10, సెప్టెంబర్ 2020, గురువారం

**శివానందలహరి

**దశిక రాము**

**శివానందలహరి**

5 వ శ్లోకం

" జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ"
అవతారిక:
ఓరీ పిచ్చి వాడా! అల్పమైన ఫలితములను ఇచ్చే దేవతలతో నీకు
ఏమిపని ? వీళ్ళు ఎప్పుడో ఫలితములు ఇస్తారట. వాళ్ళిచ్చే ఫలితం
కూడా, మన కళ్ళకు కనపడదు. ఇంతకన్నా ఒక రాజును ఆశ్రయింౘవౘ్చును
కదా ! రాజులైతే ప్రత్యక్షంగా నే ఫలితములు ఇస్తారు. దేవతలను ఆశ్రయింౘడం
కంటే, రాజులను ఆశ్రయింౘడం మేలు అనే అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని
శంకరులు ఈ శ్లోకం వ్రాశారు. రాజులను కొలిచి వారిని మెప్పించగల నేర్పు
తనవద్ద లేదనీ ఈశ్వరుడేతన్ను కాపాడాలనీ, శంకరులు ఈ శ్లోకం లో
ప్రార్థించారు.

శ్లో:

**స్మృతౌ శాస్త్రే వైద్యే**

**శకున కవితా గాన ఫణితౌ**

**పురాణే మంత్రేవా**_

**స్తుతినటన హాస్యేష్వచతురః**

**కథంరాజ్నాం ప్రీతిర్భవతి మయి కో‌ హోం పశుపతే**

**పశుంమాం సర్వజ్ఞ!**

**ప్రథిత కృపయా పాలయ విభో !!**

పదవిభాగం:
స్మృతౌ , శాస్త్రే, వైద్యే _ శకునకవితాగానఫణితౌ _ పురాణే _ మంత్రే _
వా _ స్తుతి నటన హస్యేషు _ అచతురః _ కొంచెం _ రాజ్నాం _ ప్రీతిః _
భవతి _ మయి _ కః _ అహం _ పశుపతే _ పశుమ్ _ మామ్ _ సర్వజ్ఞ _
ప్రథితకృపయా _ పాలయ _ విభో.
తాత్పర్యం:
సర్వజ్ఞుడైన ఓ ఈశ్వరా! మనుస్మృతి వంటి స్మృతుల యందు గానీ,
తర్కవ్యాకరణములవంటి శాస్త్ర ములయందుగానీ, వైద్యము నందుగానీ,
శకునములు చెప్పుట యందుగానీ, కవిత్వమును అల్లుటయందుగానీ,
సంగీతమును పాడుటయందుగానీ,సభల్లో వాగ్వాదము చేసే వాచా
విష్కరణము నందుగానీ, పురాణకాలక్షేపము చేయుటయందు గానీ,
మంత్ర ప్రయోగమునందుగానీ, ఇతరులను స్తుతి చేయుటయందు గానీ,
నాట్యమునందుగానీ,హాస్య ప్రసంగము నందుగానీ నాకు నేర్పు లేదు.
అటువంటి నాయందు రాజులకు ప్రేమ ఎలా ఏర్పడుతుంది. వారిని
సంతోష పెట్టేందుకు అసలు నేను ఎవరిని ? నేను ఎంతటివాడను?
శ్రుతి, స్మృతి పురాణేతిహాసము లందు ప్రసిద్ధుడవైన ఓ ప్రభూ!
నేను పశువును, నీవు పశుపతివి. కాబట్టి నన్ను దయతో కాపాడు.
వివరణ:
శంకరులు కరుణాస్వరూపులు మనవంటి అల్పజ్నులకు భగవంతుని
ముందు నిలబడి ఎలా ప్రార్థన చేసికోవాలో కూడా తెలియదని , గుర్తించి
వారు ఈ స్తోత్రమును మనకందించారు. కాబట్టి " పశువు" నని మనం
భగవంతుని ముందు చెప్పుకోవాలని మనకు చెప్పడంకోసమే, వారు ఇలా
వ్రాశారని మనం గర్తింౘాలి.
అదీగాక రాజులు కొంచం గొప్పవాళ్ళైనప్పటికీ వాళ్ళు కూడా పశువులే కదా!
ఒకవైపు పాశాలను త్రెంౘుకోవాలని మనం అనుకుంటూ,మనకంటే పెద్ద
పశువులైన రాజులను మనం ఆశ్రయింౘడం అంటే పాశాలను మరింతగా
బంధింౘుకోవడమే కదా! కనుక, తనకు ఆ రాజులు ఇచ్చే ధనకనకాదులపై
ఆసక్తి లేదని శంకరులు చెప్పారు.
ధూర్జటి మహాకవి కూడా తన " కాళహస్తీశ్వర శతకము" లో ఇలానే
చెప్పారు. ౘూడండి___
" రాజుల్మత్తులు, వారిసేవ నరకప్రాయంబు,వారిచ్చు నం
భోజాక్షీ చతురంతయాన తురగీభూషాదు లాత్మవ్యధా
బీజంబుల్, తదపేక్ష ౘాలుఁ, బరితృప్తింబొందితిన్,జ్నానల
క్ష్మీ జాగృత్పరిణామమిమ్ము దయతో శ్రీ కాళహస్తీశ్వరా !"
ఏ విద్యలలోనూ,నేర్పులేని తనను, రాజులు ఆదరింపరని, అన్నీతెలిసిన
ప్రభువైన ఈశ్వరుడే తనను రక్షింౘాలని, రక్షింౘమని, శంకరులు ఈశ్వరుణ్ణి
కోరారు.
🙏🙏🙏

**ధర్మము - సంస్కృతి**

కామెంట్‌లు లేవు: