27, జూన్ 2025, శుక్రవారం

త్వమేవ శరణం...*

 *త్వమేవ శరణం...*


విశ్లేషణ : 


- శ్రీ తాడేపల్లి పతంజలి గారు


     *సుభద్రా బలరాములతో కూడిన పురి జగన్నాథుని వేంకటేశునిగా శరణు కోరుతూ అన్నమయ్య రచించిన కీర్తన ఇది.* 🙏🏻


     నువ్వే శరణము. నువ్వే శరణము. పద్మము నాభిలో కలవాడా! ఓ జగన్నాథ స్వామీ!


1. వసుదేవుని కుమారుడా! కృష్ణుడా! వామనుడా! నరసింహ స్వామీ! లక్ష్మీదేవికి ప్రభువా! పద్మములవంటి కన్నులు కలవాడా! బ్రాహ్మణులకు ప్రభువా! పురుషోత్తముడా! పచ్చని వస్త్రములు ధరించినవాడా! ఓ జగన్నాథ స్వామీ!


2. బలరాముని తమ్ముడా! పరమాత్మా! పాలసముద్రంలో విహరించేవాడా! ఏనుగుకు వరము ఇచ్చినవాడా! సులభుడా! సుభద్రాదేవికి ప్రసన్నుడా! దేవా నాయకుడా! కలిదోషములైన పాపములను హరించువాడా! ఓ విష్ణుమూర్తీ!


3. మఱ్ఱిఆకునందు శయనించువాడా! లోకములను పాలించువాడా! శరీరాలను కుండలను నిర్మించువాడా! ( జంతుఘట కార కరణ ) శృంగార రసానికి అధిపతీ! మిక్కిలి బలమైన వాడా! నిత్య వైభవములతో ప్రకాశించేవాడా! పూజ్యమైన, శుభమైన వేంకట పర్వతముపై నివసించువాడా!🙏🏻




*విశేషాలు :*


*పురి జగన్నాథుడు*


ఈ క్షేత్రానికి సంబంధించిన కథను పురాణనామచంద్రిక లో యెనమండ్రం వెంకటరామయ్య ఇలా చెప్పారు. “ఇది పురుషోత్తమ (విష్ణు) క్షేత్రము. కృష్ణుని నిర్యాణమునకు పిమ్మట ఆయన దేహమును దహనము చేయుచు ఉండగా సముద్రము పొంగి ద్వారకా పట్టణమును ముంచెను. అప్పుడు ఆ దేహము సంపూర్ణదగ్ధము కాక సముద్రమునందు కొట్టుకొనిపోవుచు ఉండగా, దానిని కొందరు భక్తులు దారువునందు సంపుటముచేసి ఇచట స్థాపించిరి."


ఇంకొక రకమైన కథ ప్రజలలో ప్రచారంలో ఉంది. అది ఇది. - పురి లో నీలమాధవుని (= విష్ణువు) మందిరం నిర్మించాలని ఇంద్రద్యుమ్నుడనే రాజు అనుకొన్నాడు. ఎన్నో అడ్డంకులు వచ్చాయి. తన సంకల్పం నెరవేరాలన్న పట్టుదలతో సముద్రపు తీరములో ప్రాయోపవేశము (= పస్తులతో ప్రాణమును విడిచిపెట్టడమనే వ్రతము) చేసాడు. అతని దీక్షకు సంతసించి నీలమాధవుడు అశ్వమేధ యాగం చేయమని సందేశము ఇచ్చాడు. ఆ యాగపు పూర్ణాహుతి వేళ సముద్రం నుంచి ఒడ్డుకు ఒక దారువు (కొయ్య దుంగ) చేరుతుందని చెప్పాడు. ఆ దారువుతో విగ్రహాన్ని చేయమని చెబుతాడు. అలా ఏర్పడిందే జగన్నాథుని కొయ్య బొమ్మ.


జగన్నాథుడు వెలిసిన ప్రదేశం కాబట్టి మొదట ఇది జగన్నాథపురిగా పేరు వచ్చింది. క్రమంగా పూరీ జగన్నాథమయింది.


ప్రతి సంవత్సరము ఒక కొత్త రథం జగన్నాథునికి నిర్మిస్తారు. 'వస్తున్నాయ్ వస్తున్నాయ్ జగన్నాథ రథ చక్రాలు' వస్తున్నాయి. అంటూ శ్రీ శ్రీ ఉన్నతమైన జగన్నాథుని రథాన్ని, రథ చక్రాలను మనస్సుల్లో గిరగిరా తిప్పాడు. పురి జగన్నాథుని రథయాత్ర ఆషాఢ శుద్ధ విదియనాడు జరుగుతుంది.


పురి జగన్నాథస్వామి, సుభద్ర, బలభద్రుల మూలమూర్తులకు రథయాత్ర నిర్వహించిన తరువాత మహాప్రసాదాన్ని ఒకే పళ్లెంలో అందరు భక్తులకు జాతి, కుల ప్రస్తావన లేకుండా ఒకే పంక్తిలో కూర్చోబెట్టి పెడతారు. ఇలా అందరూ ఒక చోట చేరి ప్రసాదాన్ని స్వీకరిస్తారు. ఈ క్షేత్రంలో అన్నంచేతికి తగిలితే అంటు దోషము లేదట. కాబట్టి 'సర్వం జగన్నాథం' అని సామెత వచ్చిందట.


*జంతుఘట కార కరణ (= శరీరాలను కుండలను నిర్మించువాడా!)*


జగన్నాథుని సంబోధిస్తూ అన్నమయ్య వ్రాసిన ఈ కీర్తనలో కొన్ని మాములు పదాలున్నా జంతుఘట కార కరణ వంటి విలక్షణ సంబోధనలు కూడా ఉన్నాయి. భగవంతుడు ఈ శరీరాలను కుండలను నిర్మిస్తున్నాడు.


జీవితం అనేది ఒక నీటికుండ. చివరలో చేసే సంస్కారంలో చేసేవాడి భుజం మీద నీటి కుండ పెడతారు. మొదటి ప్రదక్షిణలో ఒక రంధ్రం నుంచి బాల్యమనే నీరు కారిపోతుంది. రెండవ ప్రదక్షిణలో కుండకు చేసే రంధ్రంలో కారిపొయే నీరు యవ్వనానికి సంకేతము. మూడవ ప్రదక్షిణలో కారిపొయే నీరు ముసలితనానికి గుర్తు. కుండను నేలకు కొట్టి వెనక్కు చూడకుండా వెళ్లమంటారు. ముక్కలైన కుండ అన్ని దశలను దాటి చనిపోయిన వాడికి గుర్తు.


వెనక్కి చూడకుండా - అంటే చనిపోయిన వాడి సంగతి ఆలోచించకుండా- నీ దోవన నువ్వు వెళ్లిపో అని సంబంధీకులకు ఒక ఉపదేశము. ఎవడి బతుకు వాడిదే. ఎవడి చావు వాడిదే. ఎవడి ఉద్ధరణ వాడిదే.


*ఘటము జలములందు గగనంబు కనఁబడు*

*ఘటము జలము లేమి గగనమేది*

*ఘటములోన జ్యోతిఁ గ్రమమునఁ దెలియుఁడీ*

*విశ్వదాభిరామ వినర వేమ!*


అని వేమన్న అన్నమయ్య ఘటకారకరణ పద ప్రయోగములోని ఆంతర్యాన్ని వివరించాడు. ఈ శరీరమనే కుండలోని జ్యోతిని తెలుసుకోవటానికి ప్రయత్నిస్తుండాలి. 



సేకరణ::::::

కామెంట్‌లు లేవు: