*తిరుమల సర్వస్వం -*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-7
స్వర్ణయుగం
పధ్నాలుగువ శతాబ్దపు ప్రథమార్థంలో సంగమవంశానికి చెందిన మొదటి బుక్కరాయలుతో ప్రారంభమైన విజయనగర రాజుల పరిపాలనాకాలం దక్షిణ భారతదేశానికే కాదు, తిరుమల క్షేత్రానికీ స్వర్ణయుగమే!
ఒక మహాసామ్రాజ్యావిష్కారానికి నాందీసూచకంగా, విజయనగర రాజుల పరిపాలన ప్రారంభం లోనే తిరుమల ఆలయంలో ఓ మహత్తరమైన చారిత్రక సంఘటన చోటు చేసుకుంది. 1330 - 1340 సంవత్సరాల మధ్యకాలంలో, ఒకానొక వేడుక సందర్భంగా శ్రీరంగపట్టణ వాసులు రంగనాథస్వామి ఉత్సవమూర్తిని స్నానాభిషేకం నిమిత్తం కోలెరూన్ నది (కొల్లిడం అని కూడా పిలువబడే, కావేరీ నది యొక్క ఉపనది) వద్దకు తీసుకువచ్చారు. అంతలో, హఠాత్తుగా మొహమ్మద్ తుగ్లక్ కన్ననూర్ నుండి తన అశ్వికదళంతో కొలెరూన్ నది వైపుకు దూసుకు రావడం లోకాచార్యుడనే విష్ణుభక్తుడు గమనించాడు. ఏదో కీడును శంకించిన ఆ భక్తుడు, మరికొందరి భక్తుల సాయంతో రంగనాథుని మూర్తిని ఓ పల్లకిలో కెక్కించుకొని పుదుక్కొట్టై, మైసూరుల మీదుగా తిరుమల జేరుకొని ఆ మూర్తిని ఆలయంలో భద్రపరిచారు. దాదాపు 30 - 40 సంవత్సరాల పాటు ఈ మూర్తి, ఆలయం యొక్క సంపంగి ప్రాకారం లోని ఓ మంటపంలో పూజలందుకుంది. 1371 వ సంవత్సరంలో, విజయనగర రాజుల పరిపాలన వ్రేళ్ళూనుకొని, దక్షిణభారతదేశంలో శాంతిభద్రతలు వారి అదుపులోకి వచ్చి, తురుష్కుల దండయాత్రల భయం పూర్తిగా ఉపశమించిన తరువాత మాత్రమే ఆ మూర్తిని మరలా శ్రీరంగానికి భద్రంగా చేర్చారు.
విజయనగర రాజుల పరిపాలనాకాలం ముందు వరకూ, శ్రీమద్రామానుజుల వారు చేసిన ఏర్పాటు ప్రకారం - శ్రీవారి ఆలయంలో ఆళ్వారులు రచించిన దివ్యప్రబంధగానం మాత్రమే జరిగేది. ప్రముఖ వైష్ణవాలయంలో నిత్యవేదపఠనం జరగవలసిన ఆవశ్యకత తన దృష్టికి రాగా - అప్పటి ప్రభువు రెండవ దేవరాయలు పేరు మీదుగా శ్రీనివాసపురం (దీన్నే సిత్తక్కుట్టై లేదా సిద్దకుట్టై అని కూడా పిలుస్తారు) అనే గ్రామ ఆదాయాన్ని తిరుమలలో శాశ్వత వేదపఠనం నిమిత్తం కేటాయించడం జరిగింది. అప్పుడు ప్రారంభమైన వేదపఠనం ఈనాటికీ నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. విమాన ప్రాకారమార్గానికి ఉత్తరం వైపున, విమానవేంకటేశ్వరుడికి ఎదురుగా ఉదయం వేళల్లో శ్రవణానందకరంగా వేదపారాయణం జరుగుతుంది.
సంగమ వంశప్రభువు సాళువ నరసింగదేవ మహారాయల పాలనతో ఆలయ చరిత్రలో మరో సువర్ణాధ్యాయం ఆరంభమైనట్లు చెప్పుకోవచ్చు. వారి కాలంలో కందాడై రామానుజ అయ్యంగార్ అనే ప్రముఖ శ్రీవైష్ణవ భక్తుని మార్గదర్శకత్వంలో - ఆలయ నిర్వహణ లోనూ, కైంకర్యాలలోనూ అనేక విప్లవాత్మకమైన సంస్కరణలు చేపట్టబడ్డాయి. విజయనగర రాజుల దాన పరంపర అప్రతిహతంగా కొనసాగడంతో, అప్పటి వరకూ ఆలయంలో అరకొరగా ఉన్న శాసనాలు ఆ కాలం నుండి వెల్లువెత్తాయి.
రెండవ హరిహర రాయలు - 'మాశి' అనే తమిళమాసంలో శ్రీనివాసుని పేర ఒక ఉత్సవం నిర్మించే నిమిత్తం - పుంగోడు అనే గ్రామాన్ని ఒక శ్రీవైష్ణవ పీఠానికి దత్తం చేసి, ఆ గ్రామ వార్షికాదాయంలో కొంత భాగం పీఠాధిపతికి వచ్చే ఏర్పాటు చేశారు. అప్పటినుండి విజయనగర ప్రభువులు నిర్మించిన రామానుజ కూటాలు (అన్నదానకేంద్రాలు), పుష్పోద్యానవనాలు, దేవాలయ మంటపాలు, శిఖరాలకు; ప్రవేశ పెట్టిన సేవలకు, చేసిన దానాలకు అంతే లేదు.
14 వ శతాబ్దపు చరమాంకంలో, విరూపాక్షుని పాలనతో విజయనగర సామ్రాజ్య పాలనా పగ్గాలు సంగమ వంశీయుల నుండి సాళువ వంశం హస్తగతమయ్యాయి. వీరి హయాంలో - పవిత్రోత్సవం, అధ్యయనోత్సవం, కొడై తిరునాళ్ళు వంటి ఉత్సవాలు ప్రవేశ పెట్టబడ్డాయి. 1434 వ సంవత్సరంలో, తమిళ ఆదిమాసం నుండి ఆరు నెలల పాటు ఉదయపు నిత్యార్చనలో భాగంగా శ్రీవారి మూలమూర్తి ముఖారవిందానికి పునుగుపిల్లి తైలంతో లేపనం చేసే సాంప్రదాయం మొదలైంది. వీరి పాలనాకాలంలో చోటుచేసుకున్న మరో ముఖ్య ఘట్టం ఏమిటంటే - పసింది వెంకటత్తురైవర్ గారిచే, అష్టాదశ పురాణాలను ఆధారంగా చేసుకొని తిరువేంకట మహాత్మ్యం అనే పౌరాణిక గ్రంథ రచన. ఈ విషయాన్ని ఆవిర్భావ పరమార్థం అనే అధ్యాయంలో తెలుసుకుందాం.
1509 వ సం. లో మహారాజు వీరనరశింహుని మరణానంతరం సాళువ వంశ పాలన అంతమై తుళువ వంశరాజుల ఏలుబడి రావడంతో ఆలయ ప్రాభవం పతాకస్థాయికి చేరుకొంది. ఈ వంశ చక్రవర్తుల - ముఖ్యంగా శ్రీకృష్ణదేవరాయలు మరియు అచ్యుతదేవరాయలు - ద్వారా ఆలయానికి చేయబడిన సేవలు, ఇవ్వబడిన విరాళాలు; వారి తిరుమల యాత్రా విశేషాలు వేంకటేశుని సేవలో విజయనగర సామ్రాట్టులు అనే అధ్యాయంలో వివరంగా తెలుసుకుందాం. వీరి తరువాత అధికారం లోకి వచ్చిన తుళువ వంశరాజులు క్రమంగా బలహీన పడి, పాలనా వ్యవహారాలపై పట్టు కోల్పోసాగారు.
ప్రసిద్ధి చెందిన రాక్షసతంగడి యుద్ధానంతరం, 1575 వ సం. లో అళియరామరాయలి మరణం తరువాత తిరుమలరాజు విజయనగర సింహాసనాన్ని అధిష్టించడంతో అరవీడు వంశ రాజుల పాలన మొదలైంది. ఆ కాలంలో వెంకటపతిరాయలు తిరుమల క్షేత్రంలో పట్టాభిషిక్తుడై, చంద్రగిరిని రాజధానిగా చేసుకొని పరిపాలన సాగిస్తూ, తరచూ తిరుమలేశుణ్ణి దర్శించుకునేవాడు. మట్ల కుమార అనంతరాజు అనే స్థానిక ప్రభువు అలిపిరి మెట్ల మార్గం లోని, నేడు కొత్తగోపురం గా పిలువబడే రెండవ గోపురాన్ని, అక్కడి నుంచి గాలిగోపురం వరకూ గల మెట్లమార్గాన్ని నిర్మించి చరిత్రపుటల కెక్కాడు. ఈనాటి కడప జిల్లా రాయచోటి ప్రాంతం లోని మట్లి అనే గ్రామం పేరును బట్టి, ఆ పాలకులు మట్ల వంశీయులుగా పిలువ బడ్డారు.
1665 వ సం. లో గోల్కొండ, బిజాపూరు సుల్తానులు సంయుక్తంగా దండెత్తి రావడంతో అప్పటి అరవీడు వంశ ప్రభువు శ్రీరంగదేవ మహారాయ పరాజయం పాలయ్యాడు. అప్పటివరకూ హైందవరాజుల అధీనంలో ఉన్న విజయనగర సామ్రాజ్యం మహమ్మదీయ సుల్తానుల పరమైంది.
ఆ విధంగా, 1359 వ సం. లో శ్రీ మంగిదేవ మహారాయలుతో మొదలైన విజయనగర రాజుల పాలన, దాదాపు 300 సం. ల పాటు అవిచ్ఛిన్నంగా సాగి, 1665 వ సం. లో శ్రీ రంగదేవ మహారాయల ఓటమితో అంతమైంది. దాంతో, తిరుమల చరిత్రలో మరో అధ్యాయం మొదలైంది.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి