7, సెప్టెంబర్ 2020, సోమవారం

వీఆర్వో వ్యవస్థ రద్దు

వీఆర్వో వ్యవస్థ రద్దు!..కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ

ఇతర శాఖల్లోకి వీఆర్వోల విలీనం!
కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ
ల్యాండ్ మేనేజ్ మెంట్​ అండ్ అడ్మినిస్ట్రేషన్ యాక్ట్​గా పేరు!
ఈ అసెంబ్లీ సమావేశాల్లో పెట్టనున్న ప్రభుత్వం

కొత్త రెవెన్యూ యాక్ట్​ రెడీ అయింది. దీనికి  ‘ల్యాండ్  మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్ ’గా పేరు పెట్టినట్లు తెలిసింది. దీని బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. తొలుత చట్టంగా తీసుకురావాలా.. లేక.. రెవెన్యూ కోడ్​గా తీసుకురావాలా అనే అంశంపై కొద్ది రోజులుగా తీవ్ర చర్చ జరిగింది. అయితే చట్టం చేయడానికి అసెంబ్లీ ఆమోదం ఉంటే సరిపోతుంది. కానీ రెవెన్యూ  కోడ్​కు మాత్రం కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రపతి ఆమోదం తప్పనిసరి కావడంతో చట్టానికే ప్రభుత్వం మొగ్గు చూపింది. రెవెన్యూ శాఖలో మార్పుపై కొన్నాళ్లుగా సభల్లో, అసెంబ్లీలో తరుచూ మాట్లాడుతున్న సీఎం కేసీఆర్.. ​ మొదట్లో రెవెన్యూ కోడ్​ ను తీసుకురావాలని భావించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌‌లోనూ అప్పటి సీఎం చంద్రబాబు 1999లో ఇలాంటి ప్రయత్నం చేశారు. అప్పటికే ఉన్న 191 చట్టాలను ఒక చోట చేర్చి ఆంధ్రప్రదేశ్‌‌ భూమి రెవెన్యూ కోడ్‌‌–1999 పేరుతో రూపొందించారు. ఇందులో 17 భాగాలు, 47 అధ్యాయాలు, 260 సెక్షన్లను పొందుపరిచారు. అసెంబ్లీలో ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపగా.. కేంద్ర న్యాయ శాఖ 146 ప్రశ్నలతో తిప్పి పంపింది. దీంతో కోడ్‌‌ ఆచరణ రూపం దాల్చలేదు. ఇప్పుడు కూడా కోడ్​ తీసుకొచ్చినా మళ్లీ అదే పరిస్థితి ఏర్పడడమో లేదంటే ఆలస్యం కావడమో జరిగే అవకాశముందని భావించిన రాష్ట్ర ప్రభుత్వం చట్టం తీసుకొచ్చేందుకు మొగ్గు చూపినట్లు తెలిసింది.  ఇందులో అవినీతికి ఆస్కారం లేకుండా సులభంగా నిమిషాల్లో మ్యుటేషన్ చేయడం, అక్కడికక్కడే పాస్​ బుక్కులు  జారీ చేయడమే ప్రధానాంశాలుగా పెట్టుకున్నట్లు తెలిసింది.

ఫస్లీ– 1317  నుంచి కొత్త చట్టంగా..!
తెలంగాణలో భూచట్టాలకు 113 ఏండ్ల చరిత్ర ఉంది. నిజాం రాష్ట్రంలో 1907లో ‘ఫస్లీ–1317’ చట్టాన్ని తీసుకొచ్చారు. ఈ ఫస్లీ – 1317 చట్టమే ఇప్పటివరకు అమల్లోకి వచ్చిన అన్ని భూచట్టాలకు ఆధారంగా ఉంది. అన్ని చట్టాలు, భాగాలు, చాప్టర్లు, సెక్షన్లు కలిపి ఈ చట్టం ఉండేది. భూ పరిపాలనకు సంబంధించి అప్పటివరకు ఇదే సమగ్ర చట్టం. హైదరాబాద్ స్టేట్, ఆంధ్ర ప్రదేశ్​ విలీనం తర్వాత  భూపరిపాలన, కౌలుదారులు, రైతుల  హక్కులు, భూసేకరణ, పంపిణీకి సంబంధించి ఇలా ఒక్కో అంశంపై ఒక్కో యాక్ట్​ రూపొందించారు. లేదంటే చట్టంలోనే రూల్స్​, కండిషన్స్​ను సబ్‌‌ సెక్షన్లుగా విడగొట్టారు. ఇలా చేస్తూ వచ్చిన చట్టాలు, జీవోలు కలిపితే వాటి  సంఖ్య 124కు చేరింది. వీటన్నింటి స్థానంలో ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త రెవెన్యూ చట్టం తీసుకురాబోతుంది. ఈ చట్టానికి ల్యాండ్ మేనేజ్​మెంట్​ అండ్​ అడ్మినిస్ట్రేషన్​ యాక్ట్​ గా నామకరణం చేసినట్లు తెలిసింది.
రెవెన్యూ శాఖలో వీఆర్వోల వ్యవస్థ రద్దు ఖాయమైపోయింది. భూ రికార్డుల ప్రక్షాళన తర్వాత రికార్డులన్నీ డిజిటలైజ్​ చేయడం, కాస్తు కాలమ్​ తొలగించడంతో భూపరిపాలనలో ఇక వారి అవసరం లేదని ప్రభుత్వం భావించినట్లు తెలిసింది. వీఆర్వోలను ఇతర శాఖల్లో విలీనం చేయనున్నారు. వారందరికీ జూనియర్ అసిస్టెంట్​ క్యాడర్​లో పోస్టింగ్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. వీఆర్వో వ్యవస్థ రద్దుపై సీఎం  కేసీఆర్​ అసెంబ్లీలో రెవెన్యూ యాక్ట్​ ప్రవేశపెట్టే సందర్భంగా స్పష్టమైన ప్రకటన చేసే అవకాశముందని రెవెన్యూ సంఘాల నేత ఒకరు చెప్పారు.

ఒక వాట్సాప్ మెసేజ్ ఆధారంగా

కామెంట్‌లు లేవు: