30, జూన్ 2020, మంగళవారం

ఏకాదశి : ఉపవాసం ఫలితం

ఏకాదశి : ఉపవాసం ఫలితం.. ఎవరు ఆచరించాలి ?
ఏకాదశి ఉపవాసాన్ని చాలామంది ఆచరిస్తుంటారు. కర్మసిద్ధాంతాన్ని ఆచరించే శైవులు, వైష్ణవులు బేధం లేకుండా ఆచరించే వ్రతాలల్లో ఏకాదశి వ్రతం ఒకటి. ప్రతి నెల వచ్చే రెండు ఏకాదశలను వ్రతంలాగా ఆచరిస్తే మోక్షం తప్పనిసరిగా లభిస్తుందని పురాణాలు పేర్కొన్నాయి. అంతేకాదు ఈ వ్రతం ఆచరించిన వారికి సకల పాపాల నుంచి విముక్తి, ఆయురారోగ్యాలు లభిస్తాయి. అయితే ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత ద్వాదశి నాడు ఉదయాన్నే భోజనం చేయాలి.

ద్వాదశ పారణం అంటే ఏంది?
ఏకాదశి వ్రతం ఆచరించి అంటే ఉపవాసం ఉన్నవారు తర్వాతి రోజు అంటే ద్వాదశి తిథినాడు భోజనం చేసే విధానాన్ని పారణం అంటారు. ద్వాదశినాడు ద్వాదశి ఘడియలు వెళ్ళాకముందే పారణం (భోజనం) చేయాలి. దేవతలకు ఆరునెలలు పగలు, ఆరునెలలు రాత్రి. దక్షిణాయానం రాత్రికాలం. ఈ చీకటి తొలగి దేవతలు వెలుగులోకి వస్తారు. అంటే వారికి పగలు ప్రారంభమైనట్టు. అందుకే ఆ రోజు ఉపవాసం పుణ్యప్రదం. బ్రహ్మ స్వేదబిందువు నుండి రాక్షసుడు జన్మించాడని, బ్రహ్మ ఆజ్ఞతో ముక్కోటి ఏకాదశీ నుండి అన్నంలో నివసిస్తాడని పురాణ కథనం. అందుకే ప్రతి ఏకాదశినాడు భోజనం మాని ఉపవాసం ఉండాలంటారు. ఏడాదిలో 24 ఏకాదశుల్లో ఉపవాసం ఉంటే వచ్చే మొత్తం ఫలితం ముక్కోటి ఏకాదశి ఆ రోజు అవకాశం లేనివారు తొలి ఏకాదశినాడు ఉంటే లభిస్తుంది.




ఏకాదశి వ్రతాన్ని ఎవరు ఆచరించాలి?
ఈ ఏకాదశి వ్రతాన్ని గృహస్థులందరూ ఆచరించవచ్చు. ఏకాదశి దీక్ష ముఖ్యముగా ఉపవాస ప్రధానం. గరుడ పురాణములో
ఊపోష్య ఏకాదశ్యాం నిత్యం పక్షయోరుభయోరపి !
కృత్వాదానం యథాశక్తి కుర్యాశ్చ హరిపూజనమ్ !!
అని చెప్పబడినది. అనగా ఉపవాసం, దానం, హరి పూజ అనేవి ఏకాదశి వ్రతములో ముఖ్యమైన విశేషాలు. ఏకాదశి నాడు ఉపవాసమున్నవారు ద్వాదశినాడు విష్ణుపూజ చేసి ఆ విష్ణువుకి నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే అది దొంగతనంతో సమానమని శాస్ర్తాలు పేర్కొన్నాయి.

ఉపవాసం ఎవరు ఉండ కూడదు?
ఎనిమిదేండ్లలోపు పిల్లలు, 80 ఏండ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్నవారు, షుగర్, బీపీ వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సినవారు ఉపవాసాన్ని ఆచరించకున్నా దోషం లేదు అని పురాణాలు పేర్కొన్నాయి. ఇక గృహస్తులు, సన్యాస ఆశ్రమంలో ఉన్నవారు తప్పక ఈ దీక్షను ఆచరించాలి.

ఏకాదశినాడు ఏం తినవచ్చు?
ఏకాదశినాడు పూర్తిగా ఉపవాసం ఉండలేనివాళ్ళు పండ్లు, సగ్గుబియ్యం, పాలు, పెరుగు, మజ్జిగ తీసుకోవచ్చు. ధాన్యాలు కాని, పప్పుదినుసులు కానీ స్వీకరించరాదని పురాణాలు చెప్తున్నాయి.

కామెంట్‌లు లేవు: