27, జూన్ 2025, శుక్రవారం

తిరుమల సర్వస్వం -283*

 *తిరుమల సర్వస్వం -283*

 *తిరుమల క్షేత్రంలో నిషిద్ధకర్మలు-1* 


 పరమపవిత్రమైన, పరిశుభ్రతకు మారుపేరైన తిరుమల కొండపై ఎట్టి పరిస్థితులలోనూ చేయకూడనట్టి కొన్ని పనులున్నాయి. మనం ఎన్నిసార్లు, ఎంత భక్తితో స్వామిని దర్శించుకున్నప్పటికీ, కొన్ని నిషిద్ధకర్మలకు దూరంగా ఉండకపోతే, యాత్రాఫలం సంపూర్ణంగా సిద్ధించదు. అవేమిటో, ఆ పనులు ఎందుకు కూడదో ఈనాటి ప్రకరణంలో సవివరంగా చూద్దాం.



 *ఆదివరాహదర్శనం* 


 మొదటగా ఆదివరాహుణ్ణి దర్శించుకోకుండా శ్రీవారి దర్శనం కూడదు. తిరుమలక్షేత్రానికి అసలు పేరు *'ఆదివరాహక్షేత్రం'.* ఈ క్షేత్రమంతా ఒకప్పుడు శ్రీమహావిష్ణువు మరో అవతారమైన ఆదివరాహస్వామి లేదా భూవరాహస్వామికి చెందినది. వల్మీకంలో (పుట్టలో) సుదీర్ఘకాలం గడిపిన శ్రీనివాసుడు నిలువనీడ కోసం అలమటిస్తున్నప్పుడు శ్రీవారి శాశ్వతనివాసం కోసం స్వామిపుష్కరిణికి దక్షిణం వైపునున్న నూరు అడుగుల నేలను ఆదివరాహుడు ధారాదత్తం చేశాడు. అదే ప్రదేశంలో తరువాతి కాలంలో తొండమానుడు ఆనందనిలయం నిర్మించాడు. ఇప్పుడున్న తిరుమల ప్రధానాలయం అదే! 


 *తనకు స్థలాన్ని బహూకరించినందుకు ప్రతిగా భక్తుల తొలిదర్శనం, తొలిపూజ, తొలినైవేద్యం ఆదివరాహునికే చెందుతాయని, తరువాతే తనను దర్శించుకుంటారని శ్రీవేంకటేశ్వరుడు ఆదివరాహస్వామికి వాగ్దానమిచ్చాడు. దానికి ఋజువుగా శ్రీనివాసుడు వరాహస్వామికి ఒక రాగిఫలకంపై వ్రాసి ఇచ్చిన దస్తావేజును తిరుమల లోని శ్రీ వేంకటేశ్వర వస్తుప్రదర్శనశాలలో నేడు కూడా చూడవచ్చు. శ్రీనివాసుని ఆదేశం మేరకు తొలిపూజను, తొలినైవేద్యాన్ని అర్చకస్వాములు నిర్వహిస్తారు. తొలిదర్శనం బాధ్యత మాత్రం భక్తులదే!*


 *'వరాహదర్శనాత్ పూర్వం శ్రీనివాసం నమేన్నచ దర్శనాత్ ప్రాగ్ వరాహస్య శ్రీనివాసో న తృప్యతి*


అన్న శ్లోకం ద్వారా సాక్షాత్తు శ్రీనివాసుడే స్వయంగా తన భక్తులకు ఈ విధంగా శెలవిచ్చాడు. ఈ ఉదంతాన్ని మునుపటి ప్రకరణాలలో విశదంగా తెలుసుకున్నాం.


 శ్రీవేంకటేశ్వరుని వాగ్దానాన్ని నిలబెట్టవలసిన బాధ్యత వారి భక్తులుగా మనందరి పైనా ఉంది. ఈ నియమాన్ని ఈమధ్య కాలం వరకూ తూచా తప్పకుండా పాటించేవారు కానీ, ప్రస్తుతం కొంత ఆలసత్వం కాన వస్తోంది. మొట్టమొదటగా ఉత్తరమాడవీధిలో, స్వామిపుష్కరిణి తటాన ఉన్న వరహస్వామిని సేవించుకోకుండా, శ్రీనివాసుని దర్శించుకోరాదు. అలా చేస్తే తిరుమల యాత్రాఫలం సంపూర్ణంగా సిద్ధించదని పురాణాలలో కూడా ఉటంకించబడింది.



 *ముఖ్య నిబంధనావళి* 


 *కొండపై నవదంపతుల నిదుర నిషిద్ధం*


 వివాహమైన ఆరుమాసాల వరకూ కొత్త దంపతులు కొండపై నిదురించరాదు పద్మావతీ శ్రీనివాసులు పరిణయానంతరం ఆరు నెలలపాటు, ఈనాడు శ్రీనివాసమంగాపురంగా పిలువబడుతున్న అలనాటి అగస్త్యాశ్రమంలో విశ్రమించారని, తరువాతే తిరుమలక్షేత్రాన్ని చేరుకున్నారని మునుపటి ప్రకరణాలలో తెలుసుకున్నాం. సాక్షాత్తు శ్రీనివాసుడే పాటించిన ఆ నియమాన్ని ఉల్లంఘించడానికి మనమెంతటివారం?


 వివాహమైన తొలినాళ్లలో భార్యాభర్తలలో ఒకరంటే ఒకరికి వ్యామోహం అధికంగా ఉంటుంది. ఆధ్యాత్మిక దృష్టితో, శ్రీనివాసుణ్ణి సేవించు కోవడానికి మాత్రమే పరమపావనమైన తిరుమలకు వెళ్ళాలి కానీ, భోగలాలసత్వంతో తిరుమలపై కాలు మోపరాదు. ఒకవేళ తిరుమల కొండపై వివాహం జరిగితే, వివాహానంతరం స్వామిని దర్శించుకొని వెనువెంటనే కొండ దిగిపోవడం శ్రేయస్కరం. కొండపై నూతన దంపతులతో మూడునిద్రలు చేయిస్తామని మ్రొక్కుకోవడం సమంజసం కాదు.


*తిరుమలక్షేత్రంలో పూలు ధరింపరాదు.*


 తిరుమల పుష్పమండపంగా ఖ్యాతినొందింది. తిరుమలేశుడు పుష్పప్రియుడు. శ్రీనివాసునికి పుష్పకైంకర్యం చేయడం ద్వారా తిరుమలనంబి, అనంతాళ్వార్, వెంగమాంబ వంటి ఎందరో భక్తులు శ్రీవారికి అప్తులై జన్మ సార్థకం గావించుకున్నారు. నాటి నుండి నేటివరకూ శ్రీవారు అనునిత్యం పెక్కు పూలమాలలను ధరించి దర్శనమిస్తారు. తిరుమల లోని పుష్పాలన్నీ శ్రీవారి సొంతం. పూలతో కూడిన పూజావ్యర్థాలను సైతం భక్తులకు ప్రసాదంగా ఇచ్చే సాంప్రదాయం తిరుమలలో లేదు. పూజానైర్మల్యాలను ఈమధ్య వరకూ సంపంగిప్రాకారంలో ఉండే 'పూలబావి' లో విసర్జించేవారు. ఇప్పుడు మాత్రం జనసంచారం లేని సుదూరమైన అరణ్యప్రాంతంలో ఆ వ్యర్థాలను విసర్జిస్తున్నారు. కొండపైకి పుష్పగుచ్ఛాలను సైతం అనుమతించరు. తిరుమలలో జరిగే వివాహవేడుకలలో కూడా పుష్పాలను వినియోగించరు. అటువంటి తిరుమల క్షేత్రంలో పూవులన్నింటినీ స్వామివారి అలంకారానికి, అర్చనకు, కళ్యాణానికే వినియోగించాలి తప్ప సామాన్యులు పువ్వులు ధరించడం పూర్తిగా నిషిద్ధం. ఈ నియమాన్ని పాటించకపోతే, *'పరిమళదోషానికి'* ఒడిగట్టిన వారమవుతాం. అంతే గాకుండా, కొండపై ఎవరైనా పూలను ధరిస్తే *పుష్పాధిపతి యైన 'పుల్లుడు'* అనే దేవత ఆగ్రహానికి కూడా గురవుతారు. స్వామివారి అభీష్టానికి వ్యతిరేకంగా, వారికే స్వంతమైన పుష్పాలను కొండపై ఎట్టి పరిస్థితులలోనూ అలంకరించు కోవద్దు.


 

*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: