10, సెప్టెంబర్ 2020, గురువారం

రామాయణమ్. 57


..
భర్తయొక్క ఈ రూపం వింతగా ఉన్నది సీతకు .
తనకు మొదట తెలిసిన రాముడు వీరమూర్తి,
తరువాత శృంగారమూర్తి,
ఇంట్లో శాంతమూర్తి! .
వీరశృంగారము,శాంతవీరము కలబోసిన దివ్యచైతన్యదీప్తి ! నేడేమిటి ? దీనమూర్తి అయినాడు? .
.
ఆవిడ మనస్సులో సందేహం పొడసూపింది ,
రాఘవా! ఏరి వందిమాగధులు? ఏది భద్రగజము! ఏవి సకల రాజలాంఛనాలు ? ఏల నీవు పాదచారివై సంచరిస్తున్నావు ?
.
 ఇన్ని ప్రశ్నలను ఆవిడ చూపులు సంధించాయి !. ..ఉండబట్టలేక అడిగేసింది సీత! ఏమి కారణము రామభద్రా! నీ విచారమునకు !
.
ఆయన దుఃఖము చెలియలికట్ట దాటిన సంద్రమే అయినది ! మెల్లగా తనను తాను సమాధానపరచుకొని ,సీతా ! తండ్రిగారు నన్ను అరణ్యమునకు పంపివేయుచున్నాడు ,అని పలికాడు.
.
మా తండ్రి పూర్వము తనకిచ్చిన రెండువరములను మా తల్లి కైక నేడు కోరుకున్నది ,దాని ప్రకారము నేను పదునాలుగేండ్లు వనవాసము చేయవలే ,నా బదులుగా భరతునకు పట్టముగట్టవలే!
.
అందుచేత అరణ్య వాసమునకు బయలుదేరిన నేను నిన్ను చూసి ,నీకు చెప్పి వెడదామని వచ్చాను! ....అని అన్నాడు రాముడు.
.
సీతా నీవు ధైర్యముగా ఉండు,నీవు దైవధ్యానంలో ఉండి ఈ పదునాలుగేండ్లు వ్రతములు ,ఉపవాసములతో కాలము గడుపు!
.
నా తల్లులను ,తండ్రిని ఇప్పటివలెనే ఆదరించాలి సుమా!
.
భరత,శత్రుఘ్నులను సోదరులవలే ,పుత్రులవలే చూసుకోవాలినీవు .(ఈ మాట అంటున్నప్పుడు లక్ష్మణుడి ప్రసక్తిరాలేదు గమనించండి).
.
విశేషించి భరతుడు రాజ్యమునకు సర్వాధికారి ,అతనికి అనిష్టము చేయగూడదు. ( రాజులకు ఇష్టము లేని పనులు చేయకూడదు ,నేటి కాలంలో అన్వయము ఏమిటంటే BOSS IS ALWAYS RIGHT FOLLOW THE BOSS).
.
రాముడి మాటలు వింటున్న సీతమ్మ మనస్సులో .....
ఓ నా పిచ్చి రాఘవా! అనుకుంది ,
.
ప్రేమ పెల్లుబికి వచ్చింది ! అదే ప్రేమతో కూడిన కోపంతో, ఈ మాటలు అనడానికి సిగ్గు అనిపించడంలేదా? వినడానికి నాకే సిగ్గుగా ఉన్నది.
.
ఎవరి పుణ్యపాపములను వారే అనుభవిస్తారు!
ఒక్క భార్యమాత్రమే భర్తయొక్క భాగ్యమును పంచుకొంటుంది ! భార్యాభర్తల భాగ్యమొక్కటే !.
నిన్ను అడవికి వెళ్ళమంటే నన్నూ వెళ్లమన్నట్లే!.
.
నారీణామ్ పతిరేకో గతిఃసదా!.... స్త్రీల కు భర్త ఒక్కడే ఉత్తమ గతి!..
.
నీ ప్రయాణము దుర్గమారణ్యములయితే నీ ముందు నడచి నీ మార్గంలో కంటకములు ఏరివేసి నీవు సుఖంగా నడిచేటట్లు చేస్తాను..
.
ఈ విషయములో నీ మాట నేను మన్నించను.
.
మేడల మీదా,మిద్దెలమీదా నివాసము కన్నా భర్తతో కలసి వుండటంలోనే ఆనందమున్నది!.
.
రామా! నా తల్లిదండ్రలు అనేకమయిన విషయాలలో నేనెలా నడచుకోవాలో నాకు ముందే ఉపదేశించి ఉన్నారు నేడెవ్వరూ చెప్పవలసిన పనిలేదు ..
.
నీవు నాతోడు ఉంటే నాకు వేరే బ్రతుకెందుకయ్యా ! అడవి అయినా అయోధ్యా నగరి అయినా నీతోటే నాజీవితం.
అడవి నాకు నా పుట్టిల్లు లాంటిది...
.
సకలజీవ సంరక్షకా రామా ! అడవిలో నన్ను నీవు రక్షించుకోలేవా?
.

జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....

*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక

కామెంట్‌లు లేవు: