16, డిసెంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల

 *స్వామివారి నిజరూప ప్రతిమ..(రెండవ భాగం)*


సరిగ్గా స్వామివారి ఆరాధన పదిరోజుల ముందు..శ్రీ స్వామివారి ప్రతిమ మొగిలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి చేరింది..ఆ ప్రతిమను ఒక గాజు పేటిక లో పెట్టి, మంటపం లో ఉంచితే..భక్తులందరూ చూడటానికి అనువుగా ఉంటుందని భావించాము..భక్తులందరికీ చక్కగా...ఏ వైపు నుంచి చూసినా.. కనబడే విధంగా పేటిక కావాలి..తయారు చేసే పనివాళ్లను పిలిపించాము..కొలతలు తీసుకొని వెళ్లారు..నాలుగైదు రోజుల్లో తయారు చేసి ఇస్తామన్నారు..సరే అన్నాము..


రెండు రోజులు గడిచిపోయాయి..ఒంగోలు నుంచి రామచంద్ర శర్మ గారని దత్తభక్తులు వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి దర్శనం అయిన తరువాత..స్వామివారి విగ్రహానికి పేటిక తయారు చేసే ఖర్చును భరించే అవకాశం తనకు ఇవ్వమని అడిగారు..ఏ సమయానికి ఎవరితో పని అవుతుందో వారిని శ్రీ స్వామివారే పిలిపించుకుంటున్నారని అర్ధం అయింది..పైగా ఇది స్వామివారి ఆదేశం అనిపించింది..రామచంద్ర శర్మ గారికి ధన్యవాదములు చెప్పాను..తనకు ఆ అవకాశం కలగడం తనకు అదృష్టంగా భావించారాయన..ఆ మాటే నాతో చెప్పారు.


"అయ్యా..స్వామివారి నిజరూప విగ్రహం వచ్చింది..గాజు పెట్టెలో పెడదామని అనుకుంటున్నాము కదా...అందులో స్వామివారి పాదుకలు కూడా తయారు చేయించి పెడితే బాగుంటుంది కదా..మీరు ఆలోచన చేయండి.." అని మా అర్చకులు చెప్పారు..నాకూ ఆ ప్రతిపాదన నచ్చింది..


"సరే..రేపు పాదుకల గురించి ఆలోచిద్దాము.." అని చెప్పి సింగరాయకొండ కు వచ్చేసాను..


ఆరోజు రాత్రి తొమ్మిదిగంటలకు అష్రాఫ్ జాన్ అనే ముస్లీమ్ యువతి (ఈ అష్రాఫ్ జాన్ గారి గురించి ఇంతకు ముందు ఒక పోస్ట్ లో పాఠకులకు పరిచయం చేసి వున్నాను..)  ఫోన్ చేసి.."స్వామివారి మందిరం లో ఏదైనా వస్తువు ఇవ్వాలని అనుకుంటున్నాను..సాధ్యమైనంత వరకూ అది స్వామివారి విగ్రహం వద్దే ఉండాలని అనుకుంటున్నాను..మీరేదైనా సలహా ఇస్తారా..? " అని అడిగింది.. నామనసులో పాదుకలు అడగాలి అనే ఆలోచనే రాలేదు..తీర్ధం వేసే చిన్న పాత్రలు, హారతి పళ్లెం, శఠారి..ఇత్యాదులు గుర్తుకొస్తున్నాయి కానీ మరేమీ నా తలకాయలో తట్టడం లేదు.."అమ్మా..రేపుదయం చెపుతాను.." అన్నాను..సరే అన్నది..


ప్రక్కరోజు ఉదయం ఏడు గంటలకల్లా తిరిగి ఆ అష్రాఫ్ జాన్ నాకు ఫోన్ చేసి.." ప్రసాద్ గారూ..ఈ తెల్లవారుజామున స్వామివారు నా కలలో దర్శనం ఇచ్చారు..నిజమండీ..నన్ను తనకు పాదుకలు చేయించి ఇవ్వమన్నారు.." అని ఉద్వేగంతో చెప్పింది..


నేను ఆశ్చర్యం తో ఏమీ మాట్లాడలేకపోయాను..నేను సరిగా వినలేదు అనుకోని..మళ్లీ చెప్పింది.."నీ అదృష్టం తల్లీ.." అన్నాను..అంతకు మించి ఏమనాలో కూడా తెలియలేదు..తన విగ్రహం తో పాటు తనకు పాదుకలు కూడా కావాలని స్వామివారే కోరినట్లు నాకు తోచింది..


"అమ్మా..శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమ ను తయారు చేయించాము..ఆ విగ్రహం వద్ద మీరు చేయించబోయే పాదుకులను ఉంచుతాము..స్వామివారే మీతో చెప్పి చేయించుకున్న తరువాత..అంతకంటే సరైన ప్రదేశం ఎక్కడుంటుంది?..మీరు చేయించండి.." అన్నాను..


"వెండిపూత కూడా వేయించి తీసుకొస్తాను..నాకూ ఆనందంగా ఉంది..మీకు కృతజ్ఞతలు చెప్పాలి.." అన్నది..అన్నమాట ప్రకారం పాదుకలు తయారు చేయించి, వాటికి వెండితో పూత కూడా వేయించి భక్తిగా సమర్పించింది..


శ్రీ స్వామివారి ఆరాధనామహోత్సవానికి వారం రోజులముందే స్వామివారి ప్రతిమ అన్నివిధాలా తయారైపోయింది..ఈ ఆలోచనకు ముఖ్యకారకుడైన జయచంద్రకు నేను ఫోన్ చేసి, ఆరాధన నాటికి శ్రీ స్వామివారి మందిరానికి రమ్మనమని చెప్పాను..ఆ ప్రతిమను తయారు చేసిన లక్ష్మీనారాయణ గారు కూడా వస్తున్నారని..ఆర్ధికంగా తోడ్పాటు అందించిన చీమలదిన్నె అంకయ్య నూ ఆరోజుకు రమ్మనమని చెప్పానని జయచంద్ర చెప్పారు..


మే నెల 11 వతేదీ వైశాఖ శుద్ధ సప్తమి..ఆరోజు శ్రీ స్వామివారి ఆరాధన..ఆ రోజు  శ్రీ స్వామివారి నిజరూప ప్రతిమను అర్చకస్వాములు శాస్త్రోక్తంగా మంత్రపఠనం చేస్తుండగా ఆవిష్కరించాము..సాక్షాత్తూ శ్రీ స్వామివారే కూర్చుని ఉన్నట్లు గా ఉందని..ఆ విగ్రహాన్ని చూసిన పలువురు భక్తులు వ్యాఖ్యానించారు..


శ్రీ స్వామివారు తన ప్రతిమను తన భక్తుల ద్వారా తానే చేయించుకున్నారని మేము భావించడం లో ఎటువంటి సందేహమూ లేదు..


సర్వం..

శ్రీ దత్తకృప!


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: