*తిరుమల సర్వస్వం -208*
*మాధవుడు చేసే మానవ సేవ -5*
*వేద విద్యాబోధన*
వేదాలంటే పుక్కిటి పురాణాలు కాదు. విజ్ఞాన నిక్షేపాలు. వేలసంవత్సరాల క్రితం హైందవజాతి ఉనికిని ప్రపంచానికి చాటిచెప్పిన కరదీపికలు. నేడు మానవజాతిని పట్టిపీడిస్తున్న అనేక సామాజిక, శారీరక, మానసిక ఋగ్మతలకు తరచి చూస్తే మన వేదాలలో సత్వరమైన, ఖచ్చితమైన, సులభసాధ్యమైన పరిష్కారమార్గాలు కానవస్తాయనేది కాదనలేని సత్యం. కానీ, పెరటిచెట్టు వైద్యానికి పనికిరాదన్న చందంగా, వేదాలను ఉపేక్షించి, పాశ్చాత్య పోకడలను అనుసరించడం వల్ల ఇప్పటికే మనమెంతగానో కోల్పోయాం.
ఈ నేపథ్యంలో మహత్తరమైన వేదసంస్కృతి వ్యాప్తికి తి.తి.దే. అవిరళ కృషి సలుపుతోంది. దానిని వివరించే ముందు, ఏ వేదంలో ఏం చెప్పబడిందో క్లుప్తంగా తెలుసుకుంటే, వేదాల పట్ల ఆసక్తి, అనురక్తి పెరుగుతాయి.
*ఋగ్వేదం* ఐదు శాఖల సమాహార మైనప్పటికీ, ప్రస్తుతం 'శాకల' అనబడే ఒక శాఖ మాత్రమే మనకు అందుబాటులో ఉంది. దీనిలో.... *మానవుని సామాజిక నడవడి (సోషల్ బిహేవియర్), రోగ చికిత్సా పద్ధతులు, కృత్రిమ అవయవాల అమరిక (ఆర్టిఫిషియల్ లింబ్స్), సూక్ష్మ శస్త్రచికిత్స (మైక్రో సర్జరీ), వర్షాలకోసం చేపట్టవలసిన పద్ధతులు, మొదలైనవి చెప్పబడ్డాయి.*
*యజుర్వేదం* లో ప్రాణహింస కూడదని, బలులు నిషిద్దమని చెప్పబడింది. యాగాలు చేసే పద్ధతులు కూడా పేర్కొనబడ్డాయి.
*సామవేదం* లో కళలు, సంగీతం, వాద్యపరికరాలు, సాహిత్యం మొదలగు వాటిని వివరించడంతో పాటుగా; సృష్టి సమస్తం శూన్యం నుండి ఉద్భవించి, శూన్యం లోనే ఐక్యమై పోతుందని ప్రతిపాదించబడింది. ఈనాటి బ్లాక్ హోల్ సిద్ధాంతానికి సామవేదం లోని సూత్రీకరణలే ప్రాతిపదికలని కొందరు అభిప్రాయ పడతారు.
*ఆథర్వణ వేదం* లో ఆత్మలు, ప్రేతాత్మలు, యుద్ధవిద్యలు, విషశాస్త్రం, శతృసైనికులను క్రిమికీటకాలతో హతమార్చటం (బయో వార్) వంటి విషయాలపై విస్తృతమైన సమాచారం ఉంది. ఇంతే కాకుండా, జ్వరం, అతిసారం, అతిమూత్రం, వాతం, పిత్తం, శ్లేష్మం, విషజ్వరం, క్షయ, బొల్లి, కుష్టు వ్యాధులకు; తేలుకాటు, పాముకాటుకు; సుఖప్రసవానికి, సంతానలేమికి; శిరస్సు, ముక్కు, చెవి, కంఠానికి (నేటి ఇ.ఎన్.టి) వచ్చే వ్యాధులకు ఔషధాలు, ఉపశమనాలు చెప్పబడ్డాయి.
*వేదపాఠశాల*
తిరుమల ప్రధానాలయం నుండి దాదాపు ఐదారు మైళ్ళ దూరాన ఉన్న *'ధర్మగిరి'* అనే ప్రదేశంలో, తి.తి.దే. వారి ఆధ్వర్యంలో, తిరుపతి లోని వేదవిశ్వవిద్యాలయానికి అనుబంధంగా, ఓ సువిశాలమైన ప్రాంగణంలో *'వేదపాఠశాల'* నడుపబడుతోంది.
1884వ సంవత్సరంలో ఒక చిన్న కుటీరంలో ప్రారంభింపబడ్డ ఈ పాఠశాల, దినదిన ప్రవర్థమానమవుతూ, నేడున్న ప్రాంగణంలోకి మారింది. వాహనమార్గం ద్వారా ప్రయాణించి, శిలాతోరణం ఉద్యానవన సముదాయాన్ని దాటిన తరువాత, ప్రకృతిశోభతో ఉట్టిపడుతున్న ప్రశాంత వాతావరణంలో నెలకొన్న ఈ పాఠశాలను చేరుకోవచ్చు. పచ్చని పరిసరాలతో మమేకమై సాంప్రదాయ వేషభాషలతోనున్న చిన్నారులు వేదాలను వీనులవిందుగా వల్లె వేస్తున్న దృశ్యం నయనానందకరంగా, కర్ణపేయంగా గోచరిస్తుంది. వీరందరూ పంచెకట్టుతో, నుదుటిపై నామాలతో, శిరస్సుపై శిఖతో అభినవ బృహస్పతుల వలె తేజరిల్లు తుంటారు.
సనాతన కాలం నుంచి, ప్రపంచం నలుమూలల లోని కోట్లాది ప్రజలు అవలంబిస్తున్న హైందవమత మనుగడకు మూలం 'వేదం'.
చతుర్వేదాలు శేషాచల సానువుల్లో బండశిలలుగా అవతరించాయని అన్నమాచార్యుల వారు తన కీర్తనలో పేర్కొన్నట్లుగా ఇంతకుముందే చెప్పుకున్నాం.
నాలుగు వేదాలే ఆనందనిలయం చుట్టూ ఉన్న నాలుగు మాడ వీధులుగా అవతరించాయని కూడా పురాణాలలో చెప్పబడింది. ఎందరెందరో కవులు, గాయకులు, మహాభక్తులు శ్రీవేంకటేశ్వరుణ్ణి వేదపురుషునిగా అభివర్ణించారు. అంతటి మహత్తరమైన, ఘనచరిత్ర గల వేదాలను పరిరక్షించడంలో తి.తి.దే. తనవంతు పాత్రను అద్వితీయంగా పోషిస్తోంది. అందులో భాగంగా ఆసక్తి, అర్హత గల బాలురకు అతి చిన్నవయసు నుండే వేద విద్యాభ్యాసం గావించడం ఈ పాఠశాల ప్రధానోద్దేశ్యం.
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి