10, జులై 2025, గురువారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*శల్య పర్వము ద్వితీయాశ్వాసము*


*433 వ రోజు*


*శ్రీకృష్ణుడు ధృతరాష్ట్ర గాంధారీలను ఓదార్చుట*


కృష్ణుడు ధర్మరాజు మాట మీద హస్థినాపురం బయలు దేరి వెళ్ళి ధృతరాష్ట్రుడికి వర్తమానం పంపాడు. ధృతరాష్ట్రుడు శ్రీకృష్ణుడిని సాదరంగా తీసుకు రమ్మని చెప్పాడు. కృష్ణుడు ధృతరాష్ట్రుడి అంతఃపురంలోకి ప్రవేశించే సమయానికి అప్పటికే వ్యాసుడు ధృతరాష్ట్ర గాంధారీలను కుమారుల మరణానికి ఓదార్చడానికి వచ్చి ఉండటం చూసి వ్యాసునకు సాష్టాంగ నమస్కారం చేసి ధృతరాష్ట్ర గాంధారీలకు నమస్కరించాడు వారి పక్కన నేల మీద కూర్చుని ధృతరాష్ట్రుడి చేతిని తన చేత పట్టుకుని " మహారాజా ధృతరాష్ట్రా ! నీ కుమారుల వలన మీ వంశం సమూలంగా నాశనం అయింది. ఇలాంటి పరిస్థితి కలుగకూడదని పాండవులు నన్ను రాయబారానికి పంపారని నీకు తెలుసు సంధికి అంగీకరించి ఉంటే ఇలాంటి పరిస్థితి రాదు కదా ! మహారాజా లోకంలో జూదం ఆడటం సహజమే కాని అంతఃపురంలో ఉన్న కుల స్త్రీలను ఏక వస్త్రలను పతివ్రతలను సభకీడ్పించి వలువలు ఊడ్పింఛి అవమానించడం ఎక్కడైనా ఉందా ! అయినా పాండవులకు కోపం రాలేదు 13 సంవత్సరాలు అరణ్య అజ్ఞాత వాసాలలో ఇడుములు అనుభవించినా వారికి కోపం రాలేదు. అందుకే నీకుమారుడు వారికి చేసిన అవమానాలు సహించి మరచి మన్నించి అయిదు ఊళ్ళు ఇచ్చినా చాలని అర్ధించాడు. నీ కుమారుడు లోభంతో, అహంభావంతో ఆప్రతిపాదన తిరస్కరించాడు. విదురుడు బంధు మిత్రులు మహామునులు ఎంతో చెప్పి చూసారు. కాలోపహతులై నీవు నీకుమారుడు వారి మాటను పెడచెవిన పెట్టారు. విధి నిర్ణయం మార్చలేనిది కనుక ఇక వగచి లాభం లేదు. నిష్కల్మష హృదయులైన పాండవులు వారి మీద కోపగించ వలదని వేడుకుంటూ నన్ను పంపారు. ప్రస్థుతం మీకు కుమారులు లేరు కనుక మీ ఇరువురికి ఉత్తర క్రయలు చేసి ఉత్తమ గతులు కల్పించవలసిన పాండవుల హితం కోరుట మీకు శ్రేయస్కరం. మీకు కలిగిన కష్టానికి ధర్మరాజు ఎంతో దుఃఖిస్తున్నాడు. తన మనో భావాలను తెలుపమని ధర్మరాజు నన్ను మీ వద్దకు పంపాడు అని గాంధారిని చూసి " అమ్మాగాంధారీ ! నీకు సాటి వచ్చు రాజమాతను నేను ఈలోకములో చూడ లేదు. లేకున్న నిండు సభలో పలువురు వినుచుండ నీవు సుయోధనుడికి బుద్ధిమతి చెప్ప ప్రయత్నిస్తావా ! నాడు నీవు పలికిన పలుకులు నా చివులలో ఇప్పటికీ ప్రతిధ్వనిస్తున్నాయి. కాని సుయోధనుడు లోక విరుద్ధంగా నీ మాటలు పెడచెవినబెట్టాడు. తనకు ఏది మేలో తెలుసుకో లేక పోయాడు. సుయోధనుడు అహంకారంతో తుళ్ళక రాజ్యభాగాన్ని ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా ! నీవు ఆ నాడే చెప్పినట్లు కీడే జరిగింది. 

*సుయోధనుడు అశ్వత్థామను సైన్యాధ్యక్షుని చేయుట*

సంజయుడు ధృతరాష్ట్రుతో " మహారాజా ! భీమసుయోధనులు యుద్ధం చేసే సమయంలో నేను పక్కనే ఉన్న పొదలలో ఉన్నాను. వారు వెళ్ళి పోగానే నేను వెలుపలికి వచ్చి సుయోధనుడి వద్దకు వెళ్ళాను. ధూళితో నిండిన ముఖము మీద ఉన్న వెంట్రుకలను తొలగించి కళ్ళ నీరు నింపుకుని సుయోధనుడు " సంజయా ! చతస్సముద్ర వేలావలయుత ధరణీ తలంబును ఏకచ్ఛత్రాధిపత్యంగా పాలించిన సుయోధనుడి దుర్గతి చూసావా ! ఏకాదశ అక్షౌహినులకు అధిపతిని, అణుకువ కలిగిన సామంతరాజులు కలిగిన వాడిని అత్యంత వైభవమును అనుభవించిన వాడిని అయిన నేను ఎలా ఉన్నానో చూసావా ! లోక నిందకు వెరువక భీముడు అధర్మంగా నా తొడలు విరిచాడని మన వాళ్ళకు చెప్పు. నాడు భీష్ముని, ద్రోణుని, కర్ణుడిని అధర్మ యుద్ధంలో చంపి నేడు నన్ను భీముడు అధర్మ యుద్ధంలో చంపాడు. ఇదీ ఒక విజయమేనా ! ఇందుకు లోకులు పాండవులను పురుగులు పట్టిపోతారని తిట్టరా ! పాండవులకు ఇది వృధా విజయం కాక మరేమి ! నన్ను అధర్మంగా కూలదోసిన భీముడు ఏమి బాగుపడతాడులే ! సంజయా భీముడు నా తొడలు కొట్టి పడతోసింది చాలక తన వామ పాదంతో నా తలను తన్నాడు. లోకులు దీనిని మెచ్చుతారా ! నేను రారాజుగా ఉన్నప్పుడు నన్ను తృణీకరించారు. నేను పడిపోగానే నన్ను కాలితో తన్నారు. లోకులు ఘర్హించరా ! నేను ఎన్నో యజ్ఞాలు చేసాను. ఎన్నోదానధర్మాలు చేసి ఎందరినో శ్రీమంతులను చేసాను. బ్రాహ్మణులకు అగ్రహారాలను ఇచ్చాను. నా బాహు బలంతో దేశాన్ని సుభిక్షంగా పాలించాను. ఇప్పుడీ శమంతక పంచకంలో మరణించి పుణ్యలోకాలకు పోతాను. నా గురించి నాకు చింత లేదు. పాండవులు నన్ను అధర్మ యుద్ధమున గెలిచి నా రాజ్యమును వశపరచుకున్నారు. నీకు అశ్వత్థామ, కృపాచార్యుడు, కృతవర్మ కనపడితే జరిగినది వివరించి నా మాటగా " పాండవులు అందరూ అనుకున్నట్లు ధర్మపరులు కాదు అసత్యవాదులు, అధర్మపరులు ధర్మము అనే ముసుగులో లోకమును వంచిస్తున్నారని వారికి చెప్పు. వారిని ఎన్నటికీ నమ్మరాదు " అన్నాడు.



*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: