*తిరుమల సర్వస్వం -296*
చరిత్రపుటల్లో శ్రీనివాసుడు-11
అక్షరబద్ధమైన ఆలయవ్యవహారాలు
➖➖➖➖➖➖➖➖
ఈస్టిండియా కంపెనీ హయాంలో దేవాలయానికి జరిగిన మరో మేలు ఆలయ ఆచార వ్యవహారాలను, స్థిరచరాస్తులను, సిబ్బంది వివరాలను, వారి బాధ్యతలను, వంశపారంపర్యంగా వారికి సంక్రమించిన గౌరవమర్యాదలను, పారితోషికాలను అక్షరబద్ధం చేయడం. అప్పటివరకూ ఆలయ వ్యవహారాలన్నీ మౌఖికాదేశాల మేరకు, పరంపరానుగతంగా వస్తున్న కట్టుబాట్ల కనుగుణంగా నడిచేవి. లిఖితపూర్వక నియమ నిబంధనలు, ఆస్తుల వివరాలు శిలాఫలకాల మీదా, రాగిరేకుల పైనా, తాళపత్రాల యందు మాత్రమే లభించేవి. శతాబ్దాల తరబడి ఆ నిబంధనలను, వివరాలను క్రోడీకరించక పోవడం వల్ల ఆలయ నిర్వహణలో ప్రామాణికత లోపించి అనేక ఇబ్బందులు ఎదురయ్యేవి. వేర్వేరు కాలాల్లో వెలువడిన, పరస్పర విరుద్ధంగా ఉన్న మౌఖికాదేశాలను స్వలాభేపేక్ష కోసం అన్వయించుకున్న సందర్భాలు కూడా అరుదుగా చోటు చేసుకునేవి. ఈ లోటుపాట్లను అధిగమించి, అనవసరమైన, అసంబద్ధమైన వ్యయాలకు కత్తెర వేసి, ఆలయ నికరాదాయాన్ని పెంపొందించు కోవడం కోసం; ఆలయ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకునే నిమిత్తం అందుబాటులో ఉన్న సమస్త వివరాలను మొట్టమొదటి సారిగా, అప్పుడప్పుడే అందుబాటు లోకి వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని, కాగితం మీద ముద్రించి అక్షరబద్ధం చేసే బృహత్తర కార్యానికి కంపెనీ వారు శ్రీకారం చుట్టారు. వారు పాలనా సౌలభ్యం కోసం ముఖ్యంగా ఐదు రిజిష్టర్లలో ఆలయ వివరాలన్నింటినీ నిక్షిప్తం చేశారు. అవేంటో ఇప్పుడు చూద్దాం -
1819 వ సం లో కూర్చబడిన పైమాయిషీ అనే దస్తావేజులో తిరుమల, తిరుపతి, తిరుచానూరు లో ఉన్న 18 ప్రముఖ ఆలయాల, ఉపాలయాల భౌతిక స్వరూపాలను, కొలతలను, ఆలయాల విస్తీర్ణాన్ని, మూర్తుల వివరాలను పొందుపరిచారు. తిరుమల ప్రధానాలయం, తిరుపతి లోని గోవిందరాజస్వామి ఆలయం, అలిపిరి వద్ద గల కపిలేశ్వరస్వామి ఆలయం, అందులోని కొన్ని ఉపాలయాలు, పద్మావతి అమ్మవారి ఆలయం, అందలి ఉపాలయాలు, వరదరాజస్వామి ఆలయం, అలిపిరి మార్గం లోని పాదాలమంటపం, హరిజనవాడల్లో గల కొన్ని ఆలయాలు (ఇవి ఇప్పుడు చాలావరకూ కాలగర్భంలో కలిసిపోయాయి) పైమాయిషీ జాబితాలో కానవస్తాయి. ఈ వివరాలను అప్పట్లో సంబంధిత గ్రామకరణాలు తయారు చేయగా, అప్పటి తహసీల్దార్ ఆఫీసులో శెరిస్తేదార్ గా పని చేసే అలబ్దు గోవిందరావు అనే ఉద్యోగి ధృవీకరించారు. ఈ దస్తావేజు ద్వారా ఆలయాలకు సంబంధించిన విలువైన సమాచారం భావితరాల వారికి లభించడమే కాకుండా, ఆలయ సరిహద్దులు చెరిగిపోకుండా, అవి అన్యాక్రాంతం కాకుండా కాపాడబడ్డాయి.
అదే సంవత్సరం (1819) లో
కూర్చబడిన సవాల్ జవాబ్ పట్టీ అనే మరో పుస్తకంలో - పైమాయిషీ లో పొందుపరిచి బడిన ఆలయాలకు మరికొన్ని ఆళ్వార్ ల దేవాలయాలు కలిపి మొత్తంగా 22 దేవాలయాల ఆదాయ వ్యయాల, ధర్మకార్యాల, సేవల వివరాలు; ఆలయాల, మంటపాల కట్టుబడికి సంబంధించిన వివరాలు; తరగతుల వారీగా ఆలయ సిబ్బంది వివరాలు (కైంకర్యపరులను మినహాయించి), వారి విధులు, వాటిని అతిక్రమించిన వారికి విధించే జరిమానాలు; ఆలయ చరాస్తుల భద్రతకు సంబంధించిన వివరాలు; తిరుపతి పట్టణంలో నిర్వహించబడే అన్నదాన కేంద్రాల, ధర్మసత్రాల వివరాలు, వీటన్నింటినీ మెరుగు పరచడానికి తీసుకోవలసిన చర్యలు ప్రశ్నలు - జవాబుల రూపంలో నమోదు చేయబడ్డాయి.
కైంకర్యపట్టీ అనే మరో రికార్డులో - ఆలయం నందు వివిధ హోదాల్లో సేవలందిస్తున్న కైంకర్యపరుల పూర్తి వివరాలు, వారి నిర్దిష్ట విధులు, వంశపారంపర్యంగా వారికి దక్కుతున్న ఆలయ మర్యాదలు, నగదు మరియు ద్రవ్యరూపంలో వారికి లభిస్తున్న పారితోషికాలు, వారి అధీనంలో ఉన్న ఆలయభూములు మరియు గ్రామాల వివరాలు పొందుపరిచారు. దీనిలో ఉన్న సమాచారాన్ని బట్టి, ఆలయభూములు - వంశానుగతంగా వస్తున్న నాలుగు అర్చక కుటుంబాలు, జియ్యంగార్లు మరియు వారి సేవకులైన ఏకాంగులు, సర్కారు వారిచే నియమింప బడ్డ అర్చకులు, ఆచార్యపురుషులకు చెందిన ఏడు కుటుంబాల వారు, బొక్కసం వ్యవహారాలు చూసే ఉద్యోగులు, తాళ్ళపాక వంశీయులు, సన్నిధి గొల్ల వంశీయులు, మహంతులు, తిరుపతి మరియు మంగాపురం గ్రామ కరణాలు, కరకంబాడి - కృష్ణాపురం - మామండూరు పాలెగార్ల అధీనంలో ఉండేవి. ఆయా భూములపై వచ్చే ఆదాయాన్ని వారు వంశపారంపర్యంగా అనుభవిస్తూ, ప్రతిగా నిర్ణీత విధులు నిర్వహించాలి. 1801 సం. లో వెలువడిన ఈ రికార్డు, 1820 లో సమూలంగా సవరించ బడింది.
దిట్టం పుస్తకం అనే దస్తావేజులో - మూలమూర్తికి, ఉత్సవ మూర్తులకు, గర్భాలయంలో ఉండే ఇతర దేవతామూర్తులకు, ఉపాలయాల లోని మూర్తుల నిత్యనైవేద్యం నిమిత్తం; వారపుసేవలు, ఉత్సవాల సందర్భంలో సమర్పించే నైవేద్యాల నిమిత్తం తయారు చేయవలసిన వివిధ ప్రసాదాల పరిమాణాలు; వాటిలో వినియోగించ వలసిన ద్రవ్యాలు, దినుసుల నాణ్యత, మోతాదులు; అవి తయారు చేసే వంటబ్రాహ్మణులకు చెల్లించ వలసిన పారితోషికాలు - ఇత్యాది వివరాలన్నీ పొందుపరిచి ప్రసాదాల తయారీలో ప్రామాణికతకు పాదుగొల్పారు. కాలానుగుణంగా చోటు చేసుకున్న కొద్ది మార్పులు, చేర్పులు మినహా, అందులో ఉదహరింప బడిన ప్రసాదాల నైవేద్యక్రమం, వాటిలో ఉపయోగించే ద్రవ్యరాశుల పాళ్ళు ఈనాడు కూడా అమలులో పరచడం వల్ల; అదే ప్రామాణికతను ప్రాతిపదికగా చేసుకొని చేయి తిరిగిన వంటవారు అంకితభావంతో వండటం వల్లనే - ఈనాడు తిరుమల ప్రసాదాలు ప్రపంచ ప్రసిద్ధికెక్కాయి.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి