*పాండవ బీడు: (మాటల మూటలు - బూదరాజు రాధాకృష్ణ)*
భారత కథను ఉగ్గుబాలతో నేర్చినందువల్ల కురుక్షేత్ర సంగ్రామంలో విజయం సాధించిన పాండవులూ, వారి పరిపాలనలో అనాథలు, విధవలు, వృద్ధులు, యుద్ధంతో సంబంధంలేని వ్యక్తులూ ఉన్నందువల్ల దేశం బీడుగా మారిందనే భావమూ ఒంటపట్టి ఈ మాటకు విశేషార్థం వచ్చింది. నిజానికి పాడవ/ పాండవ అనే తెలుగు మాటకు 'దున్నని భూమి' అని అర్థం. వ్యవసాయానికి పనికిరాని బంజరు నేలనూ ఊసర క్షేత్రాలనూ మరుభూములనూ పాడవ భూములు.. తెలంగాణలో పడావు భూములు అంటారు. పాండవ అనేది దానికి రూపాంతరం. పాడవ/పాండవ బీడు అని ఈ అర్థాల్లో నిఘంటువులకెక్కిన మాట ఇది. ధ్వని సాదృశ్యంవల్ల తెలుగు సంస్కృతాల్లోని పాండవ శబ్దమూ పాండురాజు సంతానమూ ఒకటేనన్న భ్రమ కలిగిందన్నమాట. యువకులందరూ యుద్ధంలో హతులైనారు కాబట్టి పాండవుల పరిపాలనలో సేద్యం మందగించి రాజ్యం బీడుగా మారిందన్న భావం ఈ భ్రమకు ప్రధాన కారణం. పాదవ శబ్దం పాడు (బడిన) నేల అనే సమాసంలోని ' "పాడు'కు సంబంధించింది. పురాణకథలకున్న ప్రాబల్యమటువంటిరి.
సేకరణ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి