✤ యాత్రా కాలే విశేషేణ యస్య కస్యాపి దేహినః |
న దేయాన్ ఏవ దుఃఖాని విచార్య విధిమాదరాత్ ॥
కాశీక్షేత్రంలో మన వల్ల ఎవరికీ దుఃఖం కలగకూడదు. ఎవరిపట్లా పరుషవాక్యాలు అనరాదు.
✤ 'మౌనమేవ సదా కార్యం' – ఏదో అత్యవసరమైనపుడు ముఖ్యమైనవి మాట్లాడినప్పటికీ కూడా లోకవ్యవహారంలో ఉండరాదు. మౌనమే ప్రధానంగా పెట్టుకోవాలి.
✤ 'కర్తవ్యం శివచింతనం' - శివచింతన నిరంతరం జరుగుతూ ఉండాలి.
✤ 'మార్గే విలోక్య కీటాదీన్' - నడిచేటప్పుడు కూడా కాలు కీటకం మీద పడకుండా జాగ్రత్తగా నడవాలి. కీటకం మీద కూడా కాలు వేసి తొక్కకూడదు.
'నో చేత్ యాత్రాఫలం న్యూనం భవిష్యతి' - ఒకవేళ తెలిసి కానీ, తెలియక గానీ కాలి క్రింద ఏమైనా మరణించినట్లైతే యాత్రాఫలం తగ్గుతుంది సుమా!
✤ ‘అనృతం నైవ వక్తవ్యం' - ఎట్టి పరిస్థితులలో అసత్యమనేది పలుకరాదు. 'కదాచిదపి సర్వథా' - ఎట్టి పరిస్థితిలో, పరిహాసానికి కూడా అబద్ధం పలకరాదు.
✤ 'నిందాన్యస్య న కర్తవ్యా న శ్రోతవ్యా సర్వథా' - ఇతరులను ఎట్టి పరిస్థితులలో నిందించరాదు. మనం నిందించకూడదు, ఎవరైనా నిందిస్తుంటే వినకూడదు.
✤ 'బ్రహ్మచర్యవ్రతం చరేత్' - ఎట్టి పరిస్థితులలో కూడా బ్రహ్మచర్యవ్రతం తప్పరాదు.
✤ 'ఋతుకాలేపి సంప్రాప్తే స్వస్త్రియా సహ సర్వథా' - తన భార్యతో కూడా అక్కడ కాముక దృష్టి కూడదు.
✤ ‘నైకత్ర శయనం కార్యం' - ఒక చోట నిద్రించరాదు.
✤ ‘ప్రతిగ్రహో న కర్తవ్యో యాత్రాకాలేషు సర్వథా' - ప్రతిగ్రహణం అంటే ఎక్కడా స్వీకరించడం కూడదు. ఈ మాట మళ్ళీ చెప్పుకోవాలి. ఇంకొకరి దగ్గర ధనాదులు స్వీకరించరాదు.
✤ అలాగే భక్తులుకానివారితో, నీచులతో, నాస్తికులతో మాట్లాడరాదు. ఇది పెద్ద నియమంగా పెట్టుకోవాలి. ఎందుకంటే దృష్టి చెదరగొట్టాలంటే వారు చాలు.
✤ కాలత్రయేపి కర్తవ్యం శివలింగస్య పూజనమ్ | తతః శివకథా శ్రావ్యాః శ్రోతవ్యాః పాపనాశికాః ||
- వీలైతే మూడుపూటలు శివపూజ చేసుకోవాలి. మధ్యాహ్నావేళలలో వీలైనంతవరకు శివభక్తులకు భోజనం పెట్టడం చాలా శ్రేష్ఠం. కాశీలో వీలైనంతవరకు శ్రోత్రియులైన శివభక్తులకు పద్ధతిగా, శుచిగా భోజనం పెట్టడం ఎప్పుడూ మంచిదే. ఎందుకంటే అక్కడ మనకు తెలిసో, తెలియకో ఏవైనా దోషములు జరిగినా వాటిని శాంతింపజేసే శక్తి దానికి ఉన్నది.
✤ కాశీలో కొంతసేపు జపం, కొంతసేపు పూజ, కొంతసేపు యాత్ర చేసుకోవాలి. యాత్ర చాలా విశేషంగా చెప్పారు. కాశీలో కూర్చోవడానికి కాదు, యాత్ర చెయ్యాలి. విరామసమయంలో ముఖ్యంగా చెయ్యవలసింది - శివకథలను వినడం, చదువుకోవడం, చెప్పుకోవడం చెయ్యాలి. 'శ్రావ్యాః, శ్రోతవ్యాః' - వినాలి, వినిపించాలని రెండు మాటలు చెప్పారు. 'ఆసాయం' సాయంకాలం వరకు ఇదే చెయ్యాలి. తరువాత సాయంకాల సంధ్యాదులు చేసుకోవాలి. ఎవరైతే ఉపనయనాది సంస్కారం పొందినవారు కాశీలో ఉంటారో వారు సంధ్యావందనం చెయ్యకపోతే ఆ యాత్ర పూర్ణనిష్ఫలం అవుతుంది.
సంధ్యావందనం మూడు పూటలా చెయ్యనివారికి యాత్రలు నిష్ఫలం అవుతాయి. ఉపనయన సంస్కారంలో 'అహరహస్సంధ్యాముపాసీత' - అని ఒట్టు పెడతారు. ఆ ఒట్టు తప్పిపోతే వేదముల శాపం తగులుతుంది. అందుకే ఉపవీతుడు ముప్పూటలా సంధ్యావందనం చెయ్యవలసిందే. ఉపనయనాది సంస్కారములు లేనివారు శివనామములు, గురువు వద్ద పొందిన శివమంత్రాలు చేసుకుంటే వారు తరించిపోతారు, సందేహం లేదు.
ఇలా చేస్తూ ఈ నియమాలతో కాశీలో కానీ సంచరిస్తే అడుగడుగునా అశ్వమేధఫలం, మరెన్నో యజ్ఞఫలాలు లభిస్తూ ఉంటాయి. అంత విశేషమైనది.
సేకరణం - పూజ్య గురుదేవులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ప్రవచించిన శివరహస్యం ప్రవచనం నుండి
శివరహస్యం ప్రతుల కొరకు
వెంకట రమణ - 92464 88975
భారత ఋషిపీఠం
ఫ్లాట్ నం. 37-93/138/2,
మధురా నగర్, నేరేడ్ మెట్,
హైదరాబాద్ - 500056
తెలంగాణా
ఫోన్ నం. 040 79658274
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి