14, ఏప్రిల్ 2025, సోమవారం

నేనొక నిరంతర ప్రవాహిని...!

 నేనొక నిరంతర ప్రవాహిని...!!


నేనొక నిరంతర ప్రవాహిని 

నీటి ఊటలా జన్మించి తరించా 

ఈ నేలపై దిమ్మరిలా తిరుగుతూ 

సజీవ గీతాన్ని ఆలపిస్తున్నాను...


వాగుల్ని వంకల్ని కలుపుకుంటూ 

నా ఆకారం పెద్దదిగా చేసుకుంటూ 

నా బలాన్ని బలగాన్ని పెంచుకుంటూ 

నేలపై నా నడకలు కొనసాగిస్తున్నాను..


ఆకుపచ్చ అందాలను సృష్టించి 

పంటచేల మధ్య పరవశిస్తూ 

రైతన్న బ్రతుకులకు రాగాన్ని 

అనంత రాశులకు వర్తమాన గీతాన్ని...


గత చరిత్రకు ఆనవాళ్లుగా 

భవిష్యత్ తరాలకు సంస్కృతిగా 

నన్ను నేను రూపాంతరం చెందుతూ 

విరామ మెరుగక ప్రవహిస్తున్నాను..


నా స్వేచ్ఛ నాకే సొంతం 

నన్ను బంధిస్తేనే ప్రళయం 

పూజిస్తే పుణ్యఫల ప్రదాయినినీ 

మీ ఇంట సిరులు సమకూర్చే సంపదను..


కొండల గట్టులతో చెలిమి చేస్తూ 

జలపాతపు సొంపుల సోయగంతో కదులుతూ 

మృదంగ నాదంలా దూకుతూ 

సరిగమలై సరసరా కదలి పోతాను..


నా ఊపిరిని మీ ఎదపై వీణలా వినిపిస్తూ 

పచ్చని అనురాగాల గాలులను స్పర్శిస్తూ 

అనుభూతుల మాధుర్యాన్ని పంచుతూ 

ప్రకృతిలో మమేకమై కొనసాగుతాను..


మట్టి భాషలో మాట్లాడుతూ 

అమ్మలా అనురాగాలు పంచుతూ 

పల్లెల్లో కబుర్లు చెప్పుకుంటూ 

అనంత ఆనందాన్ని సమకూర్చుకుంటా...


నా దారి సముద్ర గమ్యం వరకు 

విముక్తి గీతాన్ని ఆలపిస్తూ 

ముక్తికై వడివడిగా అడుగులు వేస్తూ 

అమృత ధారలను పంచి నేలను విడుస్తాను..


కానీ నా పుట్టుకకు దారులు మళ్లిస్తూ

అడుగడుగునా అవాంతరాలు సృష్టిస్తూ 

నన్ను నన్నుగా తిరగనీయకుండా

కబంధ హస్తాల్లో బంధిస్తున్నారు...


నా ప్రవాహం నేడొక ప్రశ్నార్థకం? 

నాలో విషాన్ని చేర్చి క్షీణింప చేస్తూ 

నా కడుపు నిండా కాలుష్యాన్ని నింపుతూ 

నా ప్రాణాలను చిన్నగా హరిస్తున్నాడు ఈ మనిషి...


కొప్పుల ప్రసాద్ 

నంద్యాల 

9885066235

కామెంట్‌లు లేవు: