16, డిసెంబర్ 2020, బుధవారం

తిరుప్పావై మొదటిపాశురము*

 🌹💐🌷🌾🥀🌸🌺


*తిరుప్పావై మొదటిపాశురము*


మార్ గళితిజ్ఞళ్ మదినిరైన్ద నన్నాళాల్ నీరాడ ప్పోదువీర్! పోదుమినో నేరిశైయీర్ శీర్ మల్ గుం ఆయ్ ప్పాడి శెల్వచ్చిఱుమీర్ కాళ్

కూర్ వేల్ కొడున్దొళిలన్ నన్దగోపన్ కుమరన్ ఏరాకణ్ణి యశోదై యిళం శిఙ్గమ్ కార్మేని చెఙ్గజ్ణ్ కదిర్ మది యయ్బోల్ ముగత్తాన్ నారాయణనే నమక్కే పరై తఱువాన్ పారోర్ పుగళప్పడిన్దేలో రెమ్బావాయ్



*మార్గశిర మాసాన మంచి వెన్నెల రోజు నీరాడ కోరువారు రారండి రమణులార శ్రీలు పొంగెడు వ్రేపల్లె పడుచులార! దివ్యాభరణములు దాల్చిన మేల్బంతులార వాడివేలము తోడిగాచు నందగోపసుతుడు సుందర లోచని యశోద కిశోర సింహం సూర్యచంద్రుల మించు శ్యామ సుందరుడు నారాయణుడె మనకె పరనిచ్చువాడుమంగళము కూర్చు మన శ్రీవ్రతము*


                M.s.s.k

🌹🌺🌸🥀🌾🌷💐

*ఇక తిరుప్పావై తొలి పాశురం 'మార్గళిత్తింగల్ మది నిరైన్దనన్నాళాల్' అర్ధము, అంతరార్ధము తెలుసుకుందాం*


 శ్రీ గోదా గోపిక వ్రత సంకల్పం చేస్తూ ఎప్పుడు, ఎవరు, ఎక్కడ, ఏమి చేసి, ఎవరి వలన ఏ ఫలము పొందవచ్చునో మనకు వివరిస్తారు


*1. ఎప్పుడు ఈ వ్రతం చెయ్యాలి*


భగవంతునికి అత్యంత ప్రీతికరమైన మార్గశిర మాసంలో శుక్ల పక్షంలో పెద్దలు నిర్ణయించిన విధంగా ధనుస్సంక్రమణం నాడు ఈ వ్రతారంభం చెయ్యాలి క్రమం తప్పకుండా 30 రోజులు కొనసాగించాలి *


*2. ఎవరు ఈ వ్రతం చెయ్యాలి?*


కోరిక వున్న వారందరూ, జాతి, కుల, వయో, లింగ, వర్గ భేదం లేకుండా. ఈ ప్రతంలో చేరవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ఆత్మయౌవ్వనులందరూ ఈ వ్రతం చెయ్యవచ్చు. పరమాత్మ చూచి ఇష్టపడే యౌవనం మన ఆత్మలకుంటే చాలు దీని అర్థం ఏమిటో మనం ముందుకు వెళ్ళే కొద్ది తెలుసుకుంటాం. ఆ ఇచ్ఛ ఉంటే చాలు, స్వేచ్ఛగా మనం మనసా, వాచా, కర్మణా ఆడపడచులం కావాలి. ఏ విషయంగా? భగవద్విషయపరంగా మాత్రమే! అసలు ఈ ప్రపంచంలో భగవద్విషయం కానిది ఏముంది

               M.s.s.k

*3. ఈ వ్రతం ఎక్కడ చెయ్యాలి?*


మన ఇళ్ళలో, వాకిళ్ళలో, గుడులలో, బడులలో,  మన గుండెలలో,


*4. ఈ వ్రతంలో మనం చెయ్యవలసినది ఏమిటి?*


ఇది స్నాన వ్రతం అందుకని మనం స్నానం చెయ్యాలి. మనం రోజూ చేసే బాహ్య స్నానం కాక అంతర స్నానం కూడా చెయ్యాలి. బయట చేసే స్నానం శరీరం శుభ్రం చేసుకోవటానికి, లోపలి స్నానం అంతఃకరణ శుద్ధికి. బాహ్య స్నానం రోజూ బ్రాహ్మముహూర్తం ముందు అంటే వేకువన నాలుగు గంటలకు. ఆ తరువాత తిరుప్పావైని నిత్యవ్రతంగా చేసుకుంటే అంతఃకరణ శుద్ధి అయిభగవదనుభవం అవుతుంది. భగవదనుభవమనే ఉత్పుల్ల పంకజ తటాకములో మునిగి, తాను వేరుగా తెలియకుండా ఉండుటే స్నానం అని ఉభయ వేదాంతాలు చెప్తున్నాయి. 


జీవులనే నదులు పరబ్రహ్మమనే సముద్రములో చేరి, దాని నుండి వేరు చేసి చూపుటకు వీలు కానట్లు సాయుజ్యము నందుటయే మోక్షము. 


ఈ వ్రతంలో స్నానం అంటే అర్ధం గోపికలు అందరూ కలసి నంద గోపభవనం చేరి కృష్ణుని కలుసుకోవటమే. పరమాత్మ సేవలలో తరించడమే.


*5. ఈ వ్రతం చేస్తే ఎవరి వలన ఏ ఫలము పొందుతాము?*


శ్రీ కృష్ణ పరమాత్మ మనకు కావలసిన ఇహపర సుఖములను అనుగ్రహిస్తాడు గోపికలకు వలె, మనతో నిత్య సంబంధము కలిగి, మనం చేసే కైంకర్యములను స్వీకరిస్తాడు


ఇవన్నీ పొందేందుకే గోదా గోపిక స్నానము చేసే కోరిక గల వారందరూ రండి అని పిలుస్తోంది. హాయిగా తానొక్కతే వ్రతం చేసుకొని, ఫలం పొందక అందరు గోపికలను ఎందుకు పిలవడం? అంటే - ఒక మంచికార్యం చేసేటప్పుడు పదిమందితో కలిసి చేస్తే అధిక ఫలం అని సంప్రదాయం. అట్లాగే 'ఏక స్వాదునభుంజీత' ఒక మంచి పదార్థాన్ని తానొక్కడే తినరాదు. నలుగురికీ పంచి తాను తినాలి. అందుకే గోదా గోపిక నంద ప్రజములోని కన్నెపడుచులందరినీ పిలుస్తోంది. 

                M.s.s.k

వారు భాగ్యవంతులట! వాడే వారి వాడైనాడు. శ్రీకృష్ణ కైంకర్యమే వారి ఐశ్వర్యము. వారు దివ్యాభరణములను దాల్చి ఉన్నారట. అదేమిటి? స్నానానికి వెళ్ళేవాళ్ళు మంచి ఆభరణములు ధరించడమేమిటి? అంటే వారు చేసేది సామాన్య స్నానం గాదనీ, వారు వేసుకునేవి సాధారణ ఆభరణములు కావనీ తెలుస్తుంది భగవత్ గుణానుభవ స్నానానికి కావలసిన ఆభరణాలు - జ్ఞానము, భక్తి, వైరాగ్యం ప్రాప్యత్వర మున్నగునవి. అందుకే వారిని 'నేర్కై యీర్' విలక్షణమైన ఆభరణములను ధరించిన వారలారా అని గోదా గోపిక పిలుస్తున్నది.


అయితే, ఆ కృష్ణుని చేరడం ఎలా? అతడు నంద గోపుని రక్షణలో నుండును. నంద గోపుడు వాడియైన వేలాయుధము (బల్లెము) పూని, తన కుమారుని సదా కాపాడుచుండును. తల్లి యశోదా దేవి ఒడిలో ఆ కిశోర కృష్ణ సింహము చెంగు చెంగున దుముకుచుండును. ఆమె అందమైన కనుసన్నలలో అతడు మెలగుచుండును.


ఇచట నంద గోపుడే ఆచార్యుడు. ఆయన ధరించే ఉపదేశముద్రయే వేలాయుధము. *మంత్రోమాతా, గురుః పితా - తల్లి యశోద మంత్రము. యశము నిచ్చునది యశోద, ఆనందము నిచ్చువాడు కృష్ణుడు, ఆనందమే కృష్ణుడు. అచార కృపతో మంత్రాధీనమైన భగవంతుడు మనకు అంది వస్తాడు. మనకు ఏది హితలు చూచి అందిస్తాడు.*


మన గోపికలు శ్రీకృష్ణుని రూపమును స్వభావమును స్తుతిస్తున్నారు. కార్మిని చ్చెంగళ్ కదిర్ మదియమ్బోల్ ముగత్తాన్!' మేఘము వలె నల్లని శరీరము, తామరలు వలె ఎఱ్ఱని కన్నులు, సూర్య, చంద్రుల పోలు ముఖము కలవాడు. 


అది ఇంకా బాగుండాలంటే ఎలా చెప్పాలి? ఒక మేఘముపై రెండు తామరపూవులు, రవి చంద్రుడు ఒకేసారి వికసించారట! ఎందుకండీ? ఇంత గొప్పగా మనం భగవంతుని. కీర్తించడం? మన తక్కువతనాన్ని తెలుసుకోవడానికేనట! ఆ హద్దు ఈ హద్దును తెలుపుతుంది! 


మేఘము తాపహరము, సుశీలము, జీవనప్రదము. శ్రీకృష్ణుడట్టివాడు అతని నేత్రములు స్తుతి పాత్రములు. అవి ఆర్తిని, వాత్స్యలమును, స్వామిత్వమును ప్రకాశింపజేయును. 

              M.s.s.k

ఇక శ్రీకృష్ణుని దివ్యముఖమండలమున సూర్యచంద్రులిరువురు ఒకేసారి కన్పట్టిరట. అంటే భక్తులకు చల్లగా, భక్త విరోధులకు వేడిగా తోచునట! ఆయన అత్యంత సులభుడు, అత్యంత దుర్లభుడు కూడానట.


అట్టి అనంత కల్యాణ గుణములుగల - 'నారాయణనే నమక్కెపరై తరువాన్' నారాయణుడే మనకే 'పర'ను (పురుషార్ధమును) ఇచ్చువాడు. 'పర' అనగా వ్రతము లను కావలసిన వాద్యము. మనకు ఇహపరాలు ఇచ్చేవాడు ఆ నారాయణుడే ఆ శ్రీకృష్ణుడే! నారాయణుడంటే అన్ని పదార్ధముల లోపల వెలుపల వ్యాపించి, వాటిని తనయందు నిలుపగలిగినవాడు.. *'అంతర్ బహిశ్చతత్ సర్వం వ్యాష్య నారాయణ స్థితః, ఆయన 'మనకే' అని నొక్కివక్కాణించడం* ఎందుకంటే - ఆ శ్రీమన్నారాయణుడే మాకు ఉపాయము ఉపేయము అని గట్టిగా నమ్మే ప్రపన్నులకు మాత్రమే తనంతతానుగా అందివచ్చి, నిత్య కైంకర్య భాగ్యమును అందించును.


*పైగా, మనం ఈ వ్రతం చేస్తే అందరూ చూసి ఆనందిస్తారు. రండి:*


కల్యాణం చేకూర్చే ఈ వ్రతము మనందరము కలిసి చేద్దాము అని మనల్ని ఆండాళ్ 

ఆహ్వానిస్తోంది.


                M.s.s.k

కామెంట్‌లు లేవు: