19, జులై 2025, శనివారం

శ్రీమద్భాగవత కథలు*

 🔯🌹🌷🪔🛕🪔🌷🌹🔯

*🚩శనివారం 19 జూలై 2025🚩*

                         5️⃣


                  *ప్రతిరోజూ*

*మహాకవి బమ్మెర పోతనామాత్య*

``

    *శ్రీమద్భాగవత కథలు*

               ```

(రామకృష్ణ మఠం, హైదరాబాద్ ప్రచురణ ఆధారంగా)```

_________________________

         *భాగవత జ్వాల*

```

ఓం కారం ఒక అద్భుత నాదం, బ్రహ్మ హృదయాకాశంలో ప్రభవించిన తొలిశబ్దం, పవిత్ర నాదం, బృహతీ వాక్కు, 'ఓమ్' అని వినిపిస్తుంది. ముందు శృతం. తరువాత అక్షరాకృతిని ధరించింది. ఆ ఓంకారమే బ్రహ్మవిద్యాసర్వస్వములైన అన్ని మంత్రాలకు, అన్ని ఉపనిషత్తులకు, పుట్టినిల్లైన వేదమాత. సత్త్వరజస్తమస్సులనే మూడు గుణాలు, ఋగ్యజుస్సామములనే మూడు నామాలు, భూర్భువస్సువస్సులనే మూడులోకాలు, జాగ్రత్స్వప్నసుషుప్తులనే మూడు వృత్తులను కలిగినది. కనుక ఓంకారం త్రిగుణాత్మకమైనది. అప్పుడు బ్రహ్మ ఆ ఓంకారం నుండి స్వరాలు, స్పర్శలు, అంతస్థములు, ఊష్మములు (హ్రస్వములు, దీర్ఘములు) మొదలైన లక్షణాలతో కూడిన అక్షర సమామ్నాయాన్ని రూపొందించాడు. 

ఆ అక్షరాల సహాయంతో ఆయన తన నాలుగు ముఖాల నుండి నాలుగు వేదాలను ఉద్భవింపచేశాడు. బ్రహ్మ మానస పుత్రులు మరీచి మొదలైన వారు బ్రహ్మ ఉపదేశానుసారం వేదాలను నేర్చుకుని, శిష్య ప్రశిష్యులకు బోధించారు. ఒక్కొక్క యుగంలో మహర్షులు గురుముఖతః పరంపరగా అనుశృతంగా వేదాలను ఉజ్జీవింపచేస్తూ వచ్చారు. ఇది భాగవత దర్శనం.


మనం 'జంబూద్వీపే భరత వర్షే' అని సంకల్పంలో చదువుతూ ఉంటాం. అదేమిటో వివరంగా భాగవతంలో కనిపిస్తుంది. సప్తద్వీపాలు, సప్త సముద్రాల ఆవిర్భావం తరువాత భూమి నైసర్గిక స్వరూపం వివరిస్తూ జంబూద్వీపం భరతవర్షం అని చెప్పిన అంశాలు ఆశ్చర్యం కలిగిస్తాయి. నదుల వివరాలు, అడవులు, కొండల గురించి భాగవతం తెలియజేస్తుంది. భరత వర్షం మోక్షం పొందడానికి అనువైన కర్మభూమి అని యజ్ఞభూమి అని భాగవతం వివరిస్తున్నది. తరువాత ఖగోళ విషయం విస్తారంగా ఉంటుంది. సూర్యుడి రథం, సప్తాశ్వాలు, అరుణుడు, సూర్యుడి పయనం, సూర్యుని గతిని అనుసరించి కాల నిర్ణయం, 27 నక్షత్రాల ఉనికి, నవగ్రహాల స్థితి, సంచారాల వివరాలు, దూరాలు విస్తారాల అంకెలు, పాతాళ నరకలోకాల భూమండలం అడుగున ఉన్న లోకాల వివరాలు కూడా ఆశ్చర్యం కలిగిస్తాయి.```


 *భారత వర్షం:* ```

స్వాయంభువ మనువుకు ప్రియవ్రతుడు జన్మించాడు. అతడికి అగ్నీధ్రుడు పుట్టాడు. అతడికి నాభి జన్మించి బలి చక్రవర్తితో స్నేహం చేస్తాడు. సమస్త భూమండలాన్ని పాలించాడు నాభి. అతడికి ఋషభుడు అనే సద్గుణవంతుడైన కొడుకు పుట్టాడు. అతడి కొడుకుల్లో పెద్దవాడైన భరతుడు ఘోరమైన తపస్సు చేసి, మనస్సును సంసార బంధాల నుండి మళ్లించి చివరకు వాసుదేవుడిని చేరుకున్నాడు. ఆ భరతుడనే పుణ్యాత్ముడు ఏలిన భూమండలానికి అతడి పేరు మీద మన 'భారతవర్షం' ఉద్భవించింది. ఇది మన భారత చరిత్ర. మనదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చిందో భాగవతం వివరిస్తుంది. శ్రీమద్భాగవతం ఆ విధంగా చాలా సమగ్రమైన భారతీయ విజ్ఞాన సర్వస్వంగా మనకు కనిపిస్తుంది. పోతన భాగవతం అయిదు సంపుటాల్లో ఉంది. ఆ తరువాత టిటిడి వారు ఎనిమిది సంపుటాల్లో మరింత వివరంగా పోతన భాగవతాన్ని ప్రచురించారు. చాలా గొప్ప పుస్తకాలు అనడంలో సందేహం లేదు. కాని అందరూ అన్ని గ్రంధాలు సంపుటాలు చదవలేరు. అద్భుతమైన భాగవత పురాణ సారాంశాన్ని వీలైనంత తక్కువ పరిమాణానికి కుదించి అందులో సారమంతా దించి, మనముందుంచి జ్వాలా నరసింహారావుగారు గొప్ప మేలుచేశారు. కొత్తతరం వారు హాయిగా చదువుకొని తెలుసుకోవడానికి ఇది కరదీపికగా ఉపకరిస్తుంది.

```

 *మనిషిని తీర్చిదిద్దేవి భారత రామాయణ భాగవతాలు:* ```

మన నడవడికను శాసనాలు, రాజ్యాంగాలు, కోడ్ లు, చట్టాలు, శిక్షలు, సరిదిద్దడం చాలా కష్టం. ఇవన్నీ తప్పు జరిగిన తరువాత రంగంలోకి దిగి కొంత మందిని శిక్షించడానికి ఉపయోగపడతాయేమో గాని నేరం జరగకుండా ఆపడానికి అంతగా ఉపయోగపడక పోవచ్చు. ఒక నవయువకుడిని ఉత్తమ గుణ సంపన్నుడుగా తీర్చిదిద్దడానికి కావలసింది చట్టాలు, జైళ్లు, పోలీసులు కోర్టులు కాదు. సచ్ఛీలాన్ని ప్రేరేపించే నాలుగు మంచి మాటలు ఇంట్లో పెద్దలు ఆచరించే నాలుగు మంచి పనులు. వారు అనుసరించే మార్గాలు. వారిని నడిపించే ఆధ్యాత్మిక జీవన సూత్రాలు. రామాయణం వంటి కథలు. సత్యభాషణం, ప్రియభాషణం నేర్పే వ్యక్తిత్వ ప్రబోధాలు, ఏవి చేయకూడని పనులో, అవి చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో, వాటిని అదుపు చేయడం ఎంత అసాధ్యమో చెప్పే గాధలు. రామాయణం మనిషి ఏ విధంగా ఉండాలో చెబితే, మహాభారతంలో దుర్యోధనాదుల పతనం, ఏ విధంగా ఉండకూడదో చెబుతుంది. ఇక శ్రీమద్భాగవతమైతే చేసిన తప్పులకు పాపాలకు పరిహారాలు చూపి, భక్తి నేర్పి, కరుణ దయ ప్రేమ మార్గాలు చూపి, చివరకు జ్ఞానాన్ని ఇచ్చి, మహానందకరమైన మోక్షమార్గాన్ని సుగమం చేసే దివ్యజ్యోతి.


భాగవతంలో ముఖ్యమైన అవతార ఘట్టాలు రెండు- శ్రీకృష్ణావతారం, నరసింహావిర్భావం. నరసింహుని పేరు పెట్టుకున్నందుకు జ్వాలానరసింహారావు జన్మసార్థకం చేసే మంచి పని చేశారు. అదే ఈ భాగవత కథల రచన.


వ్యాస భాగవతం మనదేశపు అపారమైన వారసత్వ సంపద, సనాతన సంపద. సాహిత్యం, భాష, సంస్కృతి, హైందవం, భారతీయత, వైష్ణవం, అద్వైతం, అందులో విశిష్టాద్వైతం, ఉపనిషత్తులు, వేద వేదాంగాల సారం, భాగవతంలో లేనిదేదీ లేదు.```


 *మహాకావ్యం మహాభారతం:* ```

మహాభారతం ఒక మహా కావ్యం. చరిత్ర ఆ మహాభారతాన్ని ఎవరైనా పురాణ కథ అంటే నమ్మబుద్ధి కాదు. కొన్ని తరాల జీవితాన్ని వివరంగా తెలియజేస్తూ అనేక సత్పురుషుల జీవన కథా కథనాలతో ముడివేస్తూ, జన్మజన్మలబంధాలు వివరిస్తూ, ఈర్ష్యాద్వేషాలు, పగలు ప్రతీకారాలు, ధర్మాధర్మాలు, దురాశ, రాజ్యం కోసం కుట్రలు ఏ విధంగా జీవనాన్ని అతలాకుతలం చేస్తాయో చెబుతూ వాటి మధ్య ధార్మికంగా బతకడం గురించి చెప్పే సమర గాధ మహాభారతం. 

“మానవ జీవితమే ఒక మహాభారతం. అది మంచి చెడుల రెంటి నడుమ నిత్యఘర్షణం” అని శ్రీ శ్రీ రాసిన సినిమా పాటలో చరణాలు ఎంత నిజమో అనిపిస్తూఉంటుంది. మహాభారతం చాలా ఆసక్తి రేకెత్తించే కథల సమాహారం. యుద్ధం అన్నిటికన్నా ఆకర్షణీయమైనది. భయానకమైన హింస భారతయుద్ధంలో కనిపిస్తుంది. బహుశా అది గూడా ఒక కారణమై ఉంటుంది ప్రతి తరాన్ని ఆకర్షించడానికి.


భాగవతం ఆ విధంగా ఉండదు. సృష్టి క్రమాన్ని వివరించే పని చేస్తుంది. ప్రకృతి రహస్యాలను ఆవిష్కరించే జ్ఞానగ్రంధం భాగవతం. జీవుల నడవడికకు దీపస్తంభం భాగవతం. అందులో యుద్ధాలు, హింస ఉన్నప్పడికీ, భక్తికి భగవంతుడికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని అడుగడుగునా తెలియజేసే అద్భుత గ్రంధం భాగవతం. వందలాది కథలు వేలాది కథానికలు, ఎన్నెన్నో నాటకాలు, నాటికలు, అవతారాలు, అవతార రహస్యాలు భాగవతాన్ని సుసంపన్నం చేస్తాయి. ఆ కథలు కొన్ని చాలామందికి తెలుసు. కాని చాలా కథలు చాలామందికి తెలియవు. మూల గ్రంధం చదివితే తప్ప తెలియని కథలు పుంఖానుపుంఖాలుగా ఉంటాయి. మూలగ్రంధం ఆసాంతం చదివే విద్యార్థులు ఈ తరంలో ఎందరు ఉన్నారంటే మనం చెప్పలేము. రామాయణ భారత భాగవతాలను ఒక్కసారయినా పూర్తిగా చదివితే తప్ప భారతీయుడు కాలేడనిపిస్తుంది. 

ఆ లెక్కన ఎంత మందిని నిజంగా భారతీయులని అనగలమో తెలియదు.


జ్వాలా తన జీవనంలో సింహభాగం పురాణాల పఠనానికి, అందులో విశేషాల రచనకు వినియోగించారు. అది ఆయన చేసిన మంచి పని. ఆరుకాండల రామాయణానికి అనువక్త అయ్యాడు. ముందు తను కథను అర్థం చేసుకున్నాడు. తనకు అర్ధమయిన ఆ కథను అందరికీ అర్థమయ్యే విధంగా మళ్లీ చెప్పుకొచ్చినాడు. ఎన్ని సార్లు విన్నా వినాలనిపించే అద్భుత రమణీయాలు ఆ కథలు. అనేకులు రామాయణం తెలుసంటారు. నిజమే. ఆ కథ నడిచిన తీరు తెలియని వారు ఉండకపోవచ్చు. కాని వివరాలు, సూక్ష్మాలు, రహస్యాలు, అంతరర్థాలు తెలియాలంటే మొత్తం కొన్ని సార్లయినా చదవాలి. లేదా ఒక విమర్శనా దృక్కోణం నుంచి విశ్లేషించుకునేందుకు మనసును సిద్ధం చేసుకునైనా ఉండాలి. రెండూ లేకుండా సమగ్రమయిన అధ్యయనం సాధ్యంకాదు. ఏదీ లేకుండా నేను కూడా ఆ పురాణాలు చదివాను అంటే చెప్పేదేమీ లేదు.


భాగవత కథలలో మూల సూత్రం ఒకటే. కాని కథలు వేరు. కనుక ఆ కథలను ఒక శృంఖలం వలె ఒకటి తరువాత ఒకటి గా చదవవలసిన పని లేదు. చదివినా ఫరవాలేదు. కాని కథలు విడిగా చదివినా నష్టం లేదు. అటువంటి కథలే ఇవన్నీ..


భారతం వంటి పురాణాలు రాసిన వ్యాసుడికి మానసిక శాంతి లభించదు. అవును మరి. అక్షౌహిణీలకొద్దీ మానవ సంఘాల్ని మరణం వైపు నడిపించి రణం గురించి, ఆ రణానికి దారి తీసిన వ్రణాల గురించి వివరిస్తూ ఉంటే శాంతికి ఆస్కారం ఎక్కడ? వ్యాసుడు మహాభారతంలో స్వయంగా ఒక ప్రధానమైన పాత్రధారి. మొత్తం కథకు సూత్రధారి అనలేం కాని గత జన్మల గురించి, వెనుకటి తరాల గురించి, తరువాత తరాల గురించి తెలిసిన దీర్ఘాయువు వ్యాసుడు. పాండు రాజు ధృతరాష్ట్రుల తాత, చిత్రాంగదుడు, విచిత్ర వీర్యుడి తండ్రి. భీష్ముడికి సోదరసమానుడు. ఆయన మునిమనుమలు కొట్టుకుని అయిదుగురు తప్ప అంతా ముగిసిపోతే చూసిన ముత్తాత వ్యాసుడు. ఎంత అల్లకల్లోలానికి గురై ఉంటాడు. మనశ్శాంతి రమ్మంటే ఎందుకు వస్తుంది? ఎక్కడునించి వస్తుంది. మహాభారతంలో సాక్షాత్తూ శ్రీకృష్ణుడు కీలకమైన శక్తిగా భాసిల్లినప్పడికీ, వ్యాసుడు ఆయన అవతార తత్వాన్ని అందులో వివరించడానికి ఆస్కారం లభించలేదు.


భగవద్గీతలో ఉపనిషత్తుల వేదాల సారాన్ని పిండి ఇచ్చినప్పటికీ, అర్జుడిని విషాయోగం నుంచి రణకర్తవ్యోన్ముఖుడిని చేయడానికి సంబంధించినంత వరకు వివరణ ఉంది కాని, శ్రీ కృష్ణుని భగవత్ తత్త్వానికి సరైన వివరణ, సందర్భోచిత కథా కథనాలు మహాభారతంలో కనిపించవు. కనుక విడిగా భాగవతం అవసరమైంది. మహాభారతంలో చెప్పడానికి కుదరక, వీలుకాక, సందర్భం లభించక, చెప్పని కథలన్నీ భాగవతంలో వివరంగా చెప్పే అద్భుత అవకాశం కలిగింది. భగవద్గీతామృత సూత్రాలకు వందలాది వేలాది ఉదాహరణలు మనకు భారతంలో కాదు భాగవతంలో దొరుకుతాయి. భారతం సృష్టి వినాశనాన్ని దాని హేతువులను వివరిస్తే, భాగవతం సృష్టి రహస్యాలను, సృష్టి వివరాలను సృష్టి వికాసాలను అద్భుతంగా వివరిస్తుంది. రామాయణం కథ, భారతం కూడా కథే. కాని భాగవతం కథ కాదు. భారతీయత. విష్ణుతత్త్వం. పరంధాముడి పరతత్వ గాధ. భాగవతం ఒక ప్రబోధం. మనను నడిపించి మన మనసుల్లో మాలిన్యాల్ని తొలగించే పవిత్ర గ్రంధం భాగవతం. భగవంతుడికి సంబంధించిన గ్రంధం అని ఒక అర్ధం. భగవంతుడికి సంబంధించిన వ్యక్తుల కథ అని మరొక అర్థం. అందుకే భగవదవతారాల వివరణ ఉంటుంది. ఇది 21 భగవదవతారాల కథ.


శ్రీమన్నారాయణుడి విరాజమానమైన దివ్యరూపం మొదటి అవతారం. ఆ మొదటి అవతారమైన నాభి కమలం నుండి సృష్టి కర్త అయిన బ్రహ్మ పుట్టాడు. శ్రీమన్నారాయణుడి అవయవ స్థానాల నుండి అనేక లోకాలు సృష్టించబడ్డాయి. 1.మొదట

ఆ దేవుడు కౌమార సర్గాన్ని ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని చేపట్టాడు. 2.రెండవ సారి విశ్వసృష్టి కొరకు రసాతలానికి పోయి భూమండలాన్ని ఎత్తుతూ వరాహ దేహాన్ని ధరించాడు. 3.మూడవ అవతారం నారదుడు అనే దేవర్షిగా 4.నాల్గవది నర నారాయణ రూపం. 5.పంచమావతారం కపిలుడుగా. 6.ఆరవ అవతారం దత్తాత్రేయుడుగా అనసూయాదేవికి - అత్రిమహర్షికి పుట్టాడు. 7.ఏడవ అవతారం యజ్ఞుడు పేరుతో అకూతికి - రుచికి జన్మించాడు. 8.అష్టమ అవతారంలో ఉరుక్రముడు అనే పేరుతో జన్మించి విద్వాంసులకు పరమహంస మార్గాన్ని ఉపదేశించాడు. 9.తొమ్మిదవ అవతారంలో పృధు చక్రవర్తిగా జన్మించాడు. 10.పదవ అవతారంలో మహా మీనావతారం దాల్చాడు. 11.పదకొండవ అవతారంలో తాబేలుగా పుట్టి మందరాచలాన్ని మోశాడు. 12.పన్నెండవ అవతారంలో ధన్వంతరిగా జన్మించాడు. 13.పదమూడవ అవతారంలో మోహినీ వేషం ధరించి రాక్షసులను మోహితులను చేసి దేవతలకు అమృతాన్ని పంచాడు. 14.పద్నాలుగోది హిరణ్యకశిపుడిని సంహరించిన నరసింహావతారం. 15.పదిహేనవది బలిని మూడు అడుగులు అడిగిన వామనావతారం. 16.పదహారవది పరశురామావతారం. 17.పదిహేడవది వేదవ్యాస అవతారంగా ఎత్తి వేదాలను విభజించడం చేశాడు. 18.పద్దెనిమిదో అవతారం శ్రీరామావతారం. 19,20.పంతొమ్మిది - ఇరవైవది బలరామ-కృష్ణావతారాలు. 21.ఇరవై ఒకటో అవతారం బుద్దావతారం.

```    

               *(సశేషం)*

*🙏కృష్ణం వందే జగత్ గురుమ్!🙏*

``

          *రచన: శ్రీ వనం*    

   *జ్వాలా నరసింహారావు*

``

  *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```


*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🪷🪔🛕🪔🪷🌷🙏

కామెంట్‌లు లేవు: