6, జులై 2025, ఆదివారం

తొలి ఏకాదశి*

 🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀నేడు…


                  *తొలి ఏకాదశి*

                   ➖➖➖✍️```

   -యల్లాప్రగడ మల్లికార్జునరావు.



తొలి ఏకాదశిని సర్వపాపహారిగా పిలుస్తారు. విష్ణు ప్రీతికరమైన తొలి ఏకాదశి నాడు ఉపవాసం, తీర్థక్షేత్రాల సందర్శనం ముఖ్యవిధులు. శ్రీమహావిష్ణువు యోగనిద్రకు ఉపక్రమించే ఏకాదశి కనుక దీనినే "శయన ఏకాదశి" అంటారు. ఈ ఏకాదశి తరువాత దక్షిణాయనం ప్రారంభమవుతుంది. దాంతోపాటే మన పండుగలు వరస కడతాయి.


నెలలో పదకొండో రోజును, ఇరవై ఏడో రోజును కూడా "ఏకాదశి" అనే పిలుస్తారు.


పౌర్ణమికి ముందు ఒకటి, అమావాస్యకు ముందు ఒకటి వస్తుంటాయి. మొత్తంమీద ఏడాదిలో 24 ఏకాదశులు వస్తాయి. అధికమాసం ఉంటే ఈ సంఖ్య 26కు పెరుగుతుంది.


ఏకాదశి తిథి విష్ణువుకు ప్రీతికరమైంది. ఆషాఢ శుక్ల ఏకాదశి మరింత పవిత్రమైనది. దీనిని "శయనఏకాదశి" అని కూడా అంటారు. ఆ రోజు యోగనిద్రకు ఉపక్రమించే విష్ణువు మళ్ళీ నాలుగు నెలల తర్వాత కార్తిక శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రను చాలిస్తాడు. ఈ నాలుగు నెలలూ పీఠాధిపతులు చాతుర్మాస్య దీక్షలు చేస్తుంటారు.```


*కాలగమనంలో మార్పు*``` 

తొలి ఏకాదశితో కాలగమన మార్పు సూచితమవుతుంది. ఆరోజునుంచి భూమిపై రాత్రి సమయాలు పెరుగుతాయి. అంటే నిద్రా సమయాలు పెరుగుతాయి. దానికి అనుగుణంగా దైనందిన కార్యకలాపాలను నిర్వహించుకోవాలని చెప్పడానికే పెద్దలు ఇటువంటి పండుగను ఏర్పరచారు.


విష్ణుమూర్తి యోగనిద్రలోకి వెళతాడని పెద్దలు చెప్పగానే, నిజంగానే దేవుడు నిద్రపోతాడా అని ఒక సందేహం కొంతమందికి కలుగుతుంటుంది. విష్ణువు అంటే సర్వవ్యాపి అని అర్థం. విష్ణువు అనే పదానికి సందర్భానుసారంగా సూర్యుడు అని అర్థం కూడా చెబుతారు. సూర్యనారాయణుడు అనేది అందుకే. తొలి ఏకాదశిలో సూర్య ప్రస్తావన కనిపిస్తుంది. ఎలా అంటే... అప్పటివరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు, తొలి ఏకాదశి రోజు తరువాత నుంచి దక్షిణదిక్కుకు వాలుతాడు. అంటే, అప్పటినుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. ఇలా వాలటాన్నే నిద్రపోవడంగా భావించడం వల్ల ఆ భావనే ప్రచారంలోకి వచ్చినట్టు కనిపిస్తుంది.```


*పురాణ కథలు*```

భవిష్యోత్తరపురాణంలో కృష్ణుడు ధర్మరాజుకు ఏకాదశి మహిమ గురించి వివరించాడు. తాళజంఘుడు అనే రాక్షసుని కుమారుడైన మురాసురునితో యుద్ధం చేసే సమయంలో విష్ణువు శరీరం నుంచి ‘ఏకాదశి’ కన్య జన్మించింది. ఆమె అంటే, విష్ణువుకు ఎంతో ఇష్టమని పలు పురాణ కథలు పేర్కొంటున్నాయి. ఏకాదశీ వ్రతాన్ని ఆచరించిన రుక్మాంగదుడు మోక్షాన్ని పొందిన కథ పురాణ ప్రసిద్ధం. ముఖ్యంగా తొలి ఏకాదశినాడు సతీసక్కుబాయి మోక్షం పొందింది. 


షట్చక్రవర్తులలో ఒకడైన మాంధాత రాజ్యంలో ఒకసారి తీవ్ర కరవు వచ్చింది. దానితో, ప్రజలు పడరాని పాట్లు పడుతుంటే అంగీరసుడి సూచన మేరకు ‘శయనైకాదశి’ వ్రతాన్ని భక్తితో నిర్వర్తించాడు. 

ఆ వ్రతఫలంతో మంచి వర్షాలు కురిసి దేశం సుభిక్షమై కరవు తీరి ప్రజలు సుఖపడ్డారన్నది పురాణ గాథ.

```


*ఉపవాసం - ఆరోగ్యం*```

వానాకాలంలో వచ్చే మొదటి ఏకాదశి కనుక దీన్ని ‘తొలి ఏకాదశి’ అని కొందరు పండితుల అభిప్రాయం. 


ఏకాదశి అంటే పదకొండు. 

అయిదు జ్ఞానేంద్రియాలు, అయిదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పదకొండు. వీటిని మనిషి తన అధీనంలోకి తీసుకువచ్చి వాటినన్నటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవునికి నివేదన చేయాలి. దీనివలన మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరిచేరకుండా ఉంటాయని, ఇంద్రియ నిగ్రహం పెరుగుతుందని అంటారు. ఉపవాసం చేయడం వల్ల జీర్ణకోశం శుభ్రమై దేహం నూతనోత్తేజాన్ని సంతరించుకుంటుంది. కఠినమైన రోగాలనుంచి తట్టుకునే శక్తిని ప్రసాదిస్తుంది. ఉపవాస సమయంలో ఆహారం విషయంలో కొన్ని నిషేధాలు పాటిస్తారు.


తొలి ఏకాదశినాడు విష్ణుభక్తులు జొన్న పేలాలు బెల్లం కలిపి దంచి పిండి చేస్తారు. ఆ పేలపిండినే విష్ణువుకు నివేదించి, ఉపాహారంగా తీసుకుని, ఉపవాసం చేస్తారు. ఆలయాల్లో కూడా పేలపిండి ప్రసాదంగా పంచే ఆచారం ఉంది. తొలిఏకాదశి నాడు ఉపవాస జాగారాలతో విష్ణువును పూజించడం వల్ల జన్మజన్మల పాపాలు నశిస్తాయని నమ్మకం.✍️```

*Courtesy: *భక్తి* మాసపత్రిక

*సేకరణ:* 🙏

. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

                       🌷🙏🌷


 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏


🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀

*రేపటి తరానికి బతుకు, భద్రత లతోపాటు భారతీయత కూడా నేర్పండి.*

                     ➖▪️➖

ఇలాటి మంచి విషయాలకోసం…

*“భగవంతుని విషయాలు గ్రూప్“* లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి... 9440652774. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏

కామెంట్‌లు లేవు: