22, నవంబర్ 2025, శనివారం

చమత్కారం

 చమత్కారం అంటే ఏమిటి?


ఓ విషయం చెబితే " ఇదేమిటి, అదెలా, అలా ఎలా " అని ఉత్సుకత కలిగించాలి. దీనిలో ఏదైనా మతలబు ఉందా అనిపించాలి. అసలు విషయం ఏమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగించాలి. విషయం అలా చెప్పడం చమత్కారం అంటారు.



 ఓ గ్రామం లో సర్వమంగళశాస్త్రి గారని ఓ వేదపండితుడు ఉండేవారు. వారి మనుమడికి ఉపనయనం చేస్తూ ఆహ్వానపత్రికలో 


" మా మనుమడి ఉపనయనానికి మీరందరూ విచ్చేసి వటువుని ఆశీర్వదించి భోజనం చేసి వెళ్ళవలెను.


 భోజనాల తరువాత నా ఉపనయన కార్యక్రమాన్ని కూడా వీక్షించి వెళ్ళవలసినదిగా కోరుకుంటున్నాను " 


అని వ్రాసారు; అందరికీ ఆశ్చర్యం వేసింది --

 మనుమడికి

వడుగు వరకు సరే, 

ఈయనకు మళ్ళీ  

వడుగు ఏమిటీ అని.


సరే ఈ విషయం తెలుసుకోవాలనే ఆసక్తితో మొత్తం బంధువులందరూ వచ్చేసారు. భోజనాలయాయి. శాస్త్రిగారు కుర్చీలో కూర్చున్నారు, బంధువులు, అతిధులు ఎదర చాపలమీద ఆశీనులయారు.


శాస్త్రిగారి భార్య ఓ చిన్న అందమైన పెట్టె తెచ్చి శాస్త్రిగారికి ఇచ్చారు. ఆయన ఆ పెట్టె మెల్లిగా తెరచి అందులోనుంచి ఓ కళ్ళజోడు తీసారు.


అందరికీ చూపెట్టి " నాకు చత్వారం వచ్చింది. ఈ మధ్యనే, డాక్టర్ గారు ఈ కళ్ళజోడు పెట్టుకోమన్నారు. ఈరోజు ముహూర్తం బాగుందని పెట్టుకుంటున్నాను. మీరందరూ నా ఈ ఉప_నయనం ( నయనం అంటే కన్ను, ఉప అంటే దగ్గరగా ఉండేది ) కార్యక్రమం కూడా చూసి వెడుతూన్నందుకు ధన్యవాదాలు " అని అది పెట్టుకున్నారు.


లేచామా, తిన్నామా, టీవీ ఫోన్ చూసినామా, పడుకున్నామా అనికాకుండా ప్రతీ పనిలోనూ హాస్యాన్ని ఆస్వాదించాలి.

🙏😀శుభమస్తు

కామెంట్‌లు లేవు: