30, జూన్ 2020, మంగళవారం

తొలి ఏకాదశి.


ఆషాఢశుద్ధ ఏకాదశి ‘తొలిఏకాదశి’గా ‘శయనఏకాదశి’గా ప్రసిద్ధి. చాలా విష్ణ్వాలయాలలో ‘విష్ణుశయనోత్సవం’ జరుపుతారు. అందంగా అలంకరింపబడిన తల్పమునందు శేషశాయి అయిన నారాయణుని లక్ష్మీసమేతంగా పూజించాలి. ఈ రోజున ఉపవాసాదులు చేయడం శ్రేష్ఠం. ఈ ఏకాదశీ వ్రతం చేయడం వలన దేహశుద్ధి, కార్యసిద్ధులతోపాటు అంత్యమున వైకుంఠప్రాప్తి కూడా కలుగుతుందని పురాణవచనం. ఈ ఏకాదశినాడే మహాపతివ్రత అయిన సతీ సక్కుబాయి మోక్షం పొందినది. ఈ ఏకాదశి నుండి కార్తిక శుద్ధ ఏకాదశి వరకు విష్ణువు యోగనిద్రలో ఉండి తన భక్తులను గమనిస్తూ ఉంటాడు కావున ఈ నాలుగు మాసములు ధర్మాచరణ కలిగి విష్ణు ప్రీతికై వ్రతాదులను చేయడం నారాయణ అనుగ్రహాన్ని కలిగిస్తుంది. ఈ నాలుగు మాసములలో వచ్చు ఏకాదశులకు ఇది మొదటిది కనుక దీనికి ‘తొలిఏకాదశి’ అని పేరు. 


త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం!
విబుద్ధే త్వయి బుధ్యేత తత్సర్వం స చరాచరమ్!!

ఈ ఏకాదశీ వ్రతం మూడు రోజులు చేయాలి. అంటే రోజూ శేషశాయిని అర్చించడం, ఏకాదశినాడు ఉపవసం, ద్వాదశి పారణ, త్రయోదశినాడు గీత నృత్యాదులతో అర్చన చేయాలి.

ఈరోజు నుండి చాతుర్మాస్య వ్రతారంభం . ఈ వ్రతం చేయాలనుకునేవారు ఈరోజు నుండి కార్తికశుద్ధ ఏకాదశి వరకుగల నాలుగు నెలలపాటు బెల్లం, తైలం విడిచిపెడతామని సంకల్పించుకోవాలి. భగవంతునికి నివేదన చేయని ఆహారం, కాల్చివండినవి, మాంసాహారం, పుచ్చకాయ, గుమ్మడికాయ, చెరకు, కొత్త ఉసిరిక, చింతపండు, మంచంపైన పడుకోవడం, పరాన్నం, తేనె, పొట్లకాయ, ఉలవలు, తెల్ల ఆవాలు, మినుములు, ఈ నాలుగు నెలలు వాడకుండా నియమంగా భగవత్పూజ చేయాలి.

కామెంట్‌లు లేవు: