అపూర్వ శాస్తా
తన తల్లి భార్య అగు శ్రీ లక్ష్మీదేవిని శాస్త వారు ఏమని పిలవాలి ???
చాలాకాలము క్రిందట కేరళ దేశములోని ఒకానొక ఆలయములో స్వామి అయ్యప్ప విగ్రహం చిన్ముద్ర దారివలే గాక తన కుడిచేతి చూపుడు వ్రేలును ముక్కుపై పెట్టుకొని ఏదో దీర్ఘాలోచనలో మునిగి యున్నటువంటి భంగిమలో ఉండేదట.
ఆ ఆలయములోనే యొక శిలాఫలకములో శ్రీ స్వామివారి ఈ అపూర్వ భంగిమను , ఆ భంగిమలో దాగియున్న ఆలోచనకు కారణమేమనియు తెలిపెడి మహనీయులొకరు ఈ దేవాలయానికి వస్తారు. అట్టి మహనీయుని వలన ఈ దేశానికి మేలు కలుగుననియు , ఆ మహానుభావుడెవరో తెలుసుకొనేందుకు ఈ దేవాలయములో శ్రీస్వామివారిని దర్శించుకొనేందుకు వచ్చే ప్రతివారు శ్రీస్వామివార్ని ఈ విచిత్ర భంగిమలో దర్శించుకొనువేళ వారెందుకిలా ఆలోచనా రూపంలో అమరియున్నారు. కారణమేమిటి ? అని మనస్సులో ప్రశ్నించి వారివారికి లభించిన సమాధానాన్ని ఈ సన్నిధి ముంగిట గట్టిగా చెప్పాలి. ఎవరి మాటలను విని శ్రీస్వామివారు అదియే నా ఆలోచనకు సరియైన కారణం అనురీత్యా దీర్ఘాలోచన భంగిమను వీడి చిన్ముద్రను అనగా బొటనవ్రేలు , చూపుడు వ్రేలును కలపి గుండ్రముచేసి , తక్కిన మూడు వ్రేళ్ళను పైకి నిలిపే చిన్ముద్రతో దర్శనమిచ్చునో అతడే ఆ మహనీయుడని గుర్తించవలయుననియు ఆ శిలాఫలకంలో లిఖించబడి యుండెను. ఆకాలమున దేశములో ఇన్ని మతాలు పుట్టలేదు. ఐనను కలికాలంలో జనులు కలహించుకోవడానికి ఏదైనా కారణాలు కావాలి కదా ? శివుని కొలిచే వారు , విష్ణుమూర్తిని కొలిచేవారు అని ఇరువర్గీయులై శైవమే గొప్పది. శివుడే గొప్ప వాడనియు , లేదు లేదు విష్ణువే గొప్పవాడు. అతనికి మించిన దైవమే లేదు. వైష్ణవమతమే చాలా విశేషమైనది. అంటూ జనులు ఇరువర్గీయులై కలహించి కొట్టుకొని , చంపుకొనే దాకా వెళ్ళేవారు. అప్పటి మతాచార్యులు గూడా తన మతస్థాపనాభివృద్ధి కొరకై ప్రజలలోను , రాజులలోను శైవం , వైష్ణవం అను భేదాలను హెచ్చు తగ్గులను సృష్టించి , వారి వారికి తోచిన రీతిగా ప్రచారం చేసేటివారు. అది శ్రీభుక్క భూపతుల వారు రాజ్యమేలు చుండినకాలము. విజయనగర సామ్రాజ్య పాలకుల గురువైయుండే వైష్ణవ మత ఆచార్య పీఠము నందుండిన శ్రీ తాతాచార్యుల వారే శ్రీభుక్క భూపతుల వారి ఆస్థాన గురువు. ఆ కాలమునందే అప్పయ్య దీక్షితులు అను మహనీయులొకరుండేటివారు. వారు అద్వైతి అయినను శివ ఉపాసనను చాలావరకు అభివృద్ధిపరచిన వారు. తీవ్ర విష్ణు ఉపాసకులై యుంటూ , శివపూజను , అరాధనలను ఖండిస్తూ శివాచారియార్లను కించపరుస్తూ, విష్ణుప్రచారం చేసేవారిని ఖండిస్తూ అనేక గ్రంథాలు వ్రాసి , వాద ప్రతివాదములు చేస్తూ శివోత్కర్షమును నెలకొలువుట కొరకు అతీత ప్రచారం చేయవలసివచ్చేది. వారి సమకాలికులైన తాతాచార్యుల వారు , విజయనగర రాజ్యపాలకులకే గాక దేశంలో అనేక రాజ్యాధిపతులకు కుల గురువై , ప్రధాన సలహాదారులై వుంటూ అతీత పలుకుబడులను పొంది అటు రాజులలోను , ఇటు ప్రజలలోను శివద్వేషాన్ని పెంచి విష్ణుప్రచారంచేసి , అనేక ప్రజల మత మార్పిడికి కారకులై వ్యవహరించి నందువలననే అప్పయ్య దీక్షితులవారు శివప్రచారం చేసి , శివమతాన్ని నెలకొల్ప వలసిన స్థితిని కల్పించినది. అంతేగాని మిగిలిన విష్ణుభక్తుల మనస్సులో కరుడు కట్టుకుపోయిన శివద్వేషం వున్నట్లు అద్వైతియైన అప్పయ్య దీక్షితుల మనస్సులో విష్ణుద్వేషము అణుమాటకే తావులేదు. ఈశ్వరుడు - ఈశ్వరి వీరితో విష్ణుమూర్తిని గూడా సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపముగానే భావించి మ్రొక్కేటివారు. వైష్ణవ మతాచారులైన శ్రీ తాతాచార్యులవారు రాజనీతిజ్ఞులై వ్యవహరించి , రాజ్యపాలనా విధానములో శ్రీ భూపతులవారికి సలహాలిచ్చుచూ వారిని సన్మార్గమున నడిపించుచుండేవారు.
శైవమతావలంబులైన శ్రీ అయ్యప్ప దీక్షితుల వారేమో యజ్ఞయాగాది క్రతువులను ప్రభువుల వారిచే చేయించుచూ దేశమును , దేశప్రజలను , రాజ్యాంగమును దైవానుగ్రహపాత్రులు గావించుచుండేటి వారు. ఒక సారి శ్రీ భూపతులవారు పైన చెప్పబడిన అపూర్వ శాస్తా వారి ఆలయములోని శిలాఫలకము గురించి విని ఆశ్చర్యము చెంది. ఆ స్థలాన్ని దర్శించుకోవాలని నిర్ణయించి తన గురువర్యులిరువురితో సహా బయలుదేరెను. మార్గమధ్యములో శైవ , వైష్ణవ బేధములేక అనేక దేవాలయములను దర్శనము చేసుకొనుచూ కరుణాసముద్రుడు , కలియుగ ప్రత్యక్షదైవం , శైవ , వైష్ణవ సంగమ స్వరూపి అయిన శ్రీ అపూర్వ శాస్తావారి ఆలయము చేరుకొనిరి. ఆలయమున ప్రతిష్ఠించబడిన మూలవిగ్రహమగు శ్రీ శాస్తావారి బింబము ఒక వింత విగ్రహములా ముక్కుమీద వేలుపెట్టుకొని మిక్కిలి విచారముతో ఏదో దీర్ఘముగా ఆలోచించు ధోరణిలో యుండినది గాంచిన భూపతులవారు ఆలయ నిర్వాహకులతో ఇచ్చటి స్థలపురాణమేమని అడిగెను.
అందులకు ఆలయ నిర్వాహకులు "ప్రభో ! ఈ ఆలయము మిక్కిలి పురాతనమైనది. ఈ విగ్రహము చాలాకాలం క్రితం చెక్కించబడినది. ఒక పెద్ద దేవాలయం నిర్మించే పనులలో యుండగా ఈ విగ్రహం చెక్కించిన స్థపతికి అయ్యప్ప శాస్తా ఇలా ఏదో యొక విషయమై దీర్ఘాలోచనలో యుండే భంగిమలో దర్శనమిచ్చినారట. ఆ ఆలోచనకు కారణమేమని శిల్పి అడగలేదో యేమోకాని తనకు దర్శనమిచ్చిన భంగిమతోనే ఈ మూర్తిని చెక్కించి ప్రతిష్ఠింపజేసి నారట. ప్రతిష్టానంతరం స్థాపితమైన ఆ మూర్తిని దర్శించుకొనిన శిల్పికి నేనెందుకిలా ఆలోచిస్తూ కూర్చున్నాననే సంగతిని లోకులకు తెలిపే సర్వజ్ఞులొకరు భవిష్యత్తులో ఇచ్చటికి వస్తారు. వారు నా విచారమునకు కారణమేమను రహస్యమును తెలుపుతారు. అపుడు నాముక్కుమీద నుంచి వేలుతీసి , సర్వ ఆలయములలో యున్నట్లు చిన్ముద్ర వహిస్తాను. అతని మాటలే వాస్తవము. అతడే సర్వజ్ఞుడు అని లోకులు గుర్తించాలి" అని అనిపించినదట. అది ఇచ్చట శిలాఫలకంగా చెక్కించబడి యున్నది. అందువలననే ఈ స్థలములోని శాస్తావారిని దర్శించుకొనేవారు వారివారి మనస్సులో కలిగే అభిప్రాయమును తెలపాలియనియు చెక్కించి వెడలినారు.
తదుపరి ఎందరో మహనీయులు ఈ స్థలమునకు వచ్చి శ్రీస్వామి అయ్యప్పను దర్శించుకొని శ్రీస్వామివారి చింతనకు ఏవేవో కారణాలను చెప్పిరి. కాని అవన్నియు సరియైన కారణాలు కాకపోవడముతో ఈ శాస్తావారు ముక్కు మీదనుండి చేతులు తీయకనేయున్నారు. ఆ మహనీయులెవరో ఎపుడు వస్తారో అని అనిరి. తదుపరి ఆలయములోనికి వెళ్ళి పూజాదులు ముగించి.. శ్రీస్వామివారిని దీపారాధనలో దర్శించుకొనువేళ భూపతి వారి మనస్సులో నా ఈస్థితికి కారణమేమని నీ గురువర్యులను అడిగి తెలుసుకో అని అనిపించెను. వెంటనే శ్రీభూపతులవారు తాతాచార్యులను చూపెను. భూపతిగారి మనోగతాన్ని గ్రహించిన తాతాచార్యుల వారు మరోమారు ఆ అపూర్వ విగ్రహాన్ని చూసి యొక కారణాన్ని కల్పించి క్రింది శ్లోకరూపంలో చెప్పెను.
విష్ణోః సుతోహం విధినా సమోహం ధన్యస్తతోహం సురసేవితో హం ॥* *తథాభి భూతేశ సుతోహ మేతైర్ భూతైర్ వృతశ్చింత యతీహ శాస్తా ||
శ్రీశాస్తా వారి విచారమునకు కారణమేమనగా ఇదియేనని శ్రీతాతాచార్యుల వారు శ్రీశాస్తావారు చెప్పినట్లుగానే శ్లోకమును చేసియున్నారు. శాస్తావారు ఏమి చెబుతున్నారంటే.... "నేను శ్రీమహావిష్ణుసుతుడను కావున బ్రహ్మకు సమమైన వాడను. అందువలన నేను ధన్యత చెందుచున్నాను. దేవతలందరి చేతను మ్రొక్కబడుచున్నాను. కాని...... “తథాభియని శ్లోకములో వచ్చేపదానికి “ఐనను” “కాని” అని అర్థం చెప్పుకోవలెను. తనగొప్పతనాలన్నిటిని చెప్పుకొంటూ వచ్చిన శాస్తావారు కాని అని ఆపేసారంటే తరువాత తన విచారమునకు అసలు కారణం చెప్పబోతున్నారనియే గదా అర్థం. అందులోనే శ్రీ తాతాచార్యుల వారికి శివ సంబంధిత విషయములో సదభిప్రాయము లేదనునది స్పష్టమగుచున్నది. కాని.... నిలిపిన శాస్తా ఏమంటున్నారో తాతాచార్యుల ముఖదా విందాము. "కాని... నేను స్మశానవాసి , కరిచర్మాంబరదారి యగు శివుని కుమారుడు" అనిగూడా చెప్పుకొనవలసి యున్నదే "తథాభి భూతేశ సుతోహం" శివుడు , పరమేశ్వరుడు , శంభు , ఉమాపతి , పశుపతి , సాంబశివుడు , నటరాజుడు , దక్షిణామూర్తి యని కైలాసవాసునికి ఎన్నెన్నో అందమైన నాముబులుండగా భూతేశుడనియో శ్లోకములో చెప్పబడియున్నది. స్మశానవాసి , భూత బంధముల నాయకుడు అనియే ఈశ్వరుని సంబోధించి యున్నారు. అలాంటివాని పుత్రునిగాను నేను వున్నానే అని శ్రీశాస్తావారు , తన విచారాన్ని వ్యక్తం చేస్తున్నట్లు శ్లోకవాక్యములు చెబుతున్నది.
భూతగణములను అణచిపెట్టి అందులకు నాయకులై ఒకరున్నారంటే నిజానికి అదియు వారియొక్క గొప్ప ప్రభుత్వశక్తిని , అధికార సంపదను ఎలుగెత్తి చెప్పేటిదియే అగును. శ్రీపరమేశ్వరులు , భూతగణములు జనులను హింసించక కాపాడే వారేగాని వాటిని విచ్చలవిడిగా విడిచిపెట్టేవారు కాదు మనలను దుష్టశక్తులు ఆవహించి దెబ్బతీయక వాటిని అరికట్టి పాలించి నందువలననే వారిని భూతపతి యని పిలిచి మ్రొక్కుచున్నాము. భూతేశుడైన పరమేశ్వరునికే మహాదేవుడని పేరు గలదు. దేవతలందరికి పెద్దవారాయన తన ముగ్గురు తనయులలో పెద్దవానికే దేవగణాధిపత్యమిచ్చి గణనాథుడు గావించియున్నారు. రెండవవాడైన సుబ్రహ్మణ్య స్వామికి దేవ సేనాధిపత్యమిచ్చి దేవనాథుడుగా గావించియున్నారు. భూత గణములో యొక విభాగమును మూడవ తనయుడగు శ్రీశాస్తాకు ఆధిపత్యమిచ్చి భూతనాథుడుగా గావించియున్నారు.
సులభముగా లొంగని భూత సంఘమును అణచి పాలించుటయన్నది శ్రీ శాస్తావారికి కీర్తి కల్గించేపనియే. క్షుద్రగుణగణములు గల్గిన దుర్దేవతలు జనావాసములో ప్రవేశించి , హింస చేయక వాటిని తన అదుపులో పెట్టి గ్రామ రక్షణ దేవతయై గ్రామ పొలిమేరులో యుంటూ శ్రీశాస్తావారు లోకపావనం చేయుచున్నారు. కాని శివ సంబంధమైన సద్విషయాలలో తాతాచార్యుల వారికి సదభిప్రాయము లేదు గనుక ఇదియే ముక్కుమీద వేలు పెట్టుకొనియున్న శాస్తావారి చింతకు కారణమని శ్లోకముద్వార చెప్పెనురాచర్ల రమేష్
గొప్పఖ్యాతి సంపన్నుడైన విష్ణుపుత్రుడై బ్రహ్మ సమానుడై సర్వదేవతా నమస్కార స్వీకృతుడై యుండినను ఈ భూతపతిసుతుడై యున్నందువలన సదా దుష్టభూతగణ బృందము మధ్య యుండవలసివచ్చినదే. “ఏతైర్ భూతైర్ వృత్తః" యనిశ్లోకములో వచ్చుటకు అట్టి భూతగణములు చుట్టుముట్టియుండగా మధ్య నేనుండవలసివచ్చినదే యనియే శ్రీ శాస్తావారు ముక్కుమీద వేలుపెట్టి చింతించే భంగిమలో అమరియున్నారు. "చింతయతీహశాస్తా" యని తాతాచార్యులవారు ముగించిరి. కాని ఆ మాటలకు (శ్లోకానికి) శ్రీశాస్తావారి బింబము తనముక్కుమీద నుండి వేలుతీసి వేయలేదు. ఏలనగా...... వారి ఆలోచన ప్రకారం అర్థంచేసుకొన్నట్లు , భూతసంఘ పరివారముతో యుంటూ గ్రామ రక్షణ భారం వహించుట యనునది శ్రీ శాస్తావారికి కీర్తిని తెచ్చిపెట్టేదేగాని విచారాస్పదం కాదు. కావుననే శాస్తా విగ్రహం తాతాచార్యులవారు చెప్పిన కారణం సరియైనది కాదు - అన్నట్లు వ్రేలు మార్చక అలాగే యుండిపోయినది. తదుపరి శ్రీభుక్క భూపతులవారు శ్రీ అయ్యప్ప దీక్షితుల వారితో మీ అభిప్రాయాన్ని గూడా తెలుపండి అని ప్రార్థించెను. మరోమారు క్షుణ్ణంగా శ్రీశాస్తావారి విగ్రహాన్ని భక్తితో దర్శించుకొన్న దీక్షితులవారికి శాస్తావారి చింతనకైన అసలుకారణం స్పూర్తించెను. వెంటనే శ్లోకరూపముగా దాన్ని తెలిపిరి. శ్రీతాతా చార్యులవారు చెప్పినట్టే శ్రీ శాస్తావారి వచనములుగానే ప్రారంభించి చెప్పసాగెను.
అంబేతి గౌరీ మహ మాహ్వయామి పత్యైః పితుర్మాతర ఏవసర్వాః |*
*కథన్ను లక్ష్మీమితి చింత యంత శాస్తార మీధే సఖలార్ధ సిద్యై ||
పై శ్లోకము అప్పయ్య దీక్షితులు వారి నోటనుండి వెలువడిన క్షణమే "అవును ! ఇదియే సుమా నావిచారము. నా ఈ ఆలోచన అందులకే. ఈయన చెప్పిందే సత్యము" అన్నట్లు ఆ అపూర్వ శాస్తా భంగిమలో అమరియున్న శ్రీ అయ్యప్పస్వామివారు ముక్కుమీద నుండి వేలుతీసి చిన్ముద్ర ధరించెను. లోకులకు ధర్మాన్ని శాసించి నేర్పించే శ్రీశాస్తావారే విచారపడుతూ "ఇదేమిటి దీనికి సరైన సమాధానం లభించదా ? యని ముక్కుమీద వేలుపెట్టుకొని దేనిని గూర్చి ఆలోచించుతూ యున్నట్లు దీక్షితులవారు తన శ్లోకములో వివరించారంటేగౌరీదేవిని నేను "అమ్మా" అని పిలువగలను.
అంభేతి అంబయితి -- అమ్మా అని , అహ్వయామి - పిలువ గలను. వాస్తవానికి విష్ణుమాయలోని మోహినియే నాకు జన్మనిచ్చిన తల్లి. అయినను తండ్రికి ఎంతమంది పత్నిలున్ననూ అందరూ అమ్మవరుసే అగుతారు. ఎలా శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవినే గాక , కైకేయి , సుమిత్రలను గూడా కన్నతల్లిగానే ఎంచి “అమ్మా” యని పిలువలేదా ? విఘ్నేశ్వరుడు గంగను తల్లిగా ఎంచలేదా ? అలాగే నా తండ్రియగు పరమేశ్వరుని పత్నియగు గౌరీదేవిని నేను "అమ్మా" అని పిలువగలను. ఈశ్వరుని తండ్రిగాను , మహావిష్ణువును తల్లిగాను పొందిన నాకు పరాశక్తి ఏమి వరస అవుతుందిని ఆలోచిస్తూ కూర్చోపనిలేదు. పత్న్యః పితుర్మాతుర ఏవసర్వాః తండ్రియొక్క భార్యలందరూ తల్లులే అవుతారు. కావున గౌరీదేవిని అమ్మా అను వరుసతో పిలిచి ఆనందము చెందగలను. "అంబేతి గౌరీమహమహ్వా యామి."
ఐతే ఇదీ వరుస అని దలచి పిలువలేని , ఎంత ఆలోచించిన బోధపడని బంధమొకటి యున్నది. ఆ బంధమేమిటి ? శాస్తావారు ఎవరిని వరుసపెట్టి పిలువలేకపోవుచున్నారు. లక్ష్మిం ! "లక్ష్మీదేవిని నేను ఏ వరుసపెట్టి పిలవాలి ? కథన్నులక్ష్మీం" ఇదియే శాస్తావారి విచారము ముక్కుమీద వేలుపెట్టుకొని దీనికి సమాధానమెలా కనిపెట్టేది ? యని దీర్ఘాలోచనలో పడ్డది. ఎందుకంటే -- నేను లక్ష్మీదేవిని ఏవరుసపెట్టి పిలవాలన్నది అర్థంగాకనే. మనకు గూడా అర్థంకాలేదు కదూ ? ( లక్ష్మీదేవి ఎవరు ? విష్ణుపత్ని , మహావిష్ణువుకు , శాస్తావారికి గల బంధమేమిటి ? తల్లిబిడ్డలు సాక్షాత్ మహావిష్ణువే మోహిని అవతారమెత్తినపుడు శ్రీ పరమేశ్వరునితో కలిసి శాస్తావారిని కలుగజేసిరి.
కావుననే వీరికి హరిహరసుతుడు అను కారణనామము ఏర్పడినది. అటులైనచో లక్ష్మీదేవి శాస్తావారికి ఏమౌతుంది ? తల్లియొక్క పత్ని అగుతూంది. ఇందు ఆశ్చర్యమేమనగా తండ్రిగారి భార్య , పినతండ్రిగారి భార్య , మేనమామ భార్య , అన్నయ్య భార్య , తమ్ముని భార్య , బావమరిది భార్య , స్నేహితుని భార్య యని చెప్పగా వినియున్నాం. వీళ్లను అమ్మ , పిన్నమ్మ , మేనత్త , వదిన , మరదలు , సోదరియని వరుసపెట్టి పిలుస్తుంటాము. అమ్మ యొక్క భార్య అని చెప్పగా , పిలువగా వినియున్నామా ? ఈ శాస్తావారికి మాత్రమే ప్రపంచములో ఇంకెవరికీ లేని విచిత్రముగా అమ్మగారి భార్య అనబడు లక్ష్మీదేవియున్నారు. ఆమెను శ్రీశాస్తావారు ఏవరుసపెట్టి పిలువగలరు ? కథన్ను లక్ష్మీ - లక్ష్మీ దేవిని ఏవరుస పెట్టి పిలువగలను ? ఇదియే శాస్తావారి విచారము. ఇదియే వారి దీర్ఘాలోచనకు అసలు కారణం అన్నారు. అంతటితో ఆపినారా అంటే లేదు.
'ఇతి చింత యంతం శాస్తారం ఈదే ఈ విశ్వమంతయూ పరిపాలించి పోషించువారు. వామనమూర్తియై వచ్చి తన ఒక్క పాదముతో ఈ విశ్వమంతయూ కొలిచినట్టివారు , యధాయధాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థాన మధర్మస్యతదాత్మానం సృజామ్యహం అని మురాసురుడు , బాణాసురుడు , రావణాసురుడు మొదలగు రాక్షసుల వలన లోకానికి ధర్మగ్లాని కలిగినపుడు సాకార అవతారము గైకొని వార్లను సంహరించి లోకానికి మేలుగూర్చినవారు. ఈ జగన్నాటక సూత్రధారి అయినటువంటివారు. సమస్త సంపదలకు నిలయమైన లక్ష్మీదేవి యొక్క భర్త అయినట్టివారు. అలంకార ప్రియులు , శంఖుచక్ర గదాదారి , నీలమేఘ శ్యాములు , సౌందర్యం స్వరూపులు అయిన మోహిని సుతుని ఈడే సకలార్ధ సిద్యై అని ముగించారు. అనగా సకల విధములైన పురుషార్థ సిద్దులు పొందదలచినవారు. శ్రీ శాస్తావారిని ఆశ్రయిస్తే అర్థంకాని తత్వములు గూడా అర్థమగును. కావున శాస్తావారిని ఆశ్రయించి మ్రొక్కుచున్నాను. అని ముగించారు. దీక్షితులవారి శ్లోకములో "శివకేశవ భేదముగాని , హెచ్చుతగ్గులైన భావ బేధము గానీ లేదు. పరమేశ్వరిని లక్ష్మీదేవిని ఒకేలాగ వర్ణించి యున్నారు.
దానితో దీక్షితుల వారు తన శ్లోకములో బుద్ధి చాతుర్యమును మాత్రమేగాక భక్తి పారవశ్యాన్ని గూడా కలిపి సకలార్థసిద్ధి కొరకు శ్రీశాస్తావారిని ఆరాధించుచున్నాను" అని చెప్పియున్నారు. "ఎందుకొరకు వారిలా ముక్కుమీద వ్రేలెట్టుకొని కూర్చున్నారన్నది. అర్థంకానపుడు , సకల అర్థములు సిద్ధించుటకు వారివద్దనే వేడుకొనునట్లు వినయముగా చెప్పడములోని పరమార్ధము ఏమనగా వారి కృపయుంటే తప్ప వారిని గూర్చిన రహస్యములను మన బుద్ధిచాతుర్యము వలన మాత్రము కనిపెట్టలేము" అనునదియే.
అన్నిటికన్నా మిన్నగా దీక్షితులు చెప్పిన కారణమును ఇంతవరకు
ఏ మేధావియూ కనిపెట్టలేదుగదా ! ఇంకనూ ఎవరైనా కనిపెట్టగలరా ? అమ్మ యొక్క భార్యను ఏవరుసపెట్టి పిలవాలి అని ఎంత ఆలోచించినా సమాధానము లభించునా ? నిజానికి సమాధానము లేని ఈ ప్రశ్న శాస్తావారి మదిలో కలిగి , దీర్ఘాలోచనలో మునిగి ముక్కుమీద వేలుపెట్టుకొనియుండు స్థితిలో స్థపతికి దర్శనమివ్వగా ఆస్థపతి దానినలాగే శిలావిగ్రహముగా చెక్కించియుంటాడు. కావుననే దీక్షితులవారు స్వామి విచారమునకు అసలు కారణాన్ని కనిపెట్టి చెప్పగానే అదియే నిజమన్నట్లు బింబము తనముక్కుమీద నున్న వ్రేలును చటుక్కున తీసి అన్ని దేవాలయాలలో వున్నట్లు చిన్ముద్ర దాల్చేను..
ఒకరాతి విగ్రహము శ్లోకము విని ముక్కుమీద నుండి వ్రేలుతీసి వేయగానే అచ్చట గుమిగూడి యున్నవారందరూ మహదాశ్చర్యము చెందిరి. శ్రీభుక్క భూపతులవారు ఆమహాద్భుతాన్ని తిలకించి , ఆనందోత్సాహము చెంది , శిలాఫలకములో వ్రాయబడిన మహనీయులు శ్రీ అప్పయ్య దీక్షితుల వారైనందులకు ఎంతో ఆశ్చర్యపడి అందరూ ముక్కుమీద వ్రేలుపెట్టుకొనిరి. అప్పటినుండి శ్రీ అప్పయ్య దీక్షితులవారి నామము లోక ప్రసిద్ధమైనది. శ్రీ తాతా చార్యులు గూడా శివకేశవులు అబేధమును గ్రహించి , శివనింద చేసినందులకు పశ్చాత్తాపపడి , పరమేశ్వరుని పలురీత్యా ప్రార్ధించి తరించిరి. సేకరణ రాచర్ల రమేష్
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి