14, ఏప్రిల్ 2025, సోమవారం

16-10-గీతా మకరందము

 16-10-గీతా మకరందము

   దైవాసురసంపద్విభాగయోగము

       

-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,

శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.


కామమాశ్రిత్య దుష్పూరం దమ్భమానమదాన్వితాః |  

వెూహాద్గృహీత్వాఽసద్గ్రాహాన్ ప్రవర్తన్తేఽశుచివ్రతాః ||


తాత్పర్యము:- (ఆసురీసంపదగల)వారు తనివితీరని కామమునాశ్రయించి, డంబము, అభిమానము, మదము గలవారలై, అవివేకము వలన చెడుపట్టుదలల నాశ్రయించి, అపవిత్రములగు వ్రతములు (నీచవృత్తులు) గలవారై ప్రవర్తించుచున్నారు.


వ్యాఖ్య:- “దుష్పూరమ్” - ఎంత అనుభవించినను తనివితీరనిదియగుటచే కామము దుష్పూరమని చెప్పబడినది. అనగా నింపశక్యముకానిది. "దుష్పూరేణ అనలేన చ" అని ఇదివఱలో 3వ అధ్యాయమున దీనిని గుఱించి  ప్రస్తావించబడెను. ఇట్టి  దుష్పూరమగు కామమును ఆశ్రయించినందువలన వారు అసఫలమనోరథులై తత్ఫలితముగ అశాంతికిలోనై యుందురు.


“దమ్భమానమదాన్వితాః” - దంభ, అభిమాన, మదములలో ఏ ఒక్కటి యున్నను జీవునకు వినాశమేకలుగుచుండ ఇక మూడును కలిగియున్నవారి విషయము వేఱుగచెప్ప వలయునా? వారేల ఈ ప్రకారముగ దుష్టాచరణశీలురై యుందురు? "మోహాత్” - అవివేకమువలన, అజ్ఞానమను ‘కైపు'లో వారు చేయరాని పనులన్నిటిని చేయుదురనియు, గ్రహించదగనివానినన్నిటిని గ్రహించుదురనియు భావము.


"అశుచివ్రతాః” - వారు నింద్యములై, అపవిత్రములైనట్టి మద్యసేవన, మాంసభక్షణాదివ్రతములను గలిగియుందురు. అనగా ప్రతిరోజు ఆ యా కార్యములను చేయవలెనను పట్టుదలగలిగియుందురు. వ్రతము, పట్టుదల యనునవి మంచివే అయినను అవి ఉత్తమ పదార్థములకు, పవిత్రకార్యములకు సంబంధించినవియగునపుడే సత్ఫలముల నొసంగ గల్గును. కావున వానిమార్గమును త్రిప్పవలెను.

శుచివ్రతములనే ఆచరించవలెనుగాని అశుచివ్రతములను గాదు. సద్గ్రహణమే గల్గియుండవలెనుగాని అసద్గ్రహణముకాదు.


ప్రశ్న:- కామ మెట్టిది?

ఉత్తరము:- పూరింప శక్యముకానిది (దుష్పూరమ్).

ప్రశ్న:- ఆసురీసంపదగలవారి మఱికొన్ని లక్షణములను జెప్పుము?

ఉత్తరము:- వారు (1) అంతులేని కామమును ఆశ్రయించుదురు (2) డంబము, అభిమానము, మదము గల్గియుందురు (3) అవివేకము గల్గియుందురు (4) చెడ్డపట్టుదలలు (నీచప్రవృత్తులు), అపవిత్రవ్రతములు శీలించుదురు.

కామెంట్‌లు లేవు: