*కృష్ణపరమాత్మ చెప్పిన మోక్షప్రాప్తి ఎపుడు కలుగుతుంది?*
శ్రీ కృష్ణుడు రెండు విషయాలు చెప్పారు.
ఒకటి ఇంద్రియ నిగ్రహము.
రెండవది మనస్సును ఆత్మయందు లగ్నం చేయడం.
మొదటిది బాహ్యంగా చేయవలసినది. రెండవది అంతర్గతంగా చేయాల్సిన పని.
ముందు ఇంద్రియములను అదుపులో ఉంచుకుంటే బుద్ధి కూడా స్థిరంగా ఉంటుంది.
బయట ఇంద్రియములను నిగ్రహిస్తే సరిపోదు, లోపల మనసును కూడా ఆత్మయందు లగ్నం చేస్తేనే గానీ, బుద్ధి స్థిరంగా ఉండదు అని అర్థము.
కాబట్టి ఇంద్రియములు అదుపులో ఉండాలి, వాసనలు పోవాలి, బుద్ధి స్థిరంగా ఉండాలి, మనస్సు ఆత్మయందు లగ్నం కావాలి.
అప్పుడే వాడు స్థితప్రజ్ఞుడు అవుతాడు.
ఇంద్రియ నిగ్రహము, నిరంతర సాధన, శాస్త్రజ్ఞానము, సత్సంగము వీటితో వస్తుంది.
ఇవి సాధిస్తే బుద్ధి స్థిరంగా ఉంటుంది. మనస్సు ఆత్మలో లీనం అవుతుంది.
అప్పుడే పరమానందం కలుగుతుంది. కాబట్టి అన్నింటికంటే ఇంద్రియ నిగ్రహము ముఖ్యము అని చెబుతున్నాడు పరమాత్మ.
ఎందుకంటే, ఈ ఇంద్రియములు బాగా శాస్త్ర జ్ఞానము, బుద్ధికల వాడిని కూడా పడగొడతాయి. ఇంద్రియములు రథానికి కట్టిన గుర్రాల వంటివి. గుర్రాలు తమ దారిన తాము రథాన్ని లాక్కుపోతుంటే, రథం గోతుల్లో ప్రయాణం చేస్తుంది. ప్రమాదానికి గురి అవుతుంది.
అలాగే ఇంద్రియాలు, బుద్ధి చెప్పినట్టు వినకుండా తమ దారిన తాము పోతుంటే, వాడు ఎన్నటికీ పరమాత్మను తెలుసుకోలేడు.
ఇంద్రియములను వశంలో ఉంచుకుంటే వాడి ప్రజ్ఞ స్థిరంగా ఉంటుంది.
కాబట్టి సాధకుడు ఇంద్రియములను తన వశంలో ఉంచుకోవాలి. అవి తాను చెప్పినట్టు నడుచుకునేలా చేయాలి.
ఇది సాధించడానికి ఏమి చెయ్యాలి అంటే…
ధ్యానం చేయాలి!
ముందు మన మనస్సు పరమాత్మ యందు ఉంచాలి. పరమాత్మ గురించి ఆలోచించాలి. ముందు సగుణారాధనతో మొదలుపెట్టి, ఏదో ఒక రూపంలో ఉన్న విగ్రహమును పూజించి, ఆ తరువాత ఆ విగ్రహమును కూడా వదిలిపెట్టి నిర్గుణ ఆరాధన చెయ్యాలి. దానిని ధ్యానం అంటారు.
ధ్యానంలో కూర్చున్నప్పుడు మనసును పరమాత్మయందు లగ్నం చేయాలి.
*అప్పుడు మోక్షప్రాప్తి కలుగుతుంది అని బోధించాడు పరమాత్మ.*
🚩 *స్వస్తి* 🚩
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి