🙏భాగవతము- అంతరార్ధము - తత్త్వము🙏
భాగవతము కలియుగమున మానవ కోటికి ఏకైక ముక్తి సోపానము. అందుకే పెద్దలు అంటారు “చదువుకుందాం భాగవతం; బాగుపడదాం; మనం అందరం”. ఇంతటి వరేణ్యానికి మూల కారణం, అది గాయత్రిని అధికరించిన మహా మంత్ర స్వరూపం కావటం. ఇక్కడ అధికరించిన అంటే అధికం చేయబడిన, వ్యాహృతి గావింపబడిన అని గ్రహించ వచ్చును. గాయత్రి మహా మంత్రం ఓంకార రూపం కనుక సాక్షాత్ శక్తి స్వరూపం. పర బ్రహ్మ తత్వం అని చెప్పబడుతుంది. ఓంకారం త్రైవర్ణాత్మకం. అకార, ఉకార, పూర్ణానుస్వరములు (మకారము) అనే మూడు వర్ణాలు లేదా శబ్దాల సమన్వితం. అకారం ఆరంభానికి, సృష్టికి, సృష్టికర్తకు ప్రతీక అనవచ్చు. . పూర్ణం (మకారము) ఇది లయానికి, ప్రళయానికి, శివునికి ప్రతీక అనవచ్చు. పూర్ణత్వం. ఉన్నది అనుకున్నది ఖాళీ కావటం అదే అనంతంతో నిండిపోవటం. ఉకారం స్థితికి, విశ్వానికి, సర్వ వ్యాపకానికి, విష్ణునికి ప్రతీక అనవచ్చు. ఇది త్రి మాత్ర పరిమితం. కార్య, కారణ, కర్తృత్వ ఆదుల సమన్వితం.
అలాగే శ్రీకారంలో శకార రకార ఈ కారములు
మూడు బీజాక్షరాలు శకారం శివ బీజం, రకారం అగ్ని బీజము ( శక్తీ బీజము ) ఈ కారము తురీయము అంటారు అంతకంటే వ్యక్తం చేయకూడదు.
భాగవతము ఒక మంత్ర శాస్త్రము బీజాక్షరముల అర్ధం కూడా చెప్పబడినది
ఓంకారం నకు వైదిక ప్రణవం అని పేరు వివరణ ఇవ్వవచ్చు శ్రీం మంత్ర శాస్త్ర ప్రణవం మంత్ర శాస్త్ర ప్రణవాలు ఐదు, వాటిని వ్రాయకూడదు వైదిక ప్రణవాలు ఐదు అవి వ్యక్తం చేయవచ్చును
ఓం, నమః, స్వాహా, స్వదా, వ్ఔషట్ అనేవి.
అనేక సందర్భాలలో వీటిని ఉపయోగిస్తున్నాము.
ఓంకారం బ్రహ్మ విష్ణు మహేశ్వరులనే త్రిమూర్తులకు, సత్వరజస్తమములనే త్రిగుణాలకి, భూఃభువస్సువః అనే త్రిలోకాలకు, బ్రహ్మచర్య గృహస్త వానప్రస్తలనే ఆశ్రమ త్రయానికి, బ్రహ్మణ, క్షత్రియ, శూద్ర అనే త్రైవర్ణికానికి, ఋగ్యజుస్సామములనే త్రయి రూప వేదానికి, త్రికోణాత్మకమైన శక్తి స్వరూపికి, జాగృతి నిద్రా సుషుప్తులనే అవస్థా త్రయానికి మున్నగు వానికి అధిదేవత. ఇవి గాయత్రీ మహా మంత్రానికి, భాగవత మహా పురాణానికి సంపూర్ణంగా అన్వయిస్తాయి.
వీటికి అతీతమైనది తురీయం, నాలుగవది. గాయత్రీ మంత్రంలో మూడు పాదాలు వరకు సామాన్యులకు అర్హం. తురీయ పాదం, తురీయాశ్రమం సన్యాసంలో పరిణితి అందుకున్న వారికి, పాదుకాంత దీక్షా పరులకు అర్హం అయింది. ఆ తురీయావస్థ ముక్తి, మోక్షం, వైకుంఠం. . . అంటుంది భాగవతం. ఈ త్రయీ మార్గం దృష్టితో ఓంకారం, గాయత్రీ మహా మంత్రం, భాగవతం మధ్య సమత్వ ముంది.గాయత్రి మంత్రం యొక్క తురీయా పద భాష్యమే భాగవతం.
నాంది పద్యములో గాయిత్రి మంత్ర చతుష్పాద లక్ష్యమే భాగవతం అని గూఢముగా చెప్పినాడు గాయిత్రి మంత్ర చతుష్పాదము చెప్పకూడదు కావున చెప్పుట లేదు అది మోక్షదాయిని. ఈ పద్యమే సూక్ష్మ కామకళతో ప్రారంభం అయినది.ఇది మంత్ర శాస్త్రములోని రహస్య విషయం.
శ్రీకైవల్యపదంబుఁ జేరుటకునై చింతించెదన్ లోకర
క్షైకారంభకు భక్తపాలనకళా సంరంభకున్ దానవో
ద్రేక స్తంభకుఁ గేళిలోలవిలసద్దృగ్జాలసంభూతనా
నాకంజాతభవాండకుంభకు మహానందాంగనాడింభకున్
మోక్ష సాధనే భాగవత పరమప్రయోజనమని చాటి చెప్పాడు.
ఈ పద్యములో సృష్టి, స్థితి సంహారములు ఉన్నాయి గాయిత్రి చతుష్పాద లక్ష్యం ఉన్నది కావున ఇది చతుష్పాదములతో ఉన్న గాయిత్రి మంత్రము కావున ఈ పద్యం చదివితే నాలుగు పాదాల గాయిత్రి చేసినట్లే.
పోతన గారు జీవన్ముక్తుడైన తరువాత వ్రాశారు గాని భాగవతము రచించిన తరువాత కాదు.
ఎప్పుడైతే శ్రీ మహా విష్ణువు పోతన గారిని భాగవతము వ్రాయమన్నాడో అప్పటికే జీవన్ముక్తుడు. మనలను ఉద్దరించడానికి భాగవతము వ్రాశారు.అందువల్లనే భారతీయ భాషలలో ఏ భాగవతమునకు దక్కని గౌరవం పోతనగారి భాగవతానికి దక్కింది.
మరొక్క మాట
సాధారణంగా సంస్కృత శ్లోకాలు మాత్రమే పారాయణమునకు అర్హము. ఎందువల్లనంటే
సంస్కృత శ్లోకాలలో అంతర్లీనముగా బీజాక్షరాలు ఉంటాయి లలితా సహస్రము, విష్ణు సహస్రము ఉదాహరణముగా తీసుకోవచ్చు. ఇక తెలుగు భాగవతము విషయంలో పారాయణమునకు పూర్తి అర్హత కలిగినది. వివాహము కొరకు రుక్మిణి కల్యాణము, అలాగే వివిధ విషయాలకు గజేంద్ర మోక్షం వంటివి పారాయణమునకు అర్హత కలిగినవే. ఎందువల్లనంటే ఈ తెలుగు భాగవతములో కూడా అంతర్లీనముగా బీజాక్షరాల అర్ధము ఉంది.ఉదాహరణమునకు శ్రీమాత్రేనమః
శ్రీమాత్రేనమః అను నామము ఉచ్చరించాలి అంటే శుచియై ఉండాలి కాని పోతన గారి ఈ పద్యము చదవడానికి భక్తి ఒక్కటే అర్హత.
అమ్మలఁ గన్నయమ్మ, ముగురమ్మలమూలపుటమ్మ, చాలఁ బె
ద్దమ్మ, సురారులమ్మ కడు పాఱడి పుచ్చిన యమ్మ, తన్ను లో
నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ, దుర్గ, మా
యమ్మ, కృపాబ్ధి యిచ్చుత మహత్త్వకవిత్వ పటుత్వ సంపదల్.
భావము: ఇక్కడ దుర్గమ్మయే లలితమ్మ, మహా కామేశ్వరి.మరియు శ్రీమాత
దుర్గాదేవి తల్లు లందరికి తల్లి; సప్తమాతృకలను కన్నతల్లి; ముల్లోకాలకు మూలమైన లక్ష్మి సరస్వతి పార్వతులకు మూలమైన తల్లి; అందరు అమ్మల కన్నా అధికురాలైన గొప్పతల్లి; దైత్యులను నాశనము చేసి వారి తల్లియైన దితి కడుపులో దుఃఖము చేకూర్చిన తల్లి; నమ్ముకున్న దేవతామతల్లుల నిండు మనసులలో నివసించే తల్లి; అయిన మా అమ్మ దయాసముద్రి అయి ఈ మహాభాగవత తెలుగు ప్రణీత మందు కవిత్వంలో మహత్వము, పటుత్వములను సమృద్ధిగా ప్రసాదించు గాక.
ఇదే శ్రీమాత్రేనమః నామానికి అర్ధము ఇంకా అనేక భాష్యార్ధాలు ఉన్నాయి ఇక్కడ అప్రస్తుతము.
బ్రహ్మ సూత్రాలు, భగవద్గీత, ఉపనిషత్తులు అధ్యయనం చేస్తేకాని భాగవతాన్ని చేబట్టే సామర్ధ్యం చేకూరదు .కాని పోతన భాగవతం అలాంటిది కాదు .అడుగడుగునా హరినామ స్తుతి అలరారుతుంది .అవకాశం ఉన్నప్పుడే కాదు ,అవకాశం కల్పించుకొని హరినామ స్తుతి చేస్తాడు భక్తకవి పోతన .
శ్రీకృష్ణా! యదుభూషణా! నరసఖా! శృంగారరత్నాకరా!
లోకద్రోహినరేంద్రవంశదహనా! లోకేశ్వరా! దేవతా
నీకబ్రాహ్మణగోగణార్తిహరణా! నిర్వాణసంధాయకా!
నీకున్ మ్రొక్కెదఁ ద్రుంపవే భవలతల్ నిత్యానుకంపానిధీ!
శ్రీకృష్ణా అంటూ ఎంత చక్కని పద్యం చెప్పాడు స్మరణ భక్తికి ఇంతకంటే ఇంకా ఏ ఉదాహరణ కావాలి మహాభాగవతము అంతా ఇటువంటి పద్యాలే కదా
వ్యాసము పెద్దది అవుతోంది కాబట్టి ముగిస్తున్నాను
స్వస్తి
సమర్పణ
మారేపల్లి ఉదయ భాస్కర శర్మ
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి