13, మే 2025, మంగళవారం

తిరుమల సర్వస్వం -237*

 *తిరుమల సర్వస్వం -237*

*ద్వాదశ ఆళ్వారులు-2* 

2  ముని వెనుదిరగడంతో భూమాతకు ఏర్పడిన సంక్షోభం తొలగి పోయింది గానీ, విశ్వకర్మ శాపఫలితంగా అప్పటివరకూ అప్రతిహతంగా చలామణిలో ఉన్న ద్రావిడభాష మాత్రం తన ప్రాభవాన్ని సమూలంగా కోల్పోయింది. కేవలం పామరులు, పిశాచగణాలు ఉపయోగించుకునే భాషావశేషంగా మిగిలిపోయింది. తన మానసపుత్రిక యైన 'ద్రావిడభాష' కు పట్టిన దుస్థితికి తీవ్రంగా కలత చెందిన అగస్త్యముని అనితర సాధ్యమైన తపమాచరించి, ఆ భాషను పునరుద్ధరింప జేయవలసిందిగా శ్రీమహావిష్ణువును అభ్యర్థించాడు. లోకకళ్యాణార్థం అగస్త్యుని కోర్కెను మన్నించిన శ్రీమహావిష్ణువు ద్రావిడభాషకు పూర్వవైభవాన్ని సంతరింపజేయడానికై పూనుకున్నాడు. తదనుగుణంగా శ్రీహరి ఆదేశానుసారం వారి ఆయుధాలు, ఆభరణాలు, పరివార సదస్యులు వీరంతా ద్రావిడదేశంలో దివ్యపురుషులైన ఆళ్వారులుగా జన్మించి, శ్రీహరిని స్తుతిస్తూ వేలాది కీర్తనలు, పెక్కు గ్రంథాలు ద్రావిడభాషలో రచించి, వాటికి పండిత పామరులలో విశేషంగా ప్రాచుర్యం కల్పించి ఆ భాషకు తిరిగి ఔన్నత్యాన్ని కల్పించారు. తద్వారా మృతభాషగా నున్న ద్రావిడభాష పునరుజ్జీవం పోసుకొని, అగస్త్యుని చిరకాల స్వప్నం సాకారమైంది. ఆ విధంగా ఆళ్వారులందరూ ద్రావిడదేశం లోనే జన్మించడం, ద్రావిడభాష లోనే తమ సాహితీ సాధనను కొనసాగించడం శ్రీహరి ఆదేశం మేరకే జరిగిందన్న మాట.


 *నాలాయిర దివ్యప్రబంధం*  


 ఆళ్వారులందరూ శ్రీహరిని, శ్రీవేంకటేశ్వరుణ్ణి స్తుతిస్తూ రచించిన కీర్తనలనూ, పాశురాలనూ తరువాతి కాలంలో సేకరించి ఈనాడు తమిళులకూ, శ్రీవైష్ణవులకూ, వైష్ణవభక్తులందరికీ పరమ పూజనీయమైన 'నాలాయిర దివ్యప్రబంధం' అనే పాశురాల సంకలనం వెలువరించబడింది. ఈ సంకలనంలో, ఇరవైనాలుగు ప్రబంధాల యందు పొందుపరచబడి యున్న నాలుగువేల పాశురాలలో కొన్నింటిని నేటికీ వైష్ణవక్షేత్రాలన్నింటిలో నిత్యమూ పఠిస్తారు. ఈ నాలుగు వేల పాశురాల లోని 206 పాశురాలలో శ్రీవేంకటేశ్వరుడు కీర్తించబడ్డాడు. *'నాలాయిర'* అనే తమిళపదానికి *'నాలుగు వేలు'* అని అర్థం. అలాగే, 'పాశురం' అంటే 'పద్యము' లేదా 'శ్లోకము'; తీయని స్వరం అనే అర్థాలున్నాయి. ధనుర్మాసంలో వైష్ణవాలయాలన్నింటిలో పఠించే, మనకు సుపరిచితమైన, ముప్ఫై పాశురాల సమాహారం *'తిరుప్పావై'* నాలాయిర దివ్యప్రబంధంలో అంతర్భాగమే..


 ఈ పాశురాలకు విశేషమైన పౌరాణిక ప్రాధాన్యతతో పాటుగా, చారిత్రక ప్రాశస్త్యం కూడా ఉంది. వీరి రచనల ద్వారా తిరుమలకు, శ్రీరంగానికి, కాంచీపురానికి, మరెన్నో వైష్ణవ క్షేత్రాలకు సంబంధించిన చారిత్రకాంశాలు సైతం వెలుగు చూశాయి. 'నాధముని' అనే విష్ణుభక్తుడు ఈ దివ్యప్రబంధాన్ని పండితపామరులందరూ రాగయుక్తంగా పాడుకునే వీలుగా రాగాన్ని, తాళాన్ని సమకూర్చి తరించాడు.


 *పుట్టు పూర్వోత్తరాలు* 


 ఆళ్వారులందరూ తమిళదేశం లోనే జన్మించినప్పటికీ, వీరందరూ సమకాలికులు కాదు. వీరి జీవితకాలం గురించి చరిత్రకారుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. వీరు మూడవ శతాబ్ది నుండి తొమ్మిదవ శతాబ్దానికి చెందినవారని కొందరు అభిప్రాయపడతారు. కాగా వీరు ఏడు నుండి తొమ్మిది శతాబ్దాల కాలంలో జీవించియున్నారని చాలామంది చరిత్రకారులు భావిస్తారు. అలాగే, వీరి సంఖ్య 'పన్నెండు' అనే విషయంలో స్థూలంగా ఏకాభిప్రాయ మున్నప్పటికీ, ఈ పన్నెండు మంది 'ఎవరెవరు?' అనే విషయంలో స్వల్పంగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


 ఈ అళ్వారులందరూ జన్మతః శ్రీవైష్ణవులు కాదు. వీరు శ్రీవైష్ణవ సంజాతుల నుండి అంత్యజుల వరకూ; సుక్షత్రియుల నుండి చోరాగ్రేసరుల వరకూ; అలాగే పుట్టుక తోనే విష్ణువుభక్తిలో తల్లీనమైన వారినుండి వేశ్యాలోలత్వానికి గురియైన వారి వరకూ; ఇలా భిన్నమైన నేపథ్యాలు కలిగినవారు. కానీ, వీరందరినీ ఏకసూత్రంలో బంధించే విశేషమైన సారూప్యతలు కూడా అనేకం ఉన్నాయి. రందరూ శ్రీమహావిష్ణువును సాక్షాంత్కరింప జేసుకున్నవారే!


 శ్రీవేంకటేశ్వరుని శ్రీమహావిష్ణువు కలియుగావతారంగా భావించి, తిరుమలేశుని తమ పాశురాలతో కీర్తించి తరించినవారే!


 పుట్టుకతో సంబంధం లేకుండా వీరందరూ శ్రీహరిని సేవించుకుని, శ్రీవేంకటేశ్వరుని భక్తితత్వాన్ని విశేషంగా వ్యాప్తిచేసి ఆనాడు సమాజంలో విస్తృతంగా వ్రేళ్ళూనికుని ఉన్న కులవ్యవస్థకు, వర్ణాశ్రమధర్మాలకు పెను సవాలు విసిరి; ముక్తిమార్గాన్ని పొందడానికి కులం, పుట్టుకలతో సంబంధం లేదని, హరినామస్మరణతో, నిరంతర సాధనతో మోక్షాన్ని పొందవచ్చని నిరూపించారు.


 జన్మ రీత్యా విభిన్నమైన నేపథ్యాలు, జీవనగమనం రీత్యా పరస్పర విరుద్ధమైన దృక్పథాలు కలిగిన ఆళ్వారులందరూ తరువాతి కాలాలలో శ్రీవైష్ణవులకు తప్పనిరియైన *'పంచ సంస్కారాలను'* స్వీకరించి, శ్రీవైష్ణవులుగా పునర్జన్మ నొంది, శేషజీవితాన్ని శ్రీహరికి సమర్పించుకొని, తమ సంకీర్తనామృతంలో భక్తజనులను పరవశింప జేశారు. 


[ రేపటి భాగంలో ... *ద్వాదశ అళ్వారులు* - *పంచసంస్కారాలు,* గురించి తెలుసుకుందాం]


*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం* 


*రచన* 

*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*

ఫోన్ నెంబర్

99490 98406

కామెంట్‌లు లేవు: