*తిరుమల సర్వస్వం -302*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-17
ఎవరు సమర్థులు ?
------------------------------
అయితే, అసలు సమస్య ఇప్పుడే మొదలైంది. ఆలయ వ్యవహారాలపై ఆధిపత్యం బ్రిటీష్ వారినుండి ఎవరికి సంక్రమించాలి ? ఇంతటి గురుతరమైన బాధ్యతను అత్యంత సమర్ధవంతంగా ఎవరు నిర్వహించగలరు ? తిరుమలక్షేత్రం లోనే కాకుండా - తిరుపతి పట్టణంలోనూ, దాదాపు చిత్తూరు జిల్లా మరియు పరిసర ప్రాంతమంతటా అప్పట్లోనే శ్రీవారికి లెక్కలేనన్ని మడులు - మాన్యాలు ఉన్నాయి. వాటన్నింటిని సంరక్షించడం ఎవరి వల్ల సాధ్యమవుతుంది ? ఇటువంటి క్లిష్టమైన ప్రశ్నలకు సమాధానం అంత సులభంగా దొరకలేదు. దానికోసం పెద్ద కసరత్తే జరిగింది..
అప్పట్లో - స్వామివారినే తమ సర్వస్వంగా భావించి, తమ జీవితాలను శ్రీవారిసేవకు అంకితం చేసిన వైష్ణవులలో అంకితభావానికి, సేవానిరతికి ఏమాత్రం కొరత లేదు. వారి నీతి - నిజాయితీలను, చిత్తశుద్ధిని ఏమాత్రం శంకించ నవసరం లేదు. అయితే, తంగళై - వడగళై అంటూ ఇరువర్గాలుగా చీలిపోయిన వైష్ణవులలో ఐకమత్యం లోపించి, పరస్పరం కలహించుకునే వారు. ఒకరిపై ఒకరు ఆధిపత్యం కోసం శాయశక్తులా ప్రయత్నించే వారు. కాబట్టి - వారికి అధికారం అప్పగిస్తే, పరస్పర స్పర్ధల కారణంగా వారు ఆలయ పరిపాలనా భారాన్ని సజావుగా నిర్వహించ గలగటం సందేహాస్పదమే !!
అలాగే, ఆలయంలో మరో బలమైన వర్గం - అనూచానంగా స్వామివారిని సేవించుకుంటున్నట్టి వంశపారంపర్య అర్చకులు. ఎల్లవేళలా పూజా పునస్కారాలలో మునిగి ఉండే అర్చకులలో పాలనా పాటవం అంతగా లేదు. పైగా, వారికి పాలనపగ్గాలు అప్పజెబితే వైదిక కార్యకలాపాలకు అంతరాయమేర్పడి, భక్తులలో ఆలయం పట్ల నిర్లిప్తత కలిగితే - కానుకల ద్వారా వచ్చే ఆదాయానికి గండి పడే అవకాశం ఉంది.
జియ్యంగార్లు కూడా వైదికవిధుల నిర్వహణ - కైంకర్యాలకే పరిమితమయ్యేవారు కానీ, ఆర్థిక వ్యవహారాలలో ఏమాత్రం ఆసక్తి కనపరిచేవారు కాదు. పైగా - వారిపాత్ర, పాలకవర్గానికి - అర్చకగణాలకు మధ్య అనుసంధాన కర్తలుగా వ్యవహరించేందుకే పరిమితం. వారికి ఇతరత్రా విధులు అప్పగిస్తే, జియ్యంగార్ల వ్యవస్థ యొక్క ముఖ్యోద్దేశం నెరవేరదు.
ఇలా - ఆలయానికి సంబంధమున్న వారందరి సామర్థ్యాన్ని; వారి వల్ల దేవాలయానికి, కంపెనీ వారికి కలిగే లాభనష్టాలను బేరీజు వేసిన తర్వాత బ్రిటిష్ వారి దృష్టి మహంతులపై పడింది. కొన్ని సానుకూలమైన అంశాలు వారికి సహకరించాయి -
◆ వీరు సుదూర ప్రాంతానికి చెందిన ఉత్తరభారతీయులు. స్థానికంగా బలము - బలగము లేనివారు. అలాంటివారికి అధికారం అప్పగిస్తే కంపెనీవారు ఆలయం పై పరోక్షంగా తమ పెత్తనాన్ని కొనసాగించవచ్చు.
◆ పైగా, మహంతుల పట్ల అధికారులకు, అర్చకులకు, జియ్యంగార్లకు, భక్తులకు - ఇలా ఆలయంతో ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ సంబంధం ఉన్న వారందరికీ - విశేషమైన గౌరవాభిమానాలు ఉన్నాయి. కాబట్టి వారికి అధికారాన్ని అప్పగిస్తే, ఆలయం లోని ఇతరవర్గాల వారికి కూడా అంతగా అభ్యంతరం ఉండదు.
◆ అంతే గాకుండా - మహంతు లందరూ సన్యాసాశ్రమం స్వీకరించిన వారే కాబట్టి, అధికారం వారి వారసులకు సంక్రమించే అవకాశం లేదు.
◆ మహంతులకు అప్పటికే - విస్త్రృతంగా ధార్మిక కార్యకలాపాలు చేపట్టగలిగినటువంటి పటిష్ఠమైన వ్యవస్థ, అన్ని హంగులతో కూడుకున్న సువిశాలమైన మఠం, ఆ మఠాన్ని ఎన్నో ఏళ్ళుగా సమర్థవంతంగా నిర్వహిస్తున్న అనుభవం - సమర్థత ఉన్నాయి.
ఈ విషయాలన్నింటినీ అంతర్గతంగా చర్చించుకొన్న ఆంగ్లేయులు - కొంత వారి స్వార్థాన్ని, మరికొంత ఆలయ బాగోగులను దృష్టిలో ఉంచుకొని; ఆలయ నిర్వహణ బాధ్యతను మహంతులకే అప్పజెప్పాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. తదనంతరం చకచకా ఉత్తర్వులు జారీ అయ్యాయి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి