10, జులై 2025, గురువారం

కాలం రెక్కల కింద

 *కాలం రెక్కల కింద నడుచుకుంటూ...!!*


ఈ పోరాటం ఈనాటిది కాదు .

యుగాల చరిత్రకు సాక్షి భూతంగా నిదర్శనం

మనిషి దిగంతాలుగా పరిణితి చెందుతూ 

నిరంతర ప్రయాణానికి ఎదురుచూపులు..


ఎప్పుడూ భవిష్యత్తును ప్రశ్నగానే వేసుకుంటూ 

కాలం రెక్కల కింద నడుచుకుంటూ 

సజీవ కళలకు జీవం పోద్దామని 

వేసే ప్రతి అడుగు జవాబులకు అన్వేషణ...


కొండల్ని కోనల్ని మహాసముద్రాలని దాటుకుంటూ 

ఆహారపు అన్వేషణకు ఎన్నో పోరాటాలు 

పిడికెడు అన్నాన్ని ముద్దగా మార్చుకుంటూ 

నేలపై నిరంతరము సాగిన దాడులెన్నో...


బడుగు జీవులలో పుట్టిన దుఃఖం కదులుతూ 

మనిషిని మరమనిషిగా మార్చుకుంది 

సమూహాలై ప్రపంచాన్ని మోస్తూ 

అదృశ్య శక్తులేవో మోస్తున్నట్లు భ్రమ పడ్డారు..


జీవితాన్ని మోస్తున్నటువంటి మనుషులే 

నీరు నేలను మోయడం సులభమే 

ఖగోళాన్ని ఉదరగోళంలా చూసుకుంటూ 

దానికోసం నిత్య శ్రమజీవిలా కదులుతుంటారు...


రెండు కళ్ళు మూతలు పడుతున్నప్పటికీ 

మనసులోని ఆశల్ని నెరవేర్చుకునేందుకు

జీవితమౌన సముద్రాన్ని దాటేందుకు 

ఎల్లప్పుడూ కెరటాల రెక్కలతో ఎగురుతుంటారు..


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: