18-25-గీతా మకరందము.
మోక్షసన్న్యాసయోగము
-పూజ్యశ్రీశ్రీశ్రీ విద్యాప్రకాశానందగిరి స్వాములవారు,
శ్రీశుకబ్రహ్మాశ్రమము, శ్రీకాళహస్తి.
అ| తామసకర్మను పేర్కొనుచున్నారు-
అనుబంధం క్షయం హింసాం
అనపేక్ష్య చ పౌరుషమ్ వెూహాదారభ్యతే కర్మ యత్తత్తామసముచ్యతే.
తా:- తానుచేయు కర్మకు మున్ముందు కలుగబోవు దుఃఖాదులను (ధనాదుల) నాశమును, (తనయొక్క, ఇతరులయొక్క శరీరాదులకుగలుగు) బాధను, తన సామర్థ్యమును ఆలోచింపక, అవివేకముతో ప్రారంభింపబడు కర్మము తామసకర్మయని చెప్పబడుచున్నది.
వ్యాఖ్య: - తామసకర్మావలంబి ముందు వెనుకలు ఆలోచింపక కర్మలు ప్రారంభించును. ఆ కర్మవలన కలుగబోవు దుఃఖములను గురించి విచారింపడు. ఇతరులకు దానివలన కలుగు బాధనుగూడ యోచింపడు. తనశక్తిసామర్థ్యములనుగూడ చూచుకొనడు. అవివేకముతో గ్రుడ్డిగా కర్మలుచేయు మొదలిడును. అట్టివాడు చేయు కర్మ మహాప్రమాదభూయిష్టమైయుండును గావున అది సర్వదా త్యాజ్యమేయగును.
మరియు సామాన్యముగ భగవద్విముఖుడై, స్వార్థసాధనకొఱకు గావించు దృశ్యవిషయసంపాదనారూపమైన కర్మలన్నియు రాజస, తామస క్రియలక్రిందకే వచ్చును. ఏలయనిన, వానిచే తన ఆత్మకు కలుగు నష్టము (సంసారబంధము) నతడు ఆలోచించుటలేదు.
"మోహాత్" - అనుటవలన ఈ రాజస, తామసక్రియలన్నిటికిని మూలకారణము అవివేకము, అజ్ఞానము అయియున్నదని స్పష్టమగుచున్నది. కాబట్టి మొట్టమొదటవివేకమును సంపాదించి ఇట్టి రాజస తామసాది వృత్తులను త్యజించి జీవితమును సంస్కరించుకొనవలయును.
ప్ర: - తామసకర్మ ఎట్టిది?
ఉ: - ముందు కలుగబోవు దుఃఖాదులను, (ధనాదుల) నాశమును, (దేహాదుల) బాధను తన సామర్థ్యమును ఆలోచింపక అవివేకముతో గ్రుడ్డిగా నాచరింపబడు కర్మము తామసకర్మమనబడును.
ప్ర: - ఇట్టి తామస ప్రవృత్తికి కారణమేమి?
ఉ- అవివేకము.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి