*సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*
*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*
*346 వ రోజు*
*కర్ణ సహదేవుల పోరు*
కర్ణుడు సహదేవునితో తలపడ్డాడు. సహదేవుడు కర్ణుని తొమ్మిది బాణములతో కొట్టాడు. కర్ణుడు సహదేవుని నూరు బాణములతో మర్మస్థానములలో కొట్టి సహదేవుని ధనస్సును ముక్కలు చేసాడు. సహదేవుడు మరొక విల్లందుకున్నాడు. కర్ణుడు సహదేవుని సారథిని, రథాశ్వములను చంపాడు. సహదేవుడు కత్తి డాలు తీసుకున్నాడు. కర్ణుడు వాటిని ముక్కలు చేసాడు. సహదేవుడు కర్ణుని మీద గదాయుధాన్ని విసిరాడు. కర్ణుడు ఆ గదను మధ్యలోనే తుంచాడు. సహదేవుడు కర్ణుని మీద శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. కర్ణుడు దానిని ముక్కలు చేసాడు. ఇక చేసేది లేక సహదేవుడు రథచక్రాన్ని కర్ణుని మీద వేసాడు. కర్ణుడు దానిని కూడా తన బాణ్ములతో ముక్కలు చేసాడు. కర్ణునితో యుద్ధం చేయలేక సహదేవుడు అక్కడ నుండి తప్పుకుంటున తరుణంలో కర్ణుడు అతడిని వెంబడించి పట్టుకుని చంపబోయి కుంతికి ఇచ్చిన మాట గుర్తుకు వచ్చి చంపకుండా వదిలి హేళనగా " సహదేవా! నీ బలం ఎదుటి వాని బలం తెలుసుకుని యుద్ధం చెయ్యి. నీ కన్నా బలవంతులతో యుద్ధం చెయ్యడం అవివేకమని తెరులుసుకో పో " అని పంపాడు. సహదేవుడు అవమానభారంతో కుమిలి పోతూ అక్కడ నుండి వేరొక రథము ఎక్కి వెళ్ళాడు.
*శల్యవిరాటుల యుద్ధం*
శల్యుడు విరాటునితో యుద్ధం చేస్తూ విరాటుని అశ్వములను చంపాడు. శల్యుని మీద విరాటుడు శరములు గుప్పించాడు. విరాటుని తమ్ముడు శతానీకుడు అన్నకు సాయంగా వచ్చి విరాటుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. శల్యుడు వాడి అయిన బాణమును ప్రయోగించి శతానీకుని సంహరించాడు. తమ్ముని మరణం విరాటునిలో భయం కలిగించినా పైకి ధైర్యంగా ఉండి శల్యుని ఎదుర్కొన్నాడు. శల్యుడు పదునైన బాణమును ప్రయోగించి విరాటుని మూర్చిల్లేలా కొట్టాడు. విరాటుని రథసారథి రథమును పక్కకు తీసుకు వెళ్ళాడు. విరాటుని సేనలు శల్యుని ధాటికి ఆగ లేక పక్కకు తొలిగాయి. అది చూసి అర్జునుడు ఆ సైన్యములను ఆపి శల్యునితో తలపడ్డాడు. అలంబసుడిని ఎదుర్కొన్న అర్జునుడు అతడి విల్లు కేతనమును విరిచి, హయములను చంపాడు. అలంబసుడు ఒక కత్తి తీసుకుని అర్జునుడితో తలపడ్డాడు. అర్జునుడు ఆ కత్తిని విరిచి నాలుగు భయంకరమైన బాణములతో ఆ రాక్షసుని కొట్టాడు. అర్జునుడి ధాటికి ఆగ లేక అలంబసుడు పారి పోయాడు. నకులుడి కుమారుడు శతానీకుడు సుయోధనుడి తమ్ముడైన చిత్రసేనుడిని ఎదుర్కొని చిత్రసేనుడి కవచమును చీల్చి, కేతనము విరిచి, విల్లు విరిచాడు. చిత్రసేనుడు వేరొక విల్లందుకుని శతానీకుని మీద బాణ ప్రయోగం చేసాడు. శతానీకుడు చిత్రసేనుడి రథాశ్వములను, సారథిని చంపాడు. చిత్రసేనుడు శతానీకుని ఇరవై అయిదు బాణములతో శరీరం తూట్లు పడేలా కొట్టాడు. శతానీకుడు ఒకే బాణంతో చిత్రసేనుడి విల్లు విరిచి రథమును విరిచాడు. చిత్రసేనుడు రథము నుండి దూకి పక్కనే ఉన్న హార్దిక్యుడి రథము ఎక్కి పారిపోయాడు. ద్రుపదుడు కర్ణుని కుమారుడైన వృషసేనుని ఎదుర్కొన్నాడు. ద్రుపదుని మీద వృషసేనుడు పైచేయిగా ఉన్నాడు. ద్రుపదుని నిస్సహాయత చూసి పాంచాల సేనలు వృషసేనుడితో తలపడ్డాయి. కాని వృషసేనుడితో తలపడ లేక పారి పోయారు. దుశ్శాసనుడు ధర్మజుని కుమారుడైన ప్రతి వింధ్యుని ఎదుర్కొని అతడి ధ్వజమును, విల్లును విరిచి, సారథిని, హయములను చంపాడు. ప్రతివింధ్యుని సోదరులు అతడికి సాయంగా వచ్చి పోరుతున్నారు. భీముని కుమారుడైన శ్రుతసేనుడు ప్రతి వింధ్యుని తన రథము మీద ఎక్కించుకున్నాడు. ప్రతివింధ్యుడు మరొక విల్లందుకుని దుశ్శాసనుడితో తలపడ్డాడు.
*రేపు *
*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*
*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి