*"వకార పంచకం - వస్త్రధారణ"*
మనకు కేవలం చదువు, డబ్బు ఉంటే చాలు అనుకుంటాం.కానీ అలా కాదు. వీటితోపాటు "వకార పంచకం" ఉండాలి. వకార పంచకం అంటే "వస్త్రము, వపుష్షు, వాక్కు, విద్య,వినయం" అనే ఐదింటిని "వకార పంచకం" అని ఉంటారు. ప్రతి మనిషికి ఈ ఐదు ఉండాలి. లేకపోతే ఈ లోకంలో మనిషికి గౌరవం ఉండదు. వస్త్రధారణ ఈ ఐదింటిలో ఇంకా ముఖ్యం. సరియైన వస్త్రధారణ లేకపోతే అందరూ చిన్న చూపు చూస్తారు. ఇదిగో ఈ కథ చదవండి మీకే అర్థమవుతుంది.పూర్వం ధర్మపురి అనే గ్రామంలో ధనపాలుడు అనే ధనవంతుడు ఉండేవాడు.అతడు తాను సంపాదించిన ధనమంతా దానధర్మాలకే ఉపయోగించేవాడు. "ధర్మో రక్షతి రక్షితః" అని పెద్దలు చెప్పినట్లుగా అతని దానధర్మాలను గురించి ప్రజలంతా గొప్పగా చెప్పుకునేవారు. అలా అలా అతని పేరు దేశమంతా వ్యాపించింది. ఒకనాడు ఒక పండితుడు ధనపాలుని గురించి విన్నాడు. పండితుడు ఎంతో పేదవాడు. అందుకే ప్రతిరోజు భిక్షాటన చేయటం కంటే ఒకసారి ధనపాలుడులాంటి దాతను అర్ధిస్తే తన దరిద్రమంతా పోతుందని భావించాడు. ధనపాలుని దర్శనం కోసం అతని భవనానికి వెళ్ళాడు. బీదవాడు కావడంతో చినిగిపోయిన, మాసిపోయిన బట్టలతో బాగా పెరిగిన గడ్డంతో ఉన్నాడు. ద్వారపాలకులు అతనిని పిచ్చివాడిగా భావించారే గాని పండితుడిగా గుర్తించలేదు. ద్వారపాలకులు ఎంతసేపైనా అతనిని ధనపాలుని దర్శనం కోసం లోనికి వెళ్ళనివ్వలేదు. నేను వేద వేదాంగాలు,సకల శాస్త్రాలు చదివిన పండితుడిని. పండితులంటే మీ యజమానికి ఎంతో గౌరవం. కాబట్టి నన్ను లోనికి వెళ్ళనివ్వండి.మీకు పుణ్యం ఉంటుంది అని బ్రతిమాలాడు. అయినా సరే వారు "నీవు పండితుడివా" అంటూ హేళన చేశారే గాని లోనికి పోనివ్వలేదు.పండితుడు నిరాశతో ఇంటికి చేరుకున్నాడు. ద్వారపాలకులు ఎటువంటి వారికి మర్యాదిస్తున్నారో జ్ఞాపకం తెచ్చుకున్నాడు. తాను ఎలాగైనా ధనపాలుని దర్శనం చేసుకోగలిగితే చాలు. తన దరిద్రం తీరినట్లే అనుకున్నాడు. మరుసటి రోజు అంతా తన గ్రామంలో భిక్షాటన చేయగా వచ్చిన ధనంతో ఇంట్లోకి వస్తువులు కొనకుండా తళ తళమెరిసే మంచి వస్త్రాలు కొన్నాడు. క్షురకర్మ చేయించుకున్నాడు. ఒక సెంటు బుడ్డి కొన్నాడు. ఆ మెరిసే వస్త్రాలు ధరించి,సెంటు రాసుకుని ముఖాన పెద్ద నామం పెట్టుకుని ఎంతో ఆర్భాటంగా ధనపాలుని భవనానికి చేరుకున్నాడు.అతనిని చూసింది తడవుగా ద్వార పాలకులు ఇతను ఎవరో గొప్పగా పండితుడిలా ఉన్నాడు అనుకుంటూ వినయంతో అతనికి వంగి వంగి నమస్కారం చేస్తూ ధనపాలుని భవనంలోనికి పంపారు. ధనపాలుడు పండితునితో చాలాసేపు మాట్లాడాడు. తన ధర్మసందేహాలకు పండితుడిచ్చిన సమాధానాలు విని ఎంతో ఆనందపడ్డాడు. అతనికి ఎంతో ధనాన్ని ఇచ్చాడు. అంతేకాక ఈరోజు మా ఇంట్లో భోజనం చేసి వెళ్లాలని కోరాడు. పంచభక్ష్య పరమాన్నాలతో అతనికి విందు భోజనం ఏర్పాటు చేశాడు. తన ప్రక్కనే కూర్చుండబెట్టుకున్నాడు. ఇలా పండితుని ఎంతో గౌరవించాడు. పండితుడు భోజన సమయంలో అన్ని పదార్థాలను కొంచెం కొంచెం అన్నంతో కలిపి ఒక పెద్ద ముద్దగా చేశాడు. తన వస్త్రాన్ని కిందపరిచి దానిలో అన్నాన్ని మూటగట్ట సాగాడు. ధనపాలుడు పండితుని చూసి" ఓ పండితోత్తమా! ఇదేమిటి ఆహారాన్ని మీరు తినకుండా ఇలా మూట కడుతున్నారేమిటి?"అని అడిగాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! నేను మీ దర్శనం కోసం ఈ రోజే కాదు. నిన్న కూడా వచ్చాను. అయితే మాసిన గడ్డంతో,చినిగిన వస్త్రాలతో వచ్చాను. నా వేషం చూసి మీ ద్వారపాలకులు నన్ను లోనికి పంపలేదు. ఈరోజు తళతళలాడే ఈ వస్త్రాలతో వచ్చాను. నా వేషధారణ చూసి మీ సేవకులు లోనికి పంపారు. మీరు నన్ను ఎంతో గౌరవించారు. ఎంతో ధనం ఇచ్చారు. మంచి విందు భోజనం పెట్టారు. నిజం చెప్పాలంటే నా విద్య వలన కాకుండా ఈ వస్త్రాల వల్లనే ఈ రోజు నాకింత గౌరవం లభించింది. మరి నేను ఈ వస్త్రాలకు కృతజ్ఞతలు చెప్పవద్దా! అందుకే లభించిన ఆహారంలో కొంత ఆహారాన్ని ఈ వస్త్రాలకు పెడుతున్నానని తెలిపాడు. తన సేవకులు విద్యకు కాకుండా వేషానికి గౌరవిస్తున్నారని తెలిసిన ధనపాలుడు చాలా బాధపడ్డాడు. తన సేవకులు చేసిన తప్పుకు తాను క్షమాపణ కోరుతున్నానని క్షమించమని కోరాడు. అప్పుడు పండితుడు "ఓ ధార్మిక! ఇందులో మీ దోషం ఏమీ లేదు. మీ సేవకుల దోషం కూడా లేదు.
" వస్త్రేణ వపుషా వాచా,
విద్యయా వినయేన చ
వకారైఃపంచభిర్హీనః
నరో నాయాతి గౌరవం"
అని పెద్దలు చెబుతారు.
వస్త్రము( వేషధారణ )వపుష్షు( శారీరక సౌందర్యంతో/ అందం) వాక్కు, విద్య, వినయం అనే వకార పంచకం లేనిదే ఏ మనిషికి విలువ ఉండదు. ఇది తెలిసి కూడా నేను నా వేషధారణకు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఇంత ఎందుకు మంచి వేషధారణ చేయని వారి ఇంటిలో లక్ష్మీదేవి ఉండదు. అనగా దరిద్రం వస్తుందన్నమాట. పూర్వం సముద్రుడు కూడా పట్టు పీతాంబరాలు, (పచ్చని వస్త్రాలు) బంగారు ఆభరణాలు ధరించి వచ్చిన శ్రీమహావిష్ణువును చూసి ఇతడు చాలా బాగున్నాడు అనుకుని తన కుమార్తె అయిన లక్ష్మీదేవిని ఇచ్చి వివాహం చేశాడు. ఒంటికి బూడిద రాసుకొని, గజ చర్మాన్ని వస్త్రంగా ధరించి, మెడలో పాములను, కపాలా(పుర్రె)లను ధరించి వచ్చిన పరమేశ్వరుని చూసి కాలకూట విషం ఇచ్చాడట.
ఇలా ఒక్కొక్కరికి చూస్తే ఒక్కొక్కటి ఇవ్వబుద్ధి అవుతుంది.మన వేషధారణనుబట్టి మనకు ఇతరులు గౌరవం ఇస్తారు" అంటూ పండితుడు ధనపాలునికి వస్త్రధారణకు ఉన్న విలువ ఏమిటో తెలిపాడు.
ధనం ఉంటే చాలదు. మన అందంగా ఉండాలి. అందం ఉంటే చాలదు. మంచి మాట తీరు ఉండాలి. మాట తీరు చాలదు. మంచి చదువు చదవాలి. చదువు ఉంటే మాత్రమే చాలదు. వాటికి తోడు వినయం ఉండాలి. ఇవన్నీ ఉన్నా మంచి వస్త్రధారణ లేకుంటే మనిషికి సరియైన విలువ లభించదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి