6, జులై 2025, ఆదివారం

18-38-గీతా మకరందము

 18-38-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII రాజససుఖమును వివరించుచున్నారు –


విషయేన్ద్రియసంయోగాత్ యత్తదగ్రేఽమృతోపమమ్ | 

పరిణామే విషమివ 

తత్సుఖం రాజసం స్మృతమ్ || 


తా:- ఏ సుఖము విషయేంద్రియ సంబంధమువలన మొదట అమృతమును బోలియు, పర్యవసానమందు (అనుభవానంతరమున) విషమువలెను నుండుచున్నదో అట్టి సుఖము రాజసమని చెప్పబడినది.


వ్యాఖ్య:- విషయసుఖము తాత్కాలికమైనది; క్షణికమైనది. ఇంద్రియములకు విషయములకు సంయోగము కలిగినపుడే ఆ సుఖ ముదయించును. మఱల వెంటనే పోవును. మఱియు ప్రారంభములో అమృతముపగిది సుఖముగా తోచినను, పర్యవసానమున విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించునని ఇచట తెలుపబడినది. దీనినిబట్టి రాజససుఖము ప్రారంభమున జీవులకు అమృతమువలె తోచుసుఖము అమృతము కాదనియు, పయోముఖవిషకుంభస్థవిషమే యనియు తెలియుచున్నది. విషరూపమగు ఆ అమృతము మహాప్రమాదకరమైనవస్తువు. ఏలయనిన ఆ అమృతములోన విషబీజములు కాపురముండును. ఆ సుఖమందు దుఃఖబీజములు నివసించును. కాబట్టి అట్టి అమృతమును విడనాడనిచో, దానిలో దాగియున్న విషబీజములనుగూడ స్వీకరించవలసివచ్చును. కావున ముముక్షువులు దృశ్యవిషయములద్వారా తమకేదైన సుఖము గలిగినపుడు అది దుఃఖగర్భితమని, చేపయొక్క ఎరలోపలనుండు గాలమువంటిదని నిశ్చయించి దానిని త్యజించివేయవలెను. ఆ సుఖము ఈ జీవితమునేకాక అనేక భావికాల జీవితములనుగూడ నాశనముచేయును. కనుకనే భగవానుడు కరుణించి సాధకులకిచట హెచ్చరికచేయుచున్నారు. ఆ దృశ్యసుఖములయొక్క అసలురంగును గీతాచార్యులు బయటపెట్టుచున్నారు. "మోసపోకుడు” అని సలహానిచ్చుచున్నారు. అజ్ఞాను లీసత్యము నెఱుగక తృణావృతకూపముల వలె కానవచ్చు శబ్దాదిదృశ్యవిషయములనే సేవించి అగాధసంసారకూపములో పడిపోవుచున్నారు.

భగవానుని ఈవాక్యములు జీవులకు అంధకారమునందు వెలుగునిచ్చుచున్నవి. జగత్తు యొక్క వాస్తవస్వరూపమును బోధించుచున్నవి. పైపై తళుకుబెళుకులకు మోసపోగూడదను విషయమును తెలియబఱచుచున్నవి. కావున ముముక్షువులు విషయసుఖమువలన కలుగు ఈ కీడును గుర్తెఱిగి, ఇంద్రియములకు మనస్సునకు ఆ యా విషయములతో నేమాత్రము సంయోగము కలుగకుండ చూచుచుండవలెను. ఒకవేళ జన్మాంతరసంస్కారప్రాబల్యముచే ఇంద్రియములు బయటకు విషయములపై పరుగెత్తినను, వానిని వివేకముతోనే వెనుకకు లాగి ప్రత్యాహరించి ఆత్మయందు నెలకొల్పవలెను.

ప్ర:- రాజససుఖముయొక్క లక్షణమేమి? 

ఉ:- మొదట అమృతమువలె మహాసుఖముగ కానుపించి, తుట్టతుదకు (అనుభవానంతరమున) విషమువలె దారుణ దుఃఖరూపముగ పరిణమించుటయే రాజససుఖలక్షణము.

కామెంట్‌లు లేవు: