*శ్రీ కంచి పరమాచార్య వైభవమ్*
(నేడు శ్రీ కంచి పరమాచార్యులవారి జయంతి)
వైశాఖ బహుళ పాడ్యమి
🙏 *దైవం మానుష రూపేణ* 🙏
*దైవం కాషాయ వస్త్రం ధరిస్తే, దైవం ఎలాంటి అలంకారాలు లేకుండా నిరాడంబరుడిగా మారితే, దైవం సత్యం, ధర్మం అనే ఆయుధాలతో దర్శనమిస్తే, దైవం ఈ కలియుగంలో మానుష రూపంలో ప్రత్యక్షమైతే, ఆ దైవమే కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు. మానవ రూపంలో అవతరించిన దైవం.* 🙏
🙏 ఆయన భువిపై నడయాడిన దైవం. ఆయన కాషాయ వస్త్రం ధరించిన త్రిమూర్తి స్వరూపం. సాక్షాత్తూ ఆదిశంకరాచార్యుల ప్రతిరూపం. భారతావనిని తన దివ్య చరణ స్పర్శతో పునీతం చేసిన మహానీయుడాయన. దైవం కనులముందు నడయాడుతుంటే దర్శించి తరించిన భక్తులు కోట్లకొలది వున్నారు. అంతటి మహనీయులు *పరమాచార్య చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి.*
🙏 1894 వ సంవత్సరంలో దివినుంచి ఓ దివ్యజ్యోతి ప్రకాశిస్తూ భువిపై అవతరించింది. తమిళనాడులోని దక్షిణ ఆర్కాట్ జిల్లాలో ఉన్న విల్లుపురం అనే ఓ చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో జయనామ సంవత్సరం వైశాఖ బహుళ పాడ్యమి అనురాధ (అనుషం) నక్షత్రంలో జన్మించారు మహాస్వామి. స్వామివారి తల్లిదండ్రులు సుబ్రహ్మణ్య శాస్త్రి, మహాలక్ష్మీ అమ్మాళ్. ఆ పుణ్య దంపతుల ఆరుగురి సంతానంలో స్వామివారు రెండవ సంతానం. పరమాచార్యుల పూర్వాశ్రమ నామం స్వామినాథన్. తమిళనాడులోని ప్రసిద్ధ క్షేత్రం స్వామిమలై సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహంతో జన్మించారని ఆయనకు స్వామినాథన్ అని తల్లిదండ్రులు పేరు పెట్టారు.
🙏 బాల్యంలోనే తండ్రి వద్ద కర్ణాటక సంగీతాన్ని అవపోసన పట్టారు స్వామినాథన్. తల్లి మహాలక్ష్మీ అమ్మాళ్ వద్ద శ్లోకాలు, మంత్రాలు నేర్చుకున్నారు. స్వామినాథన్ ను వారి తల్లిదండ్రులు అనేకసార్లు కాంచీపురానికి తీసుకువెళ్ళే వారు.
🙏 ఒక సందర్భంలో కంచి కామకోటి పీఠం *66 వ పీఠాధిపతి శ్రీ చన్ద్రశేఖరేంద్ర స్వామి* వారి దర్శనానికి తల్లిదండ్రులతో పాటు స్వామినాథన్ వెళ్ళగా ఆ బాలుణ్ణి చూసిన జగద్గురువులు ఈ బాలుడు ఒక మహాత్ముడౌతాడు. కాంచీపుర పీఠాన్ని సైతం అధిరోహిస్తాడు, అని అన్నారట.
🙏 బాల్యంలోనే ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన స్వామినాథన్ ను చూసి అధ్యాపకులు ఆశ్చర్యపోయేవారు. స్వామివారి పెదతల్లి కుమారుడైన లక్ష్మీకాంతన్ ఋగ్వేదాన్ని అభ్యసిస్తున్నప్పుడు స్వామినాథన్ శ్రద్ధగా వినేవాడు. ఆ వినడంతోనే ఋగ్వేద మంత్రాలను నేర్చుకున్నారు.
🙏 1905 లో స్వామినాథన్ ఉపనయనం జరిగిన తరువాత సంస్కృత విద్యను అభ్యసించారు. ఓ సందర్భంలో స్వామినాథన్ జాతకాన్ని పరిశీలించిన ఒక జ్యోతిష్కుడు ఈ బాలుడు ప్రపంచమే పూజించేంతటి గొప్ప యోగి అవుతాడని చెప్పాడు. కంచి పీఠాధిపతుల అనుంగు శిష్యులైన లక్ష్మీకాంతన్ ప్రతినిత్యం పీఠాధిపతుల సేవలో తరించేవాడు. అతను చేసే కైంకర్యాలను స్వామినాథన్ శ్రద్ధగా గమనించేవాడు.
🙏 విల్లుపురంకు సమీపంలో దిండి వనంలో ఉన్న ఆర్కాట్ అమెరికన్ మిషన్ స్కూల్ లో ప్రాథమిక విద్యాభ్యాసం చేశారు స్వామినాథన్. బైబిల్ ను సైతం అక్షర దోషాలు లేకుండా చదివేవాడు. స్కూల్ లో చదువుకునే రోజులలో నాటక ప్రదర్శనలలో సైతం ప్రతిభను చాటుకున్నాడు.
🙏 కంచి కామకోటి పీఠం 66 వ పీఠాధిపతి శ్రీ చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ శివైక్యం చెందగానే స్వామినాథన్ పెద్దమ్మ కుమారుడు పద్దెనిమిదేళ్ళ లక్ష్మీకాంతన్ సన్యాసం స్వీకరించి 67 వ పీఠాధిపతిగా కంచికామకోటి పీఠాన్ని అధిరోహించారు. ఈ వార్త తెలియగానే లక్ష్మీకాంతం తల్లిని పరామర్శించడానికి స్వామినాథన్ తో కలిసి మహాలక్ష్మీ అమ్మాళ్ కలువై కు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో సంధ్యావందనం ఆచరిస్తున్న స్వామినాథన్ వద్దకు కంచి పీఠానికి చెందిన మునిరత్నం అనే సేవకుడు వచ్చి స్వామినాథన్ ను తనతో వెంటనే బయలుదేరి రావలసిందిగా కోరాడు. వారి తల్లి కోసం మరో బండి ఏర్పాటు చేసామని తెలియజేశారు. ఆ సేవకుడి వెంట బయలుదేరిన స్వామినాథన్ కు అసలు విషయం తెలుస్తుంది.
🙏 67వ పీఠాధిపతిగా కంచి పీఠాన్ని అధిరోహించిన లక్ష్మీకాంతన్ కూడా శివైక్యం చెందాడని. ఆ స్థానంలో తనను పీఠాధిపతిగా నియమించబోతున్నారని అర్థమౌతుంది.
🙏 66 వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్రుల అధిష్ఠానం వద్ద స్వామినాథన్ ప్రణమిల్లగానే ఆ బాలుడిలో ఓ జ్ఞానజ్యోతి వెలిగినట్లైంది. స్వామినాథన్ తండ్రికి టెలిగ్రాం ద్వారా విషయాన్ని జేరవేసిన మఠం సిబ్బంది స్వామినాథన్ ను పీఠాధిపతిగా నియమించేందుకు సంప్రదాయ క్రతువులు నిర్వహించారు.
🙏 ఫిబ్రవరి 13, 1907 లో కంచికామకోటి పీఠం 68 వ పీఠాధిపతిగా *శ్రీచన్ద్రశేఖరేంద్ర సరస్వతీ* నామధేయంతో 13 ఏళ్ళ స్వామినాథన్ నియమితులయ్యారు. స్వామినాథన్ వద్దకు చేరుకున్న తల్లిదండ్రులను ఆ బాల సన్యాసి ఓదార్చి ఇంటికి పంపిస్తారు.
🙏 1907 మే, 9 న కుంభకోణం క్షేత్రంలో చన్ద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారి పీఠాధిరోహణ మహోత్సవం జరిగింది. పీఠాన్ని అధిరోహించిన తరువాత వేదాలను, శాస్త్రాలను, పురాణాలను, హైందవ ధర్మాలను అభ్యసించడానికి చంద్రశేఖరుల వారు ఎంతో ఆసక్తి చూపారు. భక్తులనుంచి దూరంగా ఉండేందుకు మహేంద్ర మంగళం అనే కుగ్రామంలో వైదిక విద్యాభ్యాసం ప్రారంభించారు. ఎంతోమంది మహా మహోపాధ్యాయులు ఆ బాలుడి వైదిక ప్రతిభను వీక్షించి ఆశ్చర్యపోయారు.
*అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం*
*శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం।।*
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి