13, మే 2025, మంగళవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*కర్ణ పర్వము ప్రథమాశ్వాసము*


*375 వ రోజు*


*దేవతలు బ్రహ్మదేవునితో చేరి ఈశ్వరుడిని వేడుకొనుట*


దేవతలు, మునులు, ఇంద్రుడు, బ్రహ్మదేవునితో చేరి శివుని వద్దకు చేరి " పరమేశ్వరా ! నీవు జ్ఞానమూర్తివి, సత్యస్వరూపుడవు నీకు తెలియనిది లేదు " అని స్తుతించగా ఈశ్వరుడు " సంతోషించి ఏమి కావాలి ? " అన్నాడు. బ్రహ్మ పరమేశ్వరునితో " పరమేశ్వరా ! నీవు నన్ను ప్రజాపతిగా చేసావు. ఆ అధికారమును వినియోగించి నేను ఈ ముగ్గురు రాక్షసులకు వరములు ప్రసాదించాను. వారు ఆ వరగర్వంతో మూడు పురములు నిర్మించుకుని ముల్లోకాలను గడగడలాడిస్తున్నారు. ఇంద్రునికి కూడా అతడిని గెలువ శక్యము కాలేదు. నీవుగాక వారిని సంహరించగల వారు లేరు. కనుక అందరమూ నిన్ను శరణు జొచ్చాము. ఆ రాక్షసులను సంహరించి ముల్లోకములను కాపాడాలి " అని వేడుకున్నారు. ఈశ్వరుడు " బ్రహ్మదేవా ! నీను చెప్పినది నిజమే. వారు చంపదగిన వారే అయినా వారు మహాబలవంతులు నేను ఒక్కడినే వారిని జయించ లేను. కనుక నేను నా తేజస్సులో సగభాగము ఇస్తాను మీరంతా వారిని సంహరించండి " అన్నాడు. దేవతలు " పరమేశ్వరా ! ఆ మువ్వురి బలముకంటే మా బలము సగమే ఉంది కనుక మేము వారిని గెలువలేము. నీ మహా తేజస్సు మేము భరించరానిది. కనుక మా శక్తులను మీకు ధార పోస్తాము. కనుక నీవే వారిని సంహరించు " అన్నాడు. ఆ మాటలకు శివుడు " దేవతలారా ! నాకు మీరు రాక్షసులు సమానమే. అంతే కాదు నాకు సర్వప్రాణులు నాకు సమానమే. అందరికీ సమానంగా ఆనందం కలిగిస్తాను కనుక నాకు శివుడు అనే నామం వచ్చింది. దుష్టశిక్షణ శిష్టరక్షణ నా కర్తవ్యం. పరులను పీడించే దుర్జనులను సంహరించి ధర్మవర్తనులైన మిమ్ము రక్షిస్తాను. కనుక మీరంతా మీ తేజస్సు బుజ బలము నాకు చెందేలా చేయండి. నేను ఈ కార్యము నిర్వహించడానికి ముల్లోకములకు పశుత్వము నాకు పశుపతిత్వము కావాలి నేను ఈ కార్యము చేయడానికి నాకు పశుపతిత్వము కావాలి ఈ లోకాలకంత పశుత్వము కావాలి. అప్పుడు కాని పశువులను చంపిన పాపం నన్ను అంటదు. మీరందరూ కలిసి నాకు ఒక దివ్యరధమును, ఒక సారథిని, దివాశ్వములను, ఒక విల్లు, ఒక బాణం కావాలి. అప్పుడు నేను ఆ రాక్షసుల మూడు పురములను ఒక్కసారిగా నాశనం చేయగలను.


*పాశుపత వ్రతము*


శివుని మాటలు విన్న దేవతలు సంకోచిస్తూ తలలు వంచుకున్నారు. తమకు కూడా పశుత్వము వస్తుంది అని శకించారు. వారి అనుమానం అర్ధం చేసుకున్న శివుడు దేవతలారా ! మీరు భయపడ వద్దు. మీకు కలిగిన పశుత్వము నుండి బయటపడటానికి ఒక మార్గం ఉంది. మీరంతా పాశుపత వ్రతం ఆచరించి మీ పశుత్వము పోగొట్టుకొని మోక్షము పొంద వచ్చు. ఆ వ్రతము పన్నెండు సంవత్సరములు చేయవలెను. చేసే వారి నిష్టానుసారం ఒక సంవత్సరము కాని ఆరు నెలలు కాని, ఒక రుతువులో కాని, ఒక మాసముకాని, కనీసం పన్నెండు దినములలో కాని ఫలితం ఇస్తుంది. ఆ మాటలకు దేవతలు సమ్మతించి అన్ని లోకములకు పశుత్వము రావడానికి అంగీకరించి. శివునకు పశుపతిత్వము కలగడానికి ఒప్పుకుని అతడిని పశుపతిగా కీర్తించారు. దేవతలంతా తమ తేజస్సులో సగము శివునకు ధారపోసారు. ఆ తేజస్సును అందుకున్న పరమ శివుడు తేజోవంతుడయ్యాడు. ఇంద్రుడు దేవతలతో కూడి శివుడిని త్రిపురాసుర సంహారానికి అభిషేకించారు. దేవతలందరూ త్వష్ట ప్రజాపతిని చూసి శివుడికి మహోత్కృష్టమైన ఒక విల్లును, ఒక రథమును, అమ్మును, హయములను తయారు చేసి ఇమ్మని అడిగారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: