16, డిసెంబర్ 2020, బుధవారం

తిరుపావై

 *తిరుపావై ప్రశ్నావళి-జవాబులతో*


*శుభ ధనుర్మాసం.* తిరుప్పావై గురించి ప్రాధమిక అవగాహన ఆధారంగా తయారు చేసిన 108 ప్రశ్నలు-జవాబుల గోష్టియే ఈ తిరుప్పావై ప్రశ్నావళి. *ఇది ఎవరి జ్ఞానాన్ని పరీక్షించడానికో లేదా ఏ కొందరినో విజేతలుగా ప్రకటించడానికో సంకలనం చేసిన ప్రశ్నావళి కాదు.* శ్రీకృష్ణుడు అందరినీ కలిసి రమ్మన్నాడు, లౌకిక సుఖాలు ఎవరికి వారు అనుభవించేవి, కాని భగవత్ అనుభవం అందరితో కలిసి చేసేవి, దాన్నే గోష్టి అంటారు.


*1.* ఆండాళ్ అని ఎవరికి పేరు?

=గోదాదేవి.


*2.* తిరుమల ఆలయంలో ధనుర్మాసంలో దేని బదులుగా తిరుప్పావై గానం చేస్తారు?

= సుప్రభాతం బదులుగా.


*3.* ఏది అసలైన మంచిరోజని గోదాదేవి చెప్పినది?

=భగవంతుని పొందాలి అని మన మనసులో పడిన రోజే మంచిరోజు.


*4.* గోదాదేవి తులసివనంలో లభించగా పెంచిన తండ్రి ఎవరు?

=శ్రీ విష్ణు చిత్తులు.


*5.* ఆళ్వారులు ఎంతమంది?

=12మంది.


*6.* గోదాదేవి ఎవరి అంశగా అవతరించింది?

=భూదేవి.


*7.* గోదాదేవి తిరుప్పావైను ఏ భాషలో గానం చేసింది?

=తమిళ భాష.


*8.* తిరుప్పావై ఏ దివ్య ప్రబంధములోని భాగము?

=నాలాయిర్ దివ్యప్రబంధము.


*9.* శ్రీ వైష్ణవ దివ్యదేశాలు ఎన్ని?

=108.


*10.* గోదాదేవి అవతరించిన దివ్యదేశం పేరు ఏమిటి?

=శ్రీవిల్లిపుత్తూరు.


*11.* దామోదరుడు అని శ్రీకృష్ణుని ఎందుకు పిలుస్తారు?

=దామము (త్రాడు) ఉదరము నందు కలవాడు కనుక.


*12.* శ్రీవిల్లిపుత్తూరు గోపురం ఎత్తు ఎంత?

=196 అడుగులు.


*13.* ‘లోకాఃసమస్తాఃసుఖినో భవంతు’ అనే భావన తిరుప్పావై ఎన్నవ పాశురంలో చెప్పబడినది?

=మూడవ పాశురం.


*14.* శ్రీవిల్లిపుత్తూర్ లోని రంగనాథ ఆలయంలో రాత్రి పూట స్వామికి చేసే ఆరగింపుకు ఏమని పేరు?

=తిరుసాదము.


*15.* శ్రీవిష్ణుచిత్తులు వారు తానకు తులసివనంలో లభించిన ఆండాళ్ కు మొదట పెట్టిన పేరు ఏమిటి?

=కోదై (గోదా)


*16.* పెరియాళ్వారుని (శ్రీవిష్ణుచిత్తులు) భగవంతుడి ఏ అంశగా భావిస్తారు?

=గరుడాంశము.


*17.* తిరుప్పావైను సంస్కృతంలో ఏమంటారు?

=శ్రీవ్రతము.


*18.* మేఘాన్ని ఎలా గర్జించమని గోదాదేవి చెబుతుంది?

=పరమాత్మ చేతిలోని శంఖమువలే.


*19.* శ్రీవేంకటేశ్వరుని చేరుటకై గోదాదేవి ఎవరిని వేడుకొన్నది?

=మన్మధుని


*20.* తల్లివద్ద కృష్ణుడు ఎలా ఉంటాడని గోదాదేవి చెప్పినది?

=సింహం పిల్లవలె.


*21.* తిరుప్పావై వ్రతమును ఆచరించుటకు అర్హత యేమిటి?

=ధృడమైన కోరిక, పట్టుదల.


*22.* కాలం కలసి రాకుండా దిక్కుతోచని స్థితి ఉన్నపుడు తిరుప్పావై ఎన్నవ పాశురాన్ని ప్రతిరోజు 11 సార్లు పారాయణం చేయాలని చెబుతారు?

=మొదటి పాశురం.


*23.* శ్రీకృష్ణుడు యశోదగర్భాన జన్మించాడని గోదాదేవి ఎందుకు కీర్తిస్తుంది?

=దేవకీపుత్రుడని కీర్తిస్తే కంసుడికి తెలిసి పోతుందేమోనని. (భావనా పరాకాష్ఠ)


*24.* ధనుర్మాస వ్రతం పాటించేటపుడు చేయవలసిన పనులేవో, చేయకూడని పనులేవో తిరుప్పావై ఎన్నో పాశురంలో చెప్పబడినది?

=రెండవ పాశురం.


*25.* తిరుప్పావై మూడవ పాశురంలో దశావతారాలలోని ఏ అవతారం గానం చేయబడినది?

=వామన అవతారం.


*26.* ఆళ్వార్లకు మరో పేరేమిటి?

=వైష్ణవ భక్తాగ్రేసరులు. దైవభక్తిలో మునిగి లోతు తెలుసుకున్నవారు, కాపాడువారు అని అర్థము.


*27.* నెలకు ఎన్ని వర్షాలు కురవాలని గోదాదేవి చెప్పినది?

=మూడు.


*28.* మేఘాన్ని ఏ విధంగా మెరవుమని గోదాదేవి శాసిస్తుంది?

=పద్మనాభుడి చేతిలోని సుదర్శన చక్రం వలె.


*29.* శ్రీకృష్ణుడు ఎక్కడ జన్మించాడో చెప్పడానికి గోదాదేవి చెప్పిన పేరు ఏమటి?

=ఉత్తర మధుర. (మధుర మీనాక్షి అని అనుకోకుండా వుండడానికి).


*30.* ‘పెరునీర్’ అంటే ‘పెద్ద మనస్సున్న నది’ అని గోదాదేవి ఏ నదిని కీర్తిస్తుంది?

=యమునా నది.


*31.* మనందరం పాటించవలసిన ఏ గుణాన్ని గోదాదేవి నాల్గవ పాశురంలో చెబుతుంది?

=దానగుణం.


*32.* లోకాన్ని సుఖపెట్టే లక్షణం ఉండాలని గోదాదేవి ఎవరికి చెబుతుంది?

=వర్షానికి.


*33.* పరమాత్మవద్దకు వచ్చేటపుడు ఎలా రావాలని గోదాదేవి చెబుతుంది?

=పరిశుద్ధులమై (త్రికరణ శుద్ధిగా) రావాలి.


*34.* విగ్రహరూపంలో వున్న పరమాత్మపై మనకు మంచి విశ్వాసం కలగాలంటే తిరుప్పావై ఎన్నవ పాశురం పారాయణ చేసుకోవాలి?

=ఐదవ పాశురం.


*35.* విష్వక్సేన అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=నమ్మళ్వారు.


*36.* తిరుప్పావై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=బుద్ధివ్రతం.


*37.* గోదాదేవి మొదటగా మేల్కొనే గోపికను ఏమని పిలుస్తుంది?

=పిళ్ళాయ్ (పిల్లా).


*38.* తిరుప్పావై ఆరునుండి పదిహేను వరకు గోదాదేవిచే లేపబడు గోపికలను ఎవరితో పోల్చి చెబుతారు?

=ఆళ్వార్లతో.


*39.* గద (కౌమోదకీ) అంశ గా గల ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వారు.


*40.* తిరుప్పావైలోని ఏడవ పాశురం ఏ దివ్యదేశంలో రెండుసార్లు పాడుతారు?

=శ్రీపెరుంబుదూరులో ఆదికేశవ పెరుమాళ్ సన్నిధిలో.


*41.* కీచుకీచుమని అరిచే *ఏ* పక్షులు తిరుప్పావైలో ప్రస్తావించబడ్డాయి?

=భరద్వాజ (చాతక) పక్షులు.


*42.* తిరుప్పావై ఏడవ పాశురంలో స్మరింపబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*43.* మనకు తెలిసిన మంచి విషయాలు పదిమందితో పంచుకోవాలని మనకు తెలియచేసే ప్రాణులేవి?=పక్షులు.


*44.* ఎనిమిదవ  పాశురంలో నిద్రలేపబడు గోపిక ఏ ఆళ్వారును సూచిస్తుంది?

=నమ్మళ్వారు.


*45.* పశువులను ప్రాతఃకాలాన్నే చిరుమేత కొరకు వెళ్ళే పచ్చిక బయళ్లను తిరుప్పావైలో ఏమంటారు?

=శిరువీడు.


*46.* భగవానుడి కౌస్తుభాంశముతో పోల్చబడిన ఆళ్వారు ఎవరు?

=కులశేఖరాళ్వార్.


*47.* అగస్త్యుడు నిలిచిన ఊరుకు ఏమని పేరు?

=కుంభకోణం.


*48.* పదకొండవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=ప్రీతి వ్రతం.


*49.* కర్మయోగాన్ని చెప్పిన ఆళ్వారు ఎవరు?

=పూదత్తాళ్వార్.


*50.* పదమూడవ పాశురంలో చెప్పబడిన గోపికల రెండు వర్గాలు ఎవరెవరికి చెందినవారు?

=శ్రీకృష్ణుని వర్గం, శ్రీరాముని వర్గం.


*51.* పదమూడవ పాశురంలో శ్రీకృష్ణుని ఏ లీల తెలుపబడింది?

=బకాసుర వధ.

 

*52.* సన్యాసులు ధరించే కాషాయ వస్త్రాలు దేనిని సూచిస్తాయి?

=త్యాగం.


*53.* శ్రీవత్సము అంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుప్పాణి.


*54.* తిరుప్పావై జీయర్ అని ఎవరికి పేరు?

=భగవద్రామానుజులు.


*55.* తిరుప్పావై 30 పాశురములలో మధ్యదైన 15వ పాశురంలో చెప్పబడిన భక్తుని విశేష లక్షణమేమి?

=నానేదానాయిడుగ- అంటే ‘దోషము నా యందే కలదు”.


*56.* శ్రీకృష్ణుడు కువలయాపీడమను ఏనుగును సంహరించుటలో అంతరార్ధమేమి?

=అహంకారమును హతమార్చుట.


*57.* పదహారవ (16వ) పాశురం నుండి ఏ వ్రతము ప్రారంభమగుచున్నది?

=దాస్య వ్రతము.


*58.* గోపికలు ఆచార్యునిగా ఎవరిని భావిస్తున్నారు?

=నందగోపుని (భగవానుని అందించారు కనుక)


*59.* కోయిల్ అనగా ఏమి?

=కోన్ అనగా స్వామి. ఇల్ అనగా స్థానము. - భగవంతుని నివాసము.


*60.* నందుణ్ణి ఏ గుణము గలవానినిగా గోపికలు కీర్తిస్తారు?

=దాన గుణము.


*61.* గోపికలు ఎంబెరుమాన్ (మా స్వామీ) అని ఎవరిని పిలుస్తారు?

=నందుడు.


*62.* భగవానుడి ధనురంశగా గల ఆళ్వారు ఎవరు?

=తిరుమంగై యాళ్వారు. 


*63.* గోపికలు తమ వంశమునకు ‘మంగళ దీపమని’ ఎవరిని కీర్తిస్తారు?

=యశోద.


*64.* శెంపొర్కజలడి-ఎర్రని బంగారు కడియం దాల్చిన పాదం (Golden leg) గలవాడని గోపికలు ఎవరిని కీర్తించెను?

=బలరాముడు. 


*65.* నీళాదేవి ఎవరు?

=కృష్ణుని మేనమామైన కుంభుని కూతురు.


*66.* యశోద తమ్ముడు ఎవరు?

= కుంభుడు.


*67.* భగవానుడి ఖడ్గము (నందకము) అంశముగా గల ఆళ్వారు ఎవరు?

=పేయాళ్వారు.


*68.* ఆండాళ్ అలంకరణలో విశేషమేమిటి?

=ఎడమవైపు కొప్పు. ఎడమచేతిలో చిలుక.


*69.* భగవద్రామానుజులు అత్యంత ప్రేమతో అనుసంధానం చేసే పాశురమేది?

=18 వ పాశురం.


*70.* లక్ష్మీ అమ్మవారి కటాక్షం లభించాలంటే ఏ పాశురాన్ని నిత్యం 11 సార్లు పఠించాలి?

=18వ పాశురం.


*71.* శ్రీకృష్ణుడు శయనించిన మంచపు కోళ్ళు ఏ ఏనుగు దంతాలతో చేయబడ్డాయని గోదాదేవి వర్ణించినది?

=కువలయాపీడము.


*72.* అశ్వినీ దేవతలు ఎవరు?

= సంజ్ఞాదేవి కుమారులు ఇద్దరు- నాసత్యుడు, దన్రుడు.


*73.* గోపికలు నీళాదేవినుండి ఏ వస్తువులు వరముగా పొందిరి?

=అద్దము, విసనకఱ్ఱ.


*74.* తిరుప్పావై 20 వ పాశురం పారాయణ వలన ఏ లౌకిక కోరికలు తీరును?

=కుటుంబ కలహాలు తొలగి అన్యోన్య దాంపత్య జీవనం.


*75.* ఇరవై మూడవ పాశురంలో గోపికలు పరమాత్మను ఏ జంతువుతో పోల్చిరి?

=మృగరాజగు సింహము.


*76.* ప్రసిద్థములైన మూడు గుహల పేర్లేమిటి?

=అహోబిలం, పాండవుల గుహ, వ్యాస గుహ.


*77.* పరమాత్మ వద్ద ఎట్టి వాసన యుండును?

=సర్వగంథః -సర్వవిధ పరిమళములు.


*78.* పరమాత్మ బ్రహ్మకు వేదోపదేశము చేయుటను ఏ జంతువు అరుపుతో పోలుస్తారు?

=సింహ గర్జన.


*79.* కిరీటాలు ఎన్నిరకాలు? వాటి పేర్లేమిటి?

=మూడు-కిరీటం, మకుటం, చూడావతంసము.


*80.* కపిత్థవృక్షమనగా ఏ చెట్టు?

=వెలగ చెట్టు.


*81.* ఇరవై ఆరవ పాశురం నుండి ఏ వ్రతం ప్రారంభమవుతుంది?

=భోగవ్రతము.


*82.* ఇరవై ఆరవ పాశురాన్ని ఏ దివ్యదేశంలో రెండుసార్లు చదువుతారు?

=శ్రీవిల్లిపుత్తూరు.


*83.* పరమాత్మ యొక్క శంఖమునకు ఏమని పేరు?

=పాంచజన్యము.


*84.* ఇరవై ఏడవ పాశురంలో పేర్కొనబడిన కూడార్ ఎవరు?

=సర్వేశ్వరునితో కూడి ఉండుటకు ఇష్టపడని వారు.


*85.* ఇరవై ఏడవ పాశురం రోజు సమర్పించే ప్రసాదం పేరు ఏమిటి?

=కూడారై ప్రసాదం (108 వెండి గంగాళాలలో ఈ ప్రసాదం ఆరగింపు చేస్తారు)


*86.* భగవంతుడి శిఱుపేరు (చిన్నపేరు) ఏమిటి?

=గోవింద.


*87.* భగవానుడి సుదర్శన చక్రాంశముగా గల ఆళ్వారు ఎవరు?

= తిరుమొళిశై యాళ్వారు.


*88.* కృష్ణునికి, గోపికలకు ఉన్న సంబంధం దేనితో పోల్చబడినది?

=సూర్యునికి, కాంతికి గల సంబంధము.


*89.* గోదాదేవి తాను ఎవరి వెనుక వెళ్తున్నట్లు ఇరవై ఎనిమిదివ పాశురంలో పాడుతుంది?

=ఆవుల వెనుక.


*90.* ధనుర్మాసములో ఎన్నవ పాశురము చదివే రోజున స్వాములకు నూతన వస్త్రములు సమర్పించే సంప్రదాయము కలదు?

=27 వ పాశురం.


*91.* పొత్తామరై అడి- అందమైన తామర పూవు వంటి బంగారు ఛాయ కలిగిన పాదములు ఎవరివి?

=శ్రీకృష్ణునివి.


*92.* భగవంతుని పాదములకు మంగళం పాడుట ఎవరి లక్షణము?

=దాసుని లక్షణములు.


*93.* 'అజాయమానః' (పుట్టుక లేనివాడు) అని పరమాత్మను గూర్చి పలికిన ఉపనిషత్తు వెంటనే మాటమార్చి ఏమని పలికెను?

='బహుధా విజాయతే' (అనేక విధములుగా పుట్టుచున్నాడు)


*94.* సముద్రాన్ని దాటించేది ఓడ అయితే సంసారమును దాటించే ఓడ ఏది?

=విష్ణుపోతము


(విష్ణువనే ఓడ)


*95.* పరమాత్మ గొప్పా? ఆయన దాసులు గొప్పా?

=ఆయన దాసులే గొప్ప.


*96.* ఏడేడు జన్మలనగా ఎన్ని జన్మలని అర్ధము?

=ఎన్ని జన్మలకైనా అని అర్థము.


*97.* ఇరవై తొమ్మిదవ పాశురములో గోదాదేవి ఏ దివ్యదేశమును కీర్తించెను?

=అయోధ్య.


*98.* వజ్గం అంటే ఏమిటి?

=ఓడ.


*99.* ధన్వంతరి అవతారంలో శ్రీమహావిష్ణువు చేతిలో ఏమి కలిగి వుంటాడు?

=అమృత కలశం.


*100.* ముప్ఫయ్యవ పాశురంలో పరమాత్మను ఏమని వర్ణించెను?

=తిజ్గళ్ తిరుముగత్తు- అనగా చంద్రుని పోలిన దివ్యతిరుముఖ మండలం గలవాడా.


*101.* గోపికల దివ్యాభరణములేవి?

=కృష్ణుని ప్రాణము కంటే ఎక్కువగా ప్రేమించుటయే.


*102.* శ్రీ విల్లిపుత్తూరు ఎటువంటిదని గోదాదేవి కీర్తించెను?

=అణి పుదువై- ఈ జగత్తుకే మణివంటిది.


*103.* శ్రీవిష్ణుచిత్తుల వారు తమ మెడలో ఏ మాల ధరించెను?

=పైమ్ కమల తణ్తెరియల్ - నల్లని చల్లని తామర పూసల మాల.


*104.* గోదాదేవి ముఫ్పైవ పాశురంలో తాను ఎవరి కూతురునని చెప్పెను?

= పట్టర్ పిరాన్ కోదై (శ్రీవిష్ణుచిత్తుల వారి గోదాదేవిని).

 

*105.* తిరుప్పావై ఎటువంటి మాల?

=ముఫ్ఫై తమిళ పాశురములనే పూసలతో చేయబడ్డ మాల.


*106.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన తెలుగు ప్రబంధం ‘ఆముక్తమాల్యద’ ఎవరి పేరు?

= గోదాదేవి.


*107.* శ్రీకృష్ణదేవరాయలు రచించిన ఆముక్తమాల్యదలో ఎవరి కల్యాణం వర్ణింపబడినది?

=గోదాదేవి మరియు శ్రీరంగేశుల కల్యాణం.


*108.* భగవానుడి వనమాల అంశగా గల ఆళ్వారు పేరేమిటి?

=తొండరపడిప్పొడి

యాళ్వార్.


*జై శ్రీమన్నారాయణ!*

*ఆణ్డాళ్ తిరువడిగళే  శరణమ్*

కామెంట్‌లు లేవు: