16, జులై 2025, బుధవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

 *సౌప్తిక పర్వము ప్రథమాశ్వాసము*


*439 వ రోజు*


*అశ్వత్థామ ధృష్టద్యుమ్నుడిని వధించుట*


రధిక త్రయం పాండవ శిబిరాల వైపు బయలుదేరారు. అశ్వత్థామలో ఆవహించి ఉన్న ఈశ్వరుడిని ప్రమధగణాలు అదృశ్యరూపంలో వెంబడించ సాగాయి. కృపాచార్యుడు, కృతవర్మలను ముఖద్వారమున ఉంచి తాను మాత్రం పాండవశిబిరాలలో ప్రవేశించాడు. ముందుగా దుష్టద్యుమ్నుడి శిబిరంలో ప్రవేశించి మనసులో ఈశ్వరుడిని తలచుకొని, ఈశ్వర దత్తమైన కత్తి చేతబూని కసిగా ధృష్టద్యుమ్నుడిని చూసి ఇన్ని రోజులకు తన తండ్రిని చంపిన వాడిని చంపుతున్నానని సంతోషపడి ధృష్టద్యుమ్నుడిని తన్ని నిద్రలేపాడు. నేల మీదికిలాగి అతడి గుండెల మీద మోకాలు పెట్టి అదిమి అతడిని పిడికిళ్ళతో గుద్దాడు. అశ్వత్థామ చేస్తున్న అనుకోని ఈ హటాత్పరిణామానికి ధృష్టద్యుమ్నుడు నోట మాటలేక పడిపోయాడు. అశ్వత్థామ వింటి నారిని విప్పి ధృష్టద్యుమ్నుడి కంటానికి బిగించి పశువును చంపినట్లు చంపుతున్నాడు. చివరకు నోట పెగల్చుకుని " అశ్వత్థామా ! నన్ను నీ అస్త్రములు శస్త్రములు ప్రయోగించి చంపి నాకు ఉత్తమగతులు కల్పించు ఇలా నీచంగా చంపకు " అని ప్రార్ధించాడు. అశ్వత్థామ " వీలు లేదు నా తండ్రిని చంపిన వ్యక్తికి ఉత్తమగతులు కలుగకూడదు. నిన్ను ఇలాగే దారుణంగా చంపుతాను " అని పిడికిలితో గుద్దసాగాడు. అప్పటికే అక్కడ ఉన్న వారు మేల్కొన్నా ! అశ్వత్థామ భీకరాకృతి చూసి రాక్షసుడని ఎవరూ ముందుకు రాలేదు. అశ్వత్థామ తన కాళ్ళతో పిడికిలితో తన్నితన్ని మోదిమోది ధృష్టద్యుమ్నుడిని అతి కౄరంగా చంపి వింటినారిని తీసి వింటికి కట్టాడు. ధృష్టద్యుమ్నుడి శిబిరం విడిచి వేరొక శిబిరానికి వెళ్ళాడు.


*అశ్వత్థామ పాంచాల వీరులను సంహరించుట*


అప్పటి వరకు కళ్ళప్పగించి చూస్తున్నకాపలాదారులు పెద్దగా ఎలుగెత్తి కేకలు వేసారు. అది విని చుట్టుపక్కల శిబిరాలలో ఉన్న సైనికులు, రాజులు నిద్రలేచారు. ఏమి జరిగిందో అని అందరూ ఆందోళనకు గురి అయ్యారు. ఎవరో భయంకరాకారుడు వచ్చి ధృష్టద్యుమ్నుడిని చంపాడని కాపలాదారులు చెప్పారు. " వాడిని పోనీయకండి పట్టుకోండి పొడవండి " అన్న కేకలు మిన్నంటాయి. అందరూ అటువైపు పరుగెత్తారు. అందరూ కలసి అశ్వత్థామను పట్టుకున్నారు. అయినా అశ్వత్థామలో ప్రవేశించిన రుద్రుడి శక్తితో అశ్వత్థామ వారిని ఒక్క క్షణంలో చంపాడు. తరువాత ఉత్తమౌజుడి శిబిరంలో ప్రవేశించి అతడి జుట్టుపట్టుకుని ఈడ్చి నేల మీద పడవేసి కత్తితో అతడి తల నరికాడు. అది చూసిన యుధామన్యుడు అశ్వత్థామను ఎదుర్కొన్నాడు. అదే కత్తితో అశ్వత్థామ యుధామన్యుడి తల తెగనరికాడు. అశ్వత్థామను అడ్డుకునే వారు లేక పోయారు. పాంచాల వీరులను వరుసబెట్టి నరుకుతున్నాడు అశ్వత్థామ. శరీరమంతా రక్తంతో తడిచి అత్యంత భీకరంగా కనిపిస్తున్న అశ్వత్థామను చూడగానే అనేకులు ప్రాణాలు విడిచారు. ద్రుపదకుమారుల శిబిరాలలో ప్రవేశించి వారి ప్రాణాలను యమపురికి పంపాడు అశ్వత్థామ. అశ్వశాలలో, గజశాలలో ప్రవేశించి ఏనుగులనూ గుర్రములనూ తెగనరికాడు. మనిషాపశువా అనే తేడా లేకుండా అడ్డువచ్చిన వారిని అడ్డంగా నరుకుతూ మృత్యుదేవతను తలపింప చేస్తున్నాడు అశ్వత్థామ ఒక్కొక్క శిబిరంలో ప్రవేశించడం అందులో నిద్రిస్తున్న వారిని నరకడం మరియొక శిబిరంలో ప్రవేశించడం ఆ విధంగా మారణకాండ సాగిస్తున్నాడు. అశ్వత్థామను చూసి అంతా " ఎవరో రాక్షసుడు వచ్చి నరుకుతున్నాడు " అని భీతి చెందుతున్నాడు.


*అశ్వత్థామ ఉపపాడవులను సంహరించుట*


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: