27, జూన్ 2025, శుక్రవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*420 వ రోజు*

*సుయోధనుడు మడుగునుండి వెలుపలకు వచ్చుట*


వెలుపలకు వచ్చిన సుయోధనుడి చూసి పాంచాలురు, పాండవులు అపహాస్యంగా చిరునవ్వు నవ్వారు. సుయోధనుడు " అలా నవ్వకండి. నేను మిమ్మంతా ఒక్కొక్కరుగా బలి తీసుకుంటుంటే అప్పుడు తెలుస్తుందిలే " అన్నాడు. సుయోధనుడికి ఇంకా పాండవులు పాంచాలురతో కలిసి ఒక్కుమ్మడిగా తన మీద దాడి చేస్తారని శంకిస్తూ " నేను యుద్ధమున అలసి ఉన్నాను మన ఒప్పందం ప్రకారం ఒక్కొక్కరుగా నాతో యుద్ధానికి రండి " అన్నాడు. ధర్మజుడు నవ్వి " సుయోధనా ! నాడు అభిమన్యుని మీదకు ఒక్కుమ్మడిగా యుద్ధముకు పోయినట్లుగా భావించ వచ్చు కదా ! " అని " భయపడకు నువ్వు చేసిన అకృత్యమును గుర్తు చేసాను కాని ఆడిన మాట తప్పను. యుద్ధ నీతికి వ్యతిరేకముగా ప్రవర్తించను. నీవు వెంటనే సరి చేసుకొని కవచము, శిరస్త్రాణం ధరించి యుద్ధ సన్నద్ధుడివి అయి మాలో ఒకరిని ఎంచుకొని యుద్ధం చెయ్యి. మాలో నీకు నచ్చినవాడిని జయించిన రాశ్యలక్ష్మిని వరించు లేకున్న వీర స్వర్గం అలంకరించు ఇది నా ప్రతిజ్ఞ. నీకు నచ్చిన ఆయుధములు ధరించు నీవు నాకు తమ్ముడివి కనుక నీవు అడిగినవి ఇస్తాను ప్రాణములు తప్ప " అన్నాడు. సుయోధనుడు " ధర్మజా ! నీ సత్య వాక్పరిపాలనా నాకు తెలియనిదా ! నాకు నీ మీద ఎందుకు కోపం ఉంటుంది ! మనం మనం అన్నదమ్ములం కదా ! " అని కవచాదులను ధరించి యుద్ధానికి సన్నద్ధుడయ్యాడు. చేతిలో గద ధరించి మేరు పర్వతంలా మెరుస్తూ " ధర్మజా ! సహదేవుడో, నకులుడో, అర్జునుడో, భీముడో లేక నీవో నాతో యుద్ధానికి రండి నా గదకు మిమ్ము ఒక్కొక్కరిగా ఎర వేస్తాను. నాతో గదా యుద్ధం చేయ సాక్షాత్తు ఈశ్వరుడే సాహసించరు మీరెంత " అని డంబంగా అన్నాడు.


*ధర్మజుడి మాటకు కృష్ణుడు ఆందోళనపడుట*


సుయోధనుడి ప్రగల్భములకు కృష్ణుడు ధర్మరాజును చూసి " ధర్మరాజా ! నీవిలా అవివేకముతో మాటాడుట ఏమీ బాగా లేదు. నీవింత బుద్ధిహీనుడవని అనుకో లేదు. ఇదేమైనా శకునితో ఆడిన జూదమా ! ఒక్కరిని గెలవగానే రాజ్యం ఇవ్వడానికి. సుయోధనుడు భీముని తప్ప మీలో ఎవరిని కోరుకున్నా గదా యుద్ధముతో మిమ్ము హతమార్చగలడు. ఆఖరుకు ఇది పందెం యుద్ధం అయింది. ఇందుకేనా ఇంత మారణ హోమం జరిగింది ఇంత మంది రాజులను సైన్యాలను యుద్ధానికి బలి ఇచ్చింది ? ఇలా పందెంలో ఓడే కదా నీవు నీ తమ్ములతో కలిసి అడవులలో ఇడుములు అనుభవించింది " అన్నాడు. కనుక ధర్మరాజా ! ఇందుకు నేను ఒప్పుకోను. ఒక్కొక్కరుగా యుద్ధం చేసే పని అయితే భీమసేనుని కూడా పంపడాబనికి అంగీకరించను. దుర్యోధనుడు గధావిద్యలో నైపుణ్యం గడించాడు. అతడి నైపుణ్యం ముందు భీముని బలం చాలదు. నీ ఇష్టం జాగర్త " అన్నాడు.


*భీముని కృష్ణుడు ప్రశంసించుట*


కృష్ణుడి మాటలు విన్న భీమసేనుడు " అన్నగారి అనుమతి నీ అనుగ్రహం ఉండాలే కాని దుర్యోధనుడే కాదు ఈ మూడు భువనాలలో ఉన్న ఎవరినైనా నేను తృటిలో జయించగలను. ఈ సుయోధనుడు ఒక లెక్కా ! ఈ మాత్రం దానికి అన్నగారిని అంత మాట అనవలెనా ! ఈ రోజు నేను నా గధా ఘాతంతో సుయోధనుడిని చంపి నీకు సంతోషం కలిగిస్తాను " అన్నాడు. కృష్ణుడు భీముని భుజం ప్రేమగా తట్టి " భీమసేనా ! బకాసురుడిని, హిడింబుని, జరాసంధుని, కిమ్మీరుడిని సంహరించిన నీ భుజబలం నాకు తెలియనిదా ! ఏదో మీ మీద ప్రేమతో కలిగిన కలవరంతో అన్నాను కాని వేరేమి లేదు. దుశ్శాసనుడి గుండెలు చీల్చి రక్తం త్రాగుతుంటే చూస్తూ ఊరుకున్నాడే కాని ఏమి చేయని సుయోధనుడి పరాక్రమం నీ ముందెంత ? నా మాటలు పట్టించుకోకు. నాడు కురుసభలో ద్రౌపది జుట్టు పట్టి ఈడ్చినపుడు నీవు చేసిన ప్రతిన ఒకటి నెరవేర్చుకున్నావు. ఇక రెండవది మిగిలి ఉంది సుయోధనుడి తొడలు విరిచి నీ రెండవ ప్రతిజ్ఞ నేరవేర్చి నీ అన్నను పట్టాభిషిక్తుడిని చేసి మీరందరూ సుఖములు అనుభవించండి. నీవిక నీ పరాక్రమం చూపి నీ గధకు పండుగ చెయ్యి నీ వెనుక నేను ఉన్నాను. ఈ రోజు నీ చేత సుయోధనుడు నిర్జీవుడౌతాడు అన్నాడు. కృష్ణుడి మాటలకు భీముడు పొంగి పోయాడు. కృష్ణుడు " భీమసేనా ! ఒక్క మాట సుయోధనుడు గదా యుద్ధంలో నిష్ణాతుడన్నది మరువ వద్దు. ఎన్నో ఏళ్ళు కఠోర శ్రమతో సాధించిన నైపుణ్యం జాగ్రత్త " అని హెచ్చరించాడు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: