10, జులై 2025, గురువారం

విశ్వగురువు వేదవ్యాసుడు*



*విశ్వగురువు వేదవ్యాసుడు*

 

సంస్కృతంలో 'గు' అనే శబ్దానికి చీకటి అని 'రు' అంటే నాశనం చేసే తేజస్సు అని అర్థం. గురువు తేజోమయమై మనలోని అజ్ఞానమనే చీకటిని పారద్రోలుతారు. మన భారతీయ సనాతనధర్మంలో గురువులకి అగ్రస్థానం ఉంది. హిందూమతంలో గురువును, భగవంతునిగా భావిస్తుంటారు. మనిషి జీవితంలో అడుగడుగునా గురువు చేయూత అవసరం ఏదో రూపంలో కనబడుతూ ఉంటుంది. మన భారతీయ సనాతనధర్మంలో వ్యాసపౌర్ణిమకు అత్యంత ప్రాధాన్యత ఉంది. లోకహితార్ధం వ్యాసుడు సత్యవతికి పరాశరుడి వలన పుట్టాడు. మానవజాతికంతటికీ మంచి ఆధ్యాత్మిక వారసత్వాన్ని మిగిల్చాడు కాబట్టి ఆయన్ని మానవాళికంతటికీ గురువుగా భావిస్తుంటారు. 

వేదవ్యాసుని పూర్వనామం *కృష్ణ ద్వైపాయనుడు*. వేదకాలపు సంస్కృతినంతా నాలుగు వేదాలుగా విభాగం చేసి. ఋగ్వేద, సామవేద, యజుర్వేద, అధర్వణ వేదాలుగా విభజించి సులభతరం చేయడంవలన, అతనికి వేదవ్యాసుడు అని పేరు వచ్చింది. 

సత్యవతికి పరాశరునికి జన్మించిన వ్యాసుడు పుట్టిన వెంటనే తపస్సుకు వెళ్లిపోతూ, సత్యవతికి తాను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ప్రత్యక్షమవుతానని చెప్తాడు. వ్యాసుని రచనలు, మన పురాతన ధర్మాలను, సత్సాంప్రదాయాలను అందరు అర్ధంచేసుకొనే రీతిలో వివరిస్తాయి. పురాణ రచనలో వ్యాసుని ఆలోచనా పటిమ, దీర్ఘ ప్రణాళిక, కథావివరణ అద్వితీయం. 


నాలుగు వేదాలలో ఉన్న పరమార్ధమంతా ప్రతిపాదించే విధంగా, ధర్మం, అర్ధం, కామం, మోక్షం అనే నాలుగు పురుషార్థములను సాధించడానికి అవసరమయ్యే జ్ఞానం అంతా వేదవ్యాసుడు మహాభారతంలో ఇమిడ్చాడు. వేదసారం, శాస్త్రాలు, పురాణాలు, ఉపనిషత్తుల సారాంశం ఇందులో ఇమడ్చడం వలన, దీనికి పంచమ వేదం అని పేరు వచ్చింది. *మహాభారతంలో ఉండేదే ఎక్కడైనా ఉంటుంది, ఇందులో లేనిది మరెక్కడా లేదు* అని ఉగ్రశ్రవసుడు భారత కథను శౌనకాది మునులకు వినిపించినప్పుడు అంటాడు.


క్రీస్తు పూర్వం 3 వ శతాబ్ధానికి ముందు, మ్లేఛ్చుల దాడుల వలన వేదసంస్కృతికి ప్రమాదం వాటిల్లింది. ప్రకృతి ఆరాధన, యజ్ఞయాగాది క్రతువులను చేయడంలాంటివి సన్నగిల్లాయి. వేదధర్మం అడుగంటే స్థితి వచ్చింది. *పరిణిత చిత్త* సంస్కారం లేకుండా కొందరు గురువులు వ్యవస్థను నాశనం చేసే ప్రమాదం ఏర్పడింది. అప్పుడు ఈ మహాభారత కథను ప్రాచుర్యంలోకి తీసుకు వచ్చి,దాని ద్వారా ప్రజలను మళ్ళీ వైదికమార్గంలో పెట్టడానికి ప్రయత్నించారు.


 మహాభారతకథకు కాల పరిమితి లేదు. ఇప్పటి సమకాలీన పరిస్థితులను చూసినా మనకు భారతం గుర్తుకు రాక మానదు. 

వేదాల సారాన్ని వివరించే ఎన్నోకథల ద్వారా, ధర్మాన్ని పాటించే గొప్ప రాజుల పరిపాలన, ప్రజల నడవడిక, కుటుంబ వ్యవస్థ, పండితుల ఆదరణ, ప్రకృతిని పరిరక్షించే క్రమం, అరిషడ్వర్గాలను అదుపు ఉంచుకోవడం, అసాధ్యం అనుకున్నది సుసాధ్యం చేసే సంఘటనలు ఎన్నో మహాభారతంలో కనబడతాయి. భయపడి, నిరాశ నిస్పృహలకు లోనయ్యే అర్జునుడికి, భగవానుడు ఉపదేశించిన భగవద్గీత హైందవ ధర్మానికి ఆయువుపట్టు అయ్యింది. 

మహాభారత ఇతిహాసంలో వేదవ్యాసుడు *ఒక పాత్రగా* కూడా కనిపిస్తాడు, అడుగడుగునా ఆయన గురు స్వరూపం కనిపిస్తూ ఉంటుంది. ధర్మానికి గ్లాని కలిగినప్పుడు పరిస్థితి చక్కదిద్దడానికి ప్రయత్నం చేస్తాడు. దుర్యోధనుడు ప్రవర్తించే అధర్మప్రవర్తన నచ్చక, ధృతరాష్ట్రుడితో కొడుకుని అదుపు చేయమని చెప్పడానికి వస్తాడు. ధర్మరాజుకు ధర్మసంకటం కలిగినప్పుడు, దాన్ని ఎలా అధిగమించాలో వివరించడానికి అడుగడుగునా కనబడతాడు . 

అరణ్య వాస సమయంలో

 *ప్రతిస్మృతి* అనే విద్యను ధర్మరాజుకు ఉపదేశించి అది అర్జునుడికి పాశుపాతం సంపాదించడానికి, ధర్మ పరిరక్షకులైన పాండవులను బలోపేతం చేయడానికి తన చేయూతనిస్తాడు.  


గాంధారి కోపాగ్ని పాండవులకు తగలకుండా, ఆమెను వారించడానికి వస్తాడు. 


కురుక్షేత్ర యుద్ధసమయంలో విశ్వశ్రేయస్సు కోరి, వినాశనానికి దారితీసే అశ్వత్థామను *బ్రహ్మశిరోనామకాస్త్ర* ప్రయోగం నివారించడానికి వస్తాడు. ధృతరాష్ట్రుణ్ణి , గాంధారిని, కుంతిని,విదురుడిని వానప్రస్థం చేసి ఇక జీవితాలు చాలించమని చెప్పడానికి అక్కడ ప్రత్యక్షం అవుతాడు. 

మనం మహాభారతం పరిశీలన చేస్తే, వ్యాసుడిలా మన జీవితాల్లో కూడా గురువు అనేవారు ఏదో రూపంలో కనిపించి మనల్ని సరైనా మార్గంలో నడిపిస్తారు, హృదయపూర్వకంగా మనం గురువుని ప్రార్థిస్తే, ఆశ్రయిస్తే, మన జీవిత గమనానికి గురువే ఆలంబన అవుతారు. 

ప్రపంచం దేశాలన్నీ మన భారతీయత వైపు, మన సనాతన ధర్మ వైపు చూసే రోజులు వచ్చాయి. భారతదేశం విశ్వగురువుగా ప్రపంచాన్ని శాసించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి అని ఆధ్యాత్మిక వేత్తలు విశ్వసిస్తున్నారు.   

వేదవ్యాసుడు జన్మించిన ఈ గురుపౌర్ణిమ నాడు ఆయనను స్మరించుకుంటూ, మా లిపి. గేమ్ డిజిటల్ గేమ్ ద్వారా మహాభారతాన్ని భావి తరాలకు అందించాలనే తపనతో ముందుకు సాగుతున్నాం. అందరికీ గురుపౌర్ణమి శుభాకాంక్షలు.


*చాగంటి ప్రసాద్*

(మహాభారత కథా అనుసంధానకర్త)

లిపి. గేమ్ ఇండియా లిమిటెడ్ 

9000206163

కామెంట్‌లు లేవు: