16, జులై 2025, బుధవారం

18-48-గీతా మకరందము

 18-48-గీతా మకరందము.

        మోక్షసన్న్యాసయోగము

    

      -పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


అII స్వకీయకర్మము(స్వధర్మము) ఒకవేళ దోషముతో గూడియున్నదైనప్పటికిని దానిని వదలరాదని చెప్పుచున్నారు –


సహజం కర్మ కౌన్తేయ! 

సదోషమపి న త్యజేత్ | 

సర్వారమ్భా హి దోషేణ ధూమేనాగ్నిరివావృతాః ||  


తా:- ఓ అర్జునా! స్వభావసిద్ధమగు కర్మము దోషయుక్తమైనను (దృశ్యరూపమైనను, లేక త్రిగుణాత్మకమైనను) దానిని వదలరాదు. పొగచేత అగ్ని కప్పబడునట్లు సమస్తకర్మములును (త్రిగుణములయొక్క) దోషముచేత కప్పబడియున్నవికదా!


వ్యాఖ్య:- కర్మ యనునది ఇంద్రియాదులచే చేయబడునదిగనుక దృశ్యమం దంతర్భూతమైనది. త్రిగుణాత్మకమైనది. ప్రకృతి (మాయ) యందు వర్తించునది. కనుకనే 

"దోషేణ" అని చెప్పబడినది. కాబట్టి ఆత్మకాని దోషము, దృశ్యరూపమగు దోషము, త్రిగుణాత్మకమైన దోషము ప్రతికర్మయందును గలదు. అందుచేతనే 'సర్వారమ్భా హి’ (సమస్తకర్మలును) అని తెలుపబడినది. కావున పొగచే అగ్ని కప్పబడి యుండునట్లు సమస్తకర్మలు (దృశ్యరూపములు కనుక) ఈ దృశ్యరూప దోషముచే గప్పబడియున్నవి. అయినను స్వభావసిద్ధములగు కర్మలను వదలరాదు. ఏలయనగా వానిని నిష్కామ బుద్ధితో, భగవదర్పితబుద్ధితో నాచరించినచో అవి చిత్తశుద్ధిద్వారా జ్ఞానమును, మోక్షమును గలుగజేయగలవు. అయితే పాపకార్యములను మాత్రము చేయరాదు. సమస్తకర్మములును 'మాయా' రూప దోషముచే నావరింపబడియున్నప్పటికిని, అందు శుద్ధకర్మచే అశుద్ధకర్మను, పుణ్యకర్మచే పాపకర్మను, నిష్కామకర్మచే సకామకర్మను తొలగించివేసి ఆ పిదప క్రమముగ సాధనాతిశయముచే ఇంకను పైకిపోయి నైష్కర్మ్యాత్మరూపమున చేరవలయును.

ఈ విషయమును మఱియొకదృష్టితో గూడ విచారించవచ్చును. వారువారు చేయుకొన్ని కార్యములందు పంచసూనాది అనివార్యదోషము లేర్పడుచుండును. జీవితయాత్రకై ఆ యా కార్యములను జనులు తప్పక చేయవలసియేయున్నారు. కావున ఆ యా దోషముల నివారణకై పంచవిధ ప్రాయశ్చిత్తము లేర్పడినవి.

దోషము (పంచసూనములు) - ప్రాయశ్చిత్తము (పంచమహాయజ్ఞములు)

1. ధాన్యమును ఉత్పత్తి చేయునపుడు సంభవించు ప్రాణిహింస - బ్రహ్మయజ్ఞము (వేదాధ్యయనాదులను జేయుట)

2. విసరునపుడు - పితృయజ్ఞము (పితృదేవతలను తర్పణాదులచే

తృప్తిపఱచుట)

3. కట్టెలు నరకునపుడు వానిచే వంటవండునపుడు - దేవయజ్ఞము (హోమము మున్నగునవి చేయుట)

4. జలము తెచ్చునపుడు, కాచునపుడు - భూతయజ్ఞము (ప్రాణులకు అన్నాదుల నొసంగుట)

5. ఊడ్చునపుడు - మనుష్యయజ్ఞము (అతిథులను, బ్రహ్మనిష్ఠులను, దీనులను భోజనాదులచే తృప్తిపఱచుట)

ఈ ప్రకారముగ కర్మలవలన గలుగు ఆ యా అనివార్యదోషములు పుణ్యకార్యములచే, నిష్కామకార్యములచే తొలగిపోగలవు. ఇంతియేకాక బ్రహ్మవిచారణ, ఆత్మధ్యానము మున్నగు మహోన్నత పవిత్రకార్యములచే జీవులందలి ప్రకృతి దోషములు లెస్సగ తుడిచిపెట్టుకొని పోగలవు. కావున వారి వారి స్వభావసిద్ధ కార్యమునందు ప్రకృతిజన్యములగు దోషములున్నప్పటికిని వానిని త్యజించక, నిష్కామబుద్ధితో వాని నాచరించుచుండినచో క్రమముగ హృదయము నిర్మలమై జీవునకు జ్ఞానప్రాప్తి ఉత్తమ బ్రహ్మపదప్రాప్తి సిద్ధించగలవు.

కామెంట్‌లు లేవు: