*యజ్ఞోపవీత మహిమ*
ఈరోజుల్లో ఎంతోమంది తమ పిల్లలకు సరియైన వయస్సులో ఉపనయన కార్యక్రమం చేయరు. చేసినా వాడిచేత త్రికాల సంధ్యావందనమూ చేయించరు. ఇంకొంతమంది వివాహానికి ఒకరోజు ముందు ఈ ఉపనయన కార్యక్రమాన్ని ఏదో అలా ముగించేస్తారు. వారు అసలు వారికి సంధ్యావందనం అంటేనే ఇంకా ఏమి ఆశక్తి ఉంటుంది. మరికొంతమంది ఉంటారు వారు ఆ యజ్ఞోపవీతాన్ని శరీరంపై ఉంచుకోడానికే సిగ్గు పడుతుంటారు. ఏదో ఎప్పుడో పూజల్లోనో, హోమాల్లోనో యజ్ఞోపవీతాన్ని ధరించి మళ్ళీ ఆ తంతు సంపూర్తి కాగానే ఆ వీతాన్ని విసర్జన చేసేస్తుంటారు.
గాయత్రీమాత సర్వశక్తి సంపన్నురాలు. త్రికాల సంధ్యావందనం నిత్యక్రతువు. అది ఎవరైతే నిష్ఠగా చేస్తుంటారో వారికి వాక్ దేవతసిద్ధిస్తుంది. నిత్యం ఒక అర్ధగంట సంధ్యావందనం చేయరు కానీ, టీ.వి లు చూడ్డం, ఇటీవల వచ్చిన సెల్ ఫోన్లతో సందేశాలు పంపడం, ఇతరత్రా కబుర్లు వీటికి గంటలు కొద్దీ సమయం వృధా చేస్తుంటారు. వాటివల్ల నిష్ఫలం.
ఎంతోమంది అశ్రద్ధ చేసే ఈ ఉపనయం ద్వారా ధరించే మహపవిత్రమైన ఆ యజ్ఞోపవీతము ఎంత మహిమాన్విత మైనదో మనకు పురాణాలు, శాస్త్రాలు చెప్పాయి.
ఈ సందర్భంగా ఒకటి మీకు చెప్తాను...
ఒకరోజు కవిత్వం అంటే ఆసక్తి లేని ఒక రాజు వద్దకు నిరుపేద బ్రాహ్మణుడు వచ్చి తాను రచించిన ఒక కృతిని ఆయన ముందుంచుతాడు.
"అయ్యా మహారాజా నాకు పూటగడవటమే కష్టంగా ఉన్నది. నా ఈ గ్రంధానికి తగిన బరువును చూసి మీకు తోచినంత ధనాన్ని ప్రసాదించండి. తద్ద్వారా నాకు కొన్ని రోజులు భుక్తి లభిస్తుంది" అన్నాడు.
కవిత్వమన్నా, బ్రాహ్మణులన్నా చులకన భావం కల ఆ రాజు, అవహేళనగా "నీకిప్పుడు ఈ పుస్తకమెత్తో, నీయెత్తోధన మివ్వాలా" అంటాడు.
దానికి ఆ వృద్ధ బ్రాహ్మణుడు "అంత అవసరం లేదు మహారాజా, ఈ ఉదయం నేను యజ్ఞోపవీతం మార్చుకున్నాను, నావద్ద తీసివేసిన 'జీర్ణయజ్ఞోపవీతం' ఉన్నది దానెత్తు ఇచ్చిన చాలునంటాడు.."
అప్పుడా మహారాజు
"వీడో పిచ్చాడు. వీడు ధరించిన ఆ కాసిని ధారపు పొగులకు ధనమివ్వాలా ?!
అయినా వాటికి ఎమోస్తుంది?
సరే, వాని కోరిక అదే కదా" అనుకుని, ఆ రాజు, కోశాధికారితో "వీనికో రెండు కాసులిచ్చి పంపండి" అని అజ్ఞాపిస్తాడు.
దానికా బ్రాహ్మణుడు, తనకు ఆ యజ్ఞోపవీతమెత్తే కావాలని పట్టబడతాడు.
దానికా రాజు 'సరదాగా ఆ వేడుక చూద్దామనుకుని, త్రాసు తెప్పించి తూచి ఇమ్మని ఆజ్ఞాపిస్తాడు'.
కానీ, వింత ! ఎంత ధనం వేసినా, ఆ రాజ్యంలో సమస్త సంపదలు కూడా దానికి సరితూగలేదు.
దానికి కారణం, ఆ బ్రాహ్మణుని గాయత్రి మంత్ర అనుష్ఠానబలం.
దానితో ఆ రాజుకు కనువిప్పు కలిగి, ఆ బ్రాహ్మణుని శక్తి తెలియవచ్చి, పాదాక్రాంతుడవుతాడు.
అదీ గాయత్రీ మంత్రం శక్తి.
యజ్ఞోపవీతము యొక్కమహిమ. అటువంటి నిత్యానుష్టానం అశ్రద్ధ చేస్తూ తమకు తామే శక్తిని చేచేతులారా క్షీణింప చేసుకుంటున్నారు.
*శృంగేరీ జగద్గురు శ్రీశ్రీభారతీ తీర్థ మహాస్వామి వారు*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి