13, మే 2025, మంగళవారం

🙏శ్రీ కుచేలోపాఖ్యానము :🙏 మూడవ భాగం

 🙏శ్రీ కుచేలోపాఖ్యానము :🙏

మూడవ భాగం 

కని డాయం జనునంతఁ గృష్ణుఁడు దళత్కంజాక్షుఁ డప్పేద వి

ప్రుని నశ్రాంత దరిద్రపీడితుఁ గృశీభూతాంగు జీర్ణాంబరున్

ఘనతృష్ణాతురచిత్తు హాస్యనిలయున్ ఖండోత్తరీయుం గుచే

లుని నల్లంతనె చూచి సంభ్రమ విలోలుండై దిగెం దల్పమున్.

(చాలా గొప్ప పద్యం )

 టీక:- కని = చూసి; డాయన్ = దగ్గరకు; చనున్ = పోవుచుండగా; అంత = అంతలో; కృష్ణుడు = కృష్ణుడు; దళత్ = వికసించుచున్న; కంజా = పద్మములవంటి; అక్షుడు = కన్నులు కలవాడు; ఆ = ఆ; పేద = బీద; విప్రునిన్ = బ్రాహ్మణుని; అశ్రాంత = ఎడతెగని; దరిద్ర = బీదతనముతో; పీడితున్ = పీడింపబడువానిని; కృశీభూతున్ = చిక్కిపోయి ఉన్నవానిని; జీర్ణ = శిథిలమైన, చినిగిన; అంబరున్ = వస్త్రములు కలవానిని; ఘన = మిక్కుటమైన; తృష్ణ = ఆశచేత; ఆతుర = ఆతృత చెందిన; చిత్తున్ = మనస్సు కలవానిని; హాస్య = హాస్యరసము; నిలయున్ = స్వభావమున కలవానిని; ఖండ = చిరిగిన; ఉత్తరీయున్ = పైబట్ట కలవానిని; కుచేలునిన్ = కుచేలుడిని {కుచేలుడు - పాడైన చేలము కలవాడు}; అల్లంతనె = అంత దూరమునుండె; చూచి = చూసి; సంభ్రమ = తొట్రుపాటుతో; విలోలుండు = చలించువాడు; ఐ = అయ్యి; దిగెన్ = దిగెను; తల్పమున్ = పానుపును.

 భావము:- కుచేలుడు కృష్ణుడి దగ్గరకు వెళ్తుండగా. నిరంతర దారిద్ర్య పీడితుడూ; కృశించిన అంగములు కలవాడూ; చినిగిన వస్త్రములు ధరించినవాడూ; ఆశాపూరిత చిత్తుడూ; హాస్యానికి చిరునామా ఐన వాడు; అయిన కుచేలుడు వస్తుంటే అల్లంత దూరంలో చూసిన పద్మాల రేకుల వంటి కన్నులు కల శ్రీకృష్ణుడు ఎంతో సంభ్రమంగా గబగబా పానుపు దిగాడు.


23


కర మర్థి నెదురుగాఁ జని

పరిరంభణ మాచరించి, బంధుస్నేహ

స్ఫురణం దోడ్తెచ్చి, సమా

దరమునఁ గూర్పుండఁ బెట్టెఁ దన తల్పమునన్.

 టీక:- కరము = మిక్కిలి; అర్థిన్ = ప్రీతితో; ఎదురుగాన్ = ఎదురు; చని = వెళ్ళి; పరిరంభణము = ఆలింగనము; ఆచరించి = చేసి; బంధు = బందువుకాని; స్నేహ = మిత్రుడుకాని; స్ఫురణన్ = అన్నట్లు తోచగా; తోడ్తెచ్చి = కూడా తీసుకు వచ్చి;; సమ = మిక్కిలి; ఆదరమునన్ = ఆదరణతో; కూర్చుండబెట్టెన్ = కూర్చోబెట్టుకొనెను; తన = తన యొక్క; తల్పమునన్ = మంచముమీద.

 భావము:- ఆదరాభిమానాలతో కుచేలుని కెదురుగా వెళ్ళి శ్రీకృష్ణుడు అతనిని కౌగలించుకున్నాడు. స్నేహ పూర్వక అనురాగం ఉట్టిపడేలా స్వాగతం పలికి ఆప్యాయంగా తోడ్కొనివచ్చి తన పాన్పు మీద కూర్చుండ బెట్టాడు.


అట్లు గూర్చుండఁ బెట్టి నెయ్యమునఁ గనక

కలశ సలిలంబుచేఁ గాళ్ళు గడిగి భక్తిఁ

దజ్జలంబులు దనదు మస్తమునఁ దాల్చి

లలిత మృగమద ఘనసార మిళిత మైన.

 టీక:- అట్లు = ఆ విధముగా; కూర్చుండబెట్టి = ఆసీనునిచేసి; నెయ్యమునన్ = స్నేహభావముతో; కనక = బంగారు; కలశ = పాత్రలలోని; సలిలంబు = నీళ్ళ; చేన్ = చేత; కాళ్ళు = పాదములు; కడిగి = శుభ్రముచేసి; భక్తిన్ = భక్తితో; తత్ = ఆ; జలంబులున్ = నీళ్ళను; తనదు = తన యొక్క; మస్తమునన్ = తలపై; తాల్చి = ధరించి; లలిత = చక్కటి; మృగమద = కస్తూరి; ఘనసార = పచ్చకర్పూరము; మిళితము = కలపబడినది; ఐన = అయినట్టి.

 భావము:- అలా కుచేలుడిని కూర్చుండ బెట్టి, పిమ్మట శ్రీకృష్ణుడు బంగారు కలశంలో నీళ్ళు తీసుకు వచ్చి ఆయన పాదాలను కడిగాడు. ఆ జలాన్ని భక్తితో శిరస్సు మీద చల్లుకున్నాడు. పిమ్మట మనోహర మైన కస్తూరి, పచ్చకర్పూరపు మైపూతలు తీసుకుని....


25


మలయజము మేన జొబ్బిల్ల నలఁది యంత

శ్రమము వాయంగఁ దాళవృంతమున విసరి

బంధురామోదకలిత ధూపంబు లొసఁగి

మించు మణిదీపముల నివాళించి మఱియు.

 టీక:- మలయజమున్ = మంచిగంధమును; మేనన్ = శరీరము నందు; జొబ్బిల్లగన్ = నిండారునట్లుగా; అలది = రాసి; అంత = పిమ్మట; శ్రమము = బడలిక; వాయన్ = తొలగునట్లు; తాళవృంతమునన్ = తాటాకు విసనకఱ్ఱతో; విసరి = విసిరి; బంధుర = అధికమైన; ఆమోద = పరిమళముతో; కలిక = కూడుకొన్న; ధూపంబున్ = ధూపములు; ఒసగి = ఇచ్చి; మించు = అతిశయించునట్టి; మణి = రత్నాల; దీపములన్ = దీపములతో; నివాళించి = ఆరతిచ్చి; మఱియున్ = ఇంకను.

 భావము:- ఆ మనోజ్ఞ మైపూతలు కుచేలుని శరీరానికి ప్రీతితో అలది, మార్గాయాసం తీరేలా స్వయంగా ఆప్తమిత్రుడు కుచేలునికి విసన కఱ్ఱతో విసిరాడు. అగరధూపం వేసి, మణిమయ దీపాలతో నివాళులు అర్పించాడు.


26


సురభికుసుమ మాలికలు సిగముడిం దుఱిమి, కర్పూరమిళిత తాంబూలంబు నిడి, ధేనువు నొసంగి, సాదరంబుగా స్వాగతం బడిగిన నప్పు డవ్విప్రుండు మేనం బులకాంకురంబు లంకురింప నానందబాష్ప జలబిందు సందోహుం డయ్యె; నట్టియెడం బద్మలోచనుండు మన్నించు నంగనామణి యగు రుక్మిణి కరకంకణ రవంబు లొలయం జామరలు వీవం దజ్జాత వాతంబున ఘర్మసలిలంబు నివారించుచుండఁ జూచి శుద్ధాంత కాంతానివహంబులు దమ మనంబుల నద్భుతం బంది యిట్లనిరి.

 టీక:- సురభి = సువాసన కల; కుసుమ = పూల; మాలికలు = దండలు; సిగముడిన్ = జుట్టుముడి యందు; తుఱిమి = ముడిచి, పెట్టి; కర్పూర = కర్పూరము; మిళిత = కలిపిన; తాంబూలంబున్ = తాంబూలమును; ఇడి = ఇచ్చి; ధేనువున్ = ఆవును; ఒసంగి = ఇచ్చి; సాదరంబుగా = ఆదరణతో; స్వాగతంబున్ = కుశలప్రశ్నలు; అడిగినన్ = అడుగగా; అప్పుడు = అప్పుడు; ఆ = ఆ; విప్రుండు = బ్రాహ్మణుడు; మేనన్ = దేహమున; పులకాంకురంబులు = పులకింతలు; అంకురింపన్ = కలుగుగా; ఆనంద = సంతోషమువలని; బాష్ప = కన్నీటి; జల = నీటి; బిందు = బిందువుల; సందోహుండు = సమూహము కలవాడు; అయ్యెన్ = అయ్యెను; అట్టి = అటువంటి; ఎడన్ = సమయము నందు; పద్మలోచనుండు = కృష్ణుడు; మన్నించు = గౌరవించు; అంగనా = భార్యలలో; మణి = ఉత్తమురాలు; అగు = ఐన; రుక్మిణిన్ = రుక్మిణీదేవి; కర = చేతుల; కంకణ = గాజుల; రవంబు = ధ్వనులు; ఒలయన్ = వ్యాపించగా; చామరలు = వింజామరలు; వీవన్ = వీస్తుండగా; తత్ = వాటినుండి; జాత = పుట్టిన; వాతంబునన్ = గాలితోటి; ఘర్మ = చెమట; సలిలంబు = నీరు; నివారించుచుండన్ = తొలగించుచుండ; చూచి = చూసి; శుద్దాంత = అంతఃపురపు; కాంతా = స్త్రీల; నివహంబులు = సమూహములు; తమ = వారి యొక్క; మనంబులన్ = మనస్సులందు; అద్భుతమున్ = ఆశ్చర్యమును; అంది = పొంది; ఇట్లు = ఈ విధముగా; అనిరి = పలికిరి.

 భావము:- కుచేలుడి సిగలో పూలదండలు ముడిచి, కర్పూరతాంబూలం ఇచ్చి, గోదానం చేసి, ఆదరంగా కుశలప్రశ్నలు అడిగాడు. అప్పుడు కుచేలుడి శరీరం పులకించింది, కన్నుల నుండి ఆనందాశ్రువులు జాలువారాయి. శ్రీకృష్ణుని పట్టపురాణి రుక్మిణి చేతి కంకణాలు ఘల్లుఘల్లు మంటుంటే వింజామరము వీచింది. ఆ చల్లని గాలికి కుచేలుని మార్గాయాసం తీరింది. ఈ దృశ్యాన్ని చూసిన అంతఃపురకాంతలు విస్మయంతో ఇలా అనుకున్నారు.

 ( కుచేలుడు పొందిన సత్కారం పోతన గారు అద్భుతముగా వర్ణించారు )

               సశేషం 

సమర్పణ

మారేపల్లి ఉదయ భాస్కర శర్మ

కామెంట్‌లు లేవు: