22, నవంబర్ 2025, శనివారం

శుక్రవారం 21 నవంబర్ 2025🌹*

 🔯🌹🌷🏹🛕🏹🌷🌹🔯

*🌹శుక్రవారం 21 నవంబర్ 2025🌹*


             *ప్రతిరోజూ*

*సంపూర్ణ మహాభారతము*

  సరళ వ్యావహారిక భాషలో!

                           5️⃣1️⃣``

*ప్రతిరోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి!*

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*``


      *సంపూర్ణ మహాభారతము*

       

              *51 వ రోజు* ``

           *సభా పర్వము*

        *ప్రథమాశ్వాసము*  

            *ప్రారంభము*


అర్జునుని చూసిన దానవ శిల్పి  మయుడు “అర్జునా! నీ దయ వలన నేను అగ్నికి ఆహుతి కాకుండా బ్రతికాను. నేను దానవ శిల్పిని. చిత్ర విచిత్రమైన నిర్మాణాలు చేయగలను. మీకు ఇష్టమైనది ఏదో చెప్పండి చేస్తాను” అన్నాడు. 


అర్జునుడు కృష్ణుని వంక చూసాడు. 


శ్రీకృష్ణుడు “కురువంశ మహారాజు  ధర్మరాజు వైభవానికి తగినట్లు ఒక భవనం నిర్మించి ఇవ్వు!” అని మయునితో అన్నాడు. 


మయుడు “ఈ భూమిపై ధర్మరాజుని మించిన రాజు లేడు. అందుకని ప్రజలు మెచ్చేలా చిత్ర విచిత్రమైన భనాన్ని నిర్మించి ఇస్తాను. వృషపర్వుడనే రాక్షస రాజుకు ఒక సభ నిర్మించడానికి ఉపకరణాలు సమకూర్చుకున్నాను. కారంణాంతాల వలన నిర్మించలేక పోయాను. ఉపకరణాలను బిందుసరము అనే సరోవరంలో దాచాను. వాటిని తెచ్చి భవన నిర్మాణం చేస్తాను- నా వద్ద భౌమాదిత్యుడు దాచిన గద, శంఖము ఉన్నాయి. గదను భీమసేనునికి దేవదత్తము అనే శంఖమును అర్జునినికి ఇస్తాను” అన్నాడు.```


       *మయసభా వైభవం*```


మయుడు బిందుసరోవరములో ఉన్న దూలాలూ, కంభములను ఉపయోగించి చిత్ర విచిత్రమైన భవనాన్ని నిర్మించాడు. నీటికి బదులు ఇంద్రనీల మణులను, పద్మరాగ మణులతో ఎర్రని పద్మాలను, రజితముతో తెల్లటి తామరలను, రాజహంసలను, వజ్రాలతో చేపలను, ముత్యములతో తెల్లటి నురగలను, మరకత మణులతో నీటిలోని నాచుని తయారు చేసాడు. అవి నిజమని భ్రమించేలా నిర్మించాడు. నీటి యంత్రాలు, చెట్లు, నీటి పక్షులు, పక్షిగూళ్ళు మొదలైనవి వివిధ రత్న కాంతులతో శోభిల్లే భవనం పదునాలుగు మాసాలు శ్రమించి నిర్మించాడు. దానిని ఎనిమిది వేల మంది బలిష్టులతో ఆకాశమార్గాన మోసుకు వచ్చి ధర్మరాజుకు  బహూకరించాడు. ధర్మరాజు ఒక శుభ ముహూర్తాన పురోహితుడైన ధౌమ్యుని ఆశీర్వాదంతో భార్యతో తమ్ములతో మయసభా ప్రవేశం చేసాడు. సామంతరాజులు ధర్మరాజుని దర్శించి కానుకలు సమర్పించారు.```


       *నారదమహర్షి రాక*```


ఒకరోజు ధర్మరాజు వద్దకు నారదమహర్షి వచ్చాడు. ధర్మరాజు నారదమహర్షికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి సత్కరించాడు. నారదమహర్షి ధర్మరాజును రాజనీతి సంబంధమైన విషయాలు అడిగాడు. 

ధర్మరాజా నీవు ధర్మ మార్గము అనుసరిస్తున్నావు కదా,

రాజకార్యాలను ధర్మనిష్టతో, స్వబుద్ధితో అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఆలోచిస్తున్నావు కదా!

రాజోద్యోగాలలో యోగ్యులను, స్థిరచిత్తులను నియమించావు కదా! సమర్ధులైన బ్రాహ్మణులను, శాస్త్ర నియమాలు తెలిసిన వారిని మంత్రులుగా నియమించావు కదా! 

నీ విజయానికి కారణమైన రహస్యాలోచనం ఎవరికీ తెలియకుండా రక్షిస్తున్నావు కదా! 

నీ చేత యజ్ఞములు చేయించిన యాజ్ఞికుడు యజ్ఞాలు సక్రమంగా నిర్వహిస్తున్నాడు కదా!

ఎల్ల వేళలా నీ మేలు కోరేవారిని విశ్వాసపాత్రులను సైన్యాద్యక్షులుగా నియమించావు కదా! 

పలుకుబడి కలిగిన మంత్రి నీకు వ్యతిరేక కార్యాలలో దిగి నీకు ద్రోహం తలపెట్ట లేదు కదా? 

ఎందు కంటే ధనము అధికారం ఎలాంటి వారికైనా గర్వం, దురాశను కలిగిస్తుంది. నీ రాజ్యంలోని శాస్త్రజ్ఞులు రాబోయే ఉత్పాతాలను కనిపెట్టి శాంతి క్రియలు చేపడుతున్నారు కదా! 

ఆయుర్వేద వైద్యులు ప్రజలకు ప్రేమతో సేవ చేస్తున్నారు కదా! 

ఆర్థిక సంబంధిత కార్యాలలో నైపుణ్యం కలవారిని, పాపరహిత చరిత్రులను, నీతి నియమాలు కలవారిని, ధర్మ పరీక్షలో నెగ్గిన వారిని నియమించావు కదా!

యోగ్యతను దృష్టిలో ఉంచుకుని ఉత్తమ, మధ్యమ అధమ ఉద్యోగాలలో నియమించావు కదా!

నీ ఉద్యోగులకు సకాలంలో జీతభత్యాలు అందచేస్తున్నావు కదా! 

లేకుంటే రాజుకు అది కీడు కలిగించ వచ్చు. వంశపారంపర్యంగా నీకు సేవ చేస్తూ ప్రాణాలు అర్పించటానికి సిద్ధంగా ఉన్న ఉద్యోగులను గుర్తించి సత్కారాలు చేస్తున్నావు కదా!

నీ రాజ్యంలో నీ కోసం ప్రాణాలు అర్పించిన వారి కుటుంబాలకు తిండి, బట్ట, నీడ కల్పిస్తున్నావు కదా! 

లోభబుద్ధి కలవాళ్ళను, దొంగలను, శత్రువులతో స్నేహంగా ఉండేవాళ్ళను, పిరికి వాళ్ళను, దుర్మార్గులను రాజకార్యాలను నిర్వహించడానికి పంపడం లేదు కదా!

నీ రాజ్యంలో అనావృష్టి లేదు కదా ! 

చెరువులన్నీ నిండి ఉన్నాయి కదా !

పేద రైతులకు ఉచితంగా విత్తనాలు, తదితరాలు ఇస్తున్నావు కదా!

పౌరులకు నూటికి ఒకటి చొప్పున వడ్డీకి ఋణసౌకర్యం కల్పిస్తున్నావు కదా! 

నీ రాజ్యం లోని కుంటి గుడ్డి, వికలాంగులు, అనాథలు, దిక్కులేని వారిని దయతో పోషిస్తున్నావు కదా!

యుద్ధంలో శరణన్న వారిని కాపాడుతున్నావు కదా! నీకు మేలు చేసిన వారిని ఉచితరీతిన సత్కరిస్తున్నావు కదా!

నీకు వచ్చిన ఆదాయంలో నాల్గవ లేక రెండవ లేక మూడవ భాగాన్ని మాత్రమే ఖర్చు చేస్తున్నావు కదా ! ```


             *(సశేషం)*

*సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*

             🌷🙏🌷```

*🚩జై శ్రీ కృష్ణ! జై శ్రీ కృష్ణ!🚩* 


ఆధ్యాత్మిక బృందం నుండి వచ్చింది                     

                *సేకరించి*

*భాగస్వామ్యం చేయడమైనది*


 *న్యాయపతి నరసింహారావు*

🙏🌷🏹🪔🛕🪔🏹🌷🙏

కామెంట్‌లు లేవు: