10, జులై 2025, గురువారం

జ్ఞానాన్ని ఆరాధించే రోజు

 జ్ఞానాన్ని ఆరాధించే రోజు ఇది

"గురుర్ బ్రహ్మా గురుర్ విష్ణుః గురుర్ దేవో మహేశ్వరః 

గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః "ఈ శ్లోకం చిన్నదే కానీ అర్థం చాలా లోతైనది. గురువు అనే వ్యక్తిని బ్రహ్మ, విష్ణు, శివునిలా మూడు రూపాల్లో చూస్తూ, చివరికి పరబ్రహ్మతో సమానంగా పరిగణించడం భారతీయ సంస్కృతి గొప్పతనం. ఈ భావనను ప్రతిఫలించే పవిత్రదినమే గురుపౌర్ణమి. ఈ రోజున వ్యాస మహర్షి జన్మించిన రోజు. వేదాలను అనువదించి నాలుగు భాగాలుగా విభజించిన మేధావి. అతనే మహాభారతాన్ని రచించిన విశ్వవిద్వాంసుడు. అందుకే ఈ రోజును వ్యాసపౌర్ణమి అని కూడా అంటారు.

"మాతా పితా గురుర్ దేవం"

 (తల్లి, తండ్రి తర్వాత గురువు – అనంతరం దేవుడు) ఈ పదాల అనుక్రమంలో గురువు స్థానాన్ని చూడండి. ఎందుకంటే గురువు మాత్రమే శిష్యుడి లోపాలను సరిచేసి, అజ్ఞానాన్ని తొలగించి, జీవనమార్గం చూపుతాడు.

ఆధునిక దృష్టికోణం

నేడు గురువు క్లాస్‌రూమ్‌కే పరిమితం కావడం లేదు. జీవితంలోని మార్గదర్శకులు,

 కోచ్‌లు, మెంటార్లు, ఆచరణలతో పాఠం చెప్పేవారంతా గురువులే.

ఇలాంటి గురువులను గుర్తుంచు కోవడానికి ఒక రోజైనా ఉండడం అదృష్టం.

"ఆచార్యాత్ పదమాదత్తే..."

 (విద్యలో గురువు వాటా నాలుగింటిలో ఒకటి – మిగతా మూడు భాగాలు శిష్యుని మేధ, ఇతరులతో పంచుకోవడం, కాలంతో కలిపి ఎదగడం) ఈ భావన ఆధునిక కాలానికీ వర్తిస్తుంది – గురువు మాత్రమే బోధించేవాడు కాదు,తాను ప్రేరణనిచ్చే వ్యక్తి.

ఈ రోజు ఏంచేయాలి? గురువులను కృతజ్ఞతతో స్మరించటం.

 మన జీవిత మార్గదర్శకులను గౌరవించటం.

 నేర్చుకున్న దానిని ఇతరులకు పంచటం.

 మనల్ని మనం ఓ మంచి గురువుగా తీర్చిదిద్దుకోవాలని సంకల్పించటం.గురుపౌర్ణమి అనేది ఒక పూజా పర్వం కాదు 

 జ్ఞానానికి నమస్కరించే సంధ్యారాగం.గురువు రూపంలో దైవాన్ని దర్శించే రోజు. తేజోమయులైన గురువులు మన జీవితాల్లో శాశ్వతంగా వెలిగిపోవాలి."తమసో మా జ్యోతిర్ గమయ" (అజ్ఞానాంధ కారంలో నుండి జ్ఞానజ్యోతి వైపు నడిపించే వాడే గురువు!)జ్ఞానం పొందడంలో ఆనందాన్ని, పంచడంలో పరమార్థాన్ని వెతికే రోజు ఇది. గురుపౌర్ణమి మనకి కృతజ్ఞత భావన నేర్పే రోజు. ఇది శిష్యుని హృదయంలో గురువు పట్ల గౌరవాన్ని నిలిపే పండుగ. ఈ సందర్భం మనని గురు-శిష్య సంప్రదాయాన్ని గుర్తుచేస్తుంది, ఇదే సమయంలో సనాతన భారతీయ సంస్కృతిని మనం నిలుపుకోవాల్సిన బాధ్యతను గుర్తుచేస్తోంది. జ్ఞానమార్గంలో అజేయమైన ప్రయాణానికి ఇది ఒక కొత్త మార్గం చూపాలి. గురుపౌర్ణమిశుభాకాంక్షలతో…

-ఎస్.వి.రమణా చార్య,సీనియర్ జర్నలిస్ట్

కామెంట్‌లు లేవు: