రమం సహజసిద్ధమైన కాంక్రీటులా పనిచేసి, మూలమూర్తి స్థిరంగా నిలద్రొక్కు కోవడానికి దోహద పడుతుంది. ఈ ప్రక్రియ జరుగుతున్నంత సేపు ఆగమబద్ధమైన క్రతువులెన్నో జరుగుతాయి.

ఈ క్రతువును దగ్గరుండి జరిపించడానికి నిష్ణాతులైన వైఖానస పండితులను సుదూరప్రాంతాల నుండి ప్రత్యేకంగా రప్పిస్తారు. అష్టదిక్పాలకులకు ప్రీతిపాత్రమైన అష్టద్రవ్యాల మిశ్రమంతో సమకూరే ఈ వైదిక కార్యక్రమమే *'అష్టదిగ్బంధనం'.*

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: