🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
_*ఓం నమో భగవతే రామకృష్ణాయ*_
*శారదామాత జీవితచరిత్ర*
ఓర్పు-సహనం:--
రాధూ అందగత్తె. ఆమె మాతృదేవిని 'అమ్మా' అంటూ పిలిచేది. సొంత తల్లిని 'గుండుకొట్టుకొన్న అమ్మ' అని పిలిచేది. భక్తులు తెచ్చే పండ్లు, పదార్థాలు అన్నీ రాధూకే చెందినవని సురబాల భావించేది. వాటిని ఎవరికైనా ఇస్తే మాతృదేవిని తులనాడేది.
కాలం గడిచింది. రాధూ శరీరకంగా ఎదిగిందేగాని మానసికంగా పెరగలేదు. లోకాన్ని అర్థం చేసుకోవడం, మంచి చెడ్డలు గ్రహించడం ఆమెకు మించిన పని. చటుక్కున కోపం ఉక్రోషం తెచ్చుకొనేది. ఒక రోజు ఎంతో ఆవేదనతో, "ఈ రాధూతో నేను పడుతున్న ఆవేదనను చూడు"!అనేవారు. పలువురి సమక్షంలో అనుచితంగా ప్రవర్తించేది. ఎలాంటి కారణమూ లేకుండా విరుచుకుపడి శాపనార్థాలు ఏకరువు పెట్టేది. చేతికి ఏది అందితే దానిని తీసుకొని మాతృదేవి మీద విసిరివేయడం, ఆమెను తన్నడం, ఉమ్మడం చేసేది. ఏ వ్యక్తియైనా తన ఓర్పును కోల్పోయే రీతిలో నీచంగా ప్రవర్తించేది.
ప్రతి రోజు ఈ ఇద్దరి పిచ్చి వలన కలిగే వేదనను భరించలేక మాతృదేవి "నేను పరమేశ్వరుని ముళ్లతో కూడిన బిల్వ పత్రాలతో పూజించానేమో! అందుకే వీరందరూ నన్ను ముళ్లుగా గుచ్చుతున్నారు" అన్నారు.
1906 వ సం|| మాతృదేవి తమ తల్లి శ్యామసుందరీ దేవిని కోల్పోయారు. ఒక పరిపూర్ణ జీవితం ఆమె గడిపింది. తన కుమార్తెను 'అమ్మా' అంటూ పిలిచే పిల్లలు లేకుండా పోతారేమో అంటూ ప్రారంభంలో ఆమెలో ఉన్న తపన ఈ రోజుల్లో పూర్తిగా తొలగిపోయింది. భక్తులు మాతృదేవిని దర్శించుకోవడానికి, మంత్రదీక్ష పుచ్చుకోవడానికి రాసాగారు. వారందరూ మాతృదేవిని 'అమ్మా' అనీ, తనను 'అమ్మమ్మా' అని పిలవడం విని శ్యామసుందరి ఎంతగానో మురిసిపోయారు. ఎన్నడూ పనిలేకుండా ఉండేది కాదు. ఆవులను చూసుకోవడం, ఆవుల కొట్టాన్ని శుభ్రం చేయడం, పొలంలో పని చేసేవారికి భోజనం తీసుకెళ్లి ఇవ్వడం, వంట, ధాన్యం దంపడం అంటూ ఏదో ఒక పనిలో నిమగ్నమై ఉండేవారు. ఏ పని చేస్తూవున్నా ఆమె ముఖాన చిరుమందహాసం కనిపించేది. ఆమె దుఃఖంతో ఉండడమో, కోపగించుకోవడమో ఎవరూ చూసింది లేదు.
ఆఖరి రోజు కూడా ధాన్యం దంపారు. దుకాణానికి వెళ్లి కూరగాయలు కొని తెచ్చారు. హఠాత్తుగా వరండాలో ఒళ్లు తూలి కిందపడ్డారు. మాతృదేవి శిష్యుడు ఒకరితో "నాకు తల తిరుగుతూ ఉంది. ఆఖరి క్షణాలు వచ్చేసినట్లున్నాయి" అన్నారు. మాతృదేవీ, ఇతరులూ పరుగెత్తు కొంటూ వెళ్లారు, గుమ్మడికాయ పులుసు తినాలని తన కుమార్తెతో చెప్పారు. అందుకు మాతృదేవి ఆరోగ్యం బాగుపడ్డాక చేసి పెడతానన్నారు. తర్వాత తాగదానికి నీళ్లు అడిగారు. మాతృదేవి గంగాజలం ఇచ్చారు. దివ్యురాలైన కుమార్తే చేతుల నుండి పావన గంగాజలం సేవిస్తూ అట్లే కళ్లుమూశారు శ్యామసుందరి.
ఏదయినా పని మొదలు పెట్టడం ఆలస్యం, అన్నదమ్ముల మధ్య పోట్లాటలు మొదలవుతాయి. ఒక రోజు ఆస్తి పంపకాల పోట్లాట తారస్థాయికి చేరింది. అన్నదమ్ములు కొట్టుకొనసాగారు. వెంటనే స్వామి శారదానంద వారి మధ్య జొరబడి ఇద్దరిని రాజీ పరిచారు. అందరూ అంగీకరించేలా ఆయన ఆస్తి పంపకం చేశారు.
ఇంత గందరగోళం మధ్య కూడా మాతృదేవి కనబరచిన ప్రశాంతత స్వామి శారదానందను ఎంతగానో అబ్బురపరచింది. ఆయన ఒక బ్రహ్మచారితో, "చూడు, వీరందరి పోట్లాటలతో మనం సహనాన్ని కోల్పోతాం. మాతృదేవిని చూడు! సోదరులు ఎన్నెన్ని సమస్యలు సృష్టిస్తున్నారో! కానీ ఆమె ఒకింతైనా ప్రశాంతతను కోల్పోయారా! ఎలాంటి సమతా స్థితి! ఎలాంటి ప్రశాంతత!" అని అన్నారు.
ఆస్తుల పంపకం ముగిసిన తర్వాత మాతృదేవికి ఆమెకోసమంటూ ప్రత్యేకంగా 1915 వ సం||లో భక్తులు ఒక ఇల్లు కట్టేదాకా ప్రసన్న ఇంట్లోనో, కాళీ ఇంట్లోనో నివసించేవారు. కానీ ప్రసన్న ఇంట్లో నివసించడాన్నే అలవాటుగా చేసుకున్నారు. ఎందుకంటే నళిని, మాకు అనే ఇద్దరు కుమార్తెలను వదలి పెట్టి ప్రసన్నుని భార్య కళ్ళు మూసింది. వారి బాధ్యత కూడా మాతృదేవి మీద పడింది.
ఒకసారి ప్రసన్న కుమార్ అక్కయ్య! ఇక రాబోయే జన్మలలో కూడా నేను నీ సోదరునిగా పుట్టాలని నన్ను ఆశీర్వదించు" అన్నాడు. అందుకు మాతృదేవి, “మళ్లీ మీ కుటుంబంలోనా! అలా కలలు కనకు! ఇప్పుడు జన్మించి నేను పడుతున్న ఆవేదన చాలదా? మళ్లీ మీ సోదరిగా జన్మించడమా! వద్దే వద్దు అని అన్నారు.
ఎప్పుడు చూసినా డబ్బు డబ్బు అంటూ వెంపర్లాడే తమ సోదరులను గురించి మాతృదేవి ఒకసారి, "వీరందరూ ఎలాంటి జన్మలు? సదా డబ్బు డబ్బు అంటూ కొట్టుకుపోతూంటారు. కాని భక్తి కావాలి. జ్ఞానం కావాలి అనే ఆలోచన
కూడా వారికి రాదు!" అంటూ ఎంతో కలవరపడ్డారు.
https://chat.whatsapp.com/JY0yPPPRgIiHuoZll8ImNd
*శారదామాత చరితామృతం*
🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸🌸
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి