దేహానివా? చైతన్యానివా?
శ్రీ రమణ కథామృతం
తేజోమూర్తి అయిన ఆ యువస్వామికి ఆకర్షితులైన వారిలో పళనిస్వామి అనే విరాగి ఒకరు. ఈయన మాతృభాష మళయాళం. స్వామి కన్నా దాదాపు ఇరవై సంవత్సరాలు పెద్దాయన. ఊళ్ళో గ్రంథాలయానికి వెళ్లి కొన్ని ఆధ్యాత్మిక విషయాలను చెప్పే గ్రంథాలను తెచ్చి స్వామికి ఇస్తూ ఉండేవాడు. అప్పటి వరకు ఏ ఆధ్యాత్మిక గ్రంథాన్ని చదవని రమణునకు పళనిస్వామి తెచ్చే పుస్తకాలలోని విషయాలు తనకి అనుభవ సిద్ధమైనవేనని తెలిసొచ్చింది. ఆ విధంగా గ్రంథపఠనం ప్రారంభమైంది.
తల్లిగారు వెళ్లిపోయిన తరువాత రమణులు అరుణగిరిపై నుండే గుహలలో నివాసమేర్పరచుకున్నారు. దాదాపు ఎనిమిది సంవత్సరాలు విరూపాక్ష గుహలో, ఆ తరువాత ఆరు సంవత్సరాలు స్కందాశ్రమంలో ఉండేవారు. మౌనంగా, ఎవ్వరితో మాట్లాడకుండా ఉండే ఆ స్వామిని దర్శించుకోవడానికి ఎందరో వచ్చేవారు. వీళ్లంతా ఆ మౌనస్వామి కంటే పెద్దవారే! వీళ్లలో ఇద్దరి, ముగ్గురి గురించి చెప్పుకుందాం.
స్వామి తిరువణ్ణామలైలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ఒక సాధువుండేవారు. ఆయన తరచూ స్వామిని కొండ మీదకు రమ్మంటూ ఉండేవారు. తీరా కొండపైకి స్వామి వెళ్లిన తరువాత ఆ సాధువు గ్రహించినదేమంటే ఇంతకు పూర్వం తన దర్శనానికి వచ్చే సామాన్యజనం ఇప్పుడు స్వామి దగ్గరకు వెళ్తున్నారనీ, తనని నిర్లక్ష్యం చేస్తున్నారని. అసూయను ఆపుకోలేక ఒకసారి స్వామి ముఖం మీద ఉమ్మేశాడు. పళనిస్వామి అతనిని కొట్టబోతే మౌనంగా సంజ్ఞలు చేసి స్వామి వారించారు. ఇదెట్లా సాధ్యమని మనం అనుకుంటాం. దేహం పట్ల ఏ విధమైన అభిమానమూ లేని ఆ మౌనస్వామిని ఆ సాధువు చేసిన అకృత్యం ఏమీ బాధపెట్టలేదు! ఇంతకూ ఆ సాధువు తన దేహాన్నే కదా అవమానపరచాడు? తానేమో చైతన్యస్వరూపుడాయె! స్వామి విరూపాక్షగుహలో ఉండగా ఆయనను దర్శించుకున్న వారిలో ముఖ్యులిద్దరి గురించి చెప్పుకుందాం. ఒకాయన శివప్రకాశం పిళ్ళై! ఇంకొకరు కావ్యకంఠ గణపతిముని! శివప్రకాశం పిళ్ళై పట్టభద్రుడు. కాలేజీలో ఫిలాసఫీ అధ్యయనం చేశాడు. ఆయన స్వామిని ఎన్నో ప్రశ్నలు వేస్తే పలక మీదో, నేల మీదో స్వామి సమాధానాలు రాసి ఇచ్చేవారు. వాటినన్నిటినీ భద్రపరచుకుని కొన్నేళ్ల తరువాత ‘‘నాన్ యార్’’(నేనెవరిని) అనే గ్రంథంగా రూపొందించారు పిళ్ళై. ఈ ప్రశ్నోత్తరాల సంగతి తరువాత చూద్దాం.
కావ్యకంఠ గణపతిముని రమణుల కంటే ఒక ఏడాది పెద్దవారు. కొన్ని సంవత్సరాలుగా తీవ్రమైన తపస్సు చేస్తుండేవారు. కాని ఆశించిన ఫలితం దొరకలేదు. చివరికి 1907లో మౌనస్వామిని ఆశ్రయించి, ‘తపస్సంటే ఏమిటి?’ అని ప్రశ్నించారు. గణపతిముని వైపు పదిహేను నిమిషాలు తదేకంగా చూసి మౌనస్వామి నోరు విప్పి మాట్లాడారు. అంటే అప్పటి వరకు (11 సంవత్సరాలు) మౌనంగా ఉన్న స్వామి మాట్లాడటం మొదలుపెట్టారన్నమాట! రమణులు ఇచ్చిన సమాధానమేమిటో, దాని పర్యవసానమేమిటో తరువాత చూద్దాం.(సశేషం) https://chat.whatsapp.com/CW3KU11WsA46NEQ246bxJc
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి